అక్కడంతా నిర్మానుష్యం
అది ఏ మృత్యువుల తదనంతరమో
పురాస్మృతుల జాడల కోసం
అక్కడక్కడ కొన్ని యెదల నిట్టూర్పులు
రెండు వెదురుబొంగుల్ని మోసుకొస్తున్న
బక్కపల్చటి నడివయస్కుడు
కళ్లను కండువాతో తుడుచుకుంటూ
కడలి వద్దకు కడువతో ఒకడు
దిగాలుపడ్డ గుమ్మానికి ఎండిపోయిన తోరణాలు
పందిరి కింద నులకమంచంపై
కళ్లజోడు మూడో కాలుతో ఓ ముసలాయన
వెలగని పొయ్యిబూడిదలో పిల్లి పిల్లలు
ఎనగర్రకు వేళ్లాడుతున్న ఉట్టి తాళ్లపై పిట్ట పిల్లలు
కాలధర్మపు క్రియల్లో
తూలుతూ దుఃఖాన్ని మింగేస్తున్నారు కొందరు
చివరిచూపునకు చుట్టమొకడు వచ్చినట్టుండు
ఏడుపులు, పెడబొబ్బలు మళ్లీ షురూ..
చివరి ప్రయాణం మొదలయ్యింది
వాళ్లకు శ్మశానమే లేదక్కడ
ఆరుబైటే అందరూ కేటాయించుకున్నారు
మంగళవారమట పాడెకు కోడిని కట్టాడొకడు
బుక్కాగులాల్ గోవిందా..గోవిందా..
వరుసైన వాళ్లంతా వరుసలు కట్టారు
మనుషులే నడుస్తున్నారు
మనసును ఎక్కడో పోగొట్టుకుని
కొన్ని అడుగులు ఊరవతల అడవి
ఎంత ప్రశాంతంగా ఉందో..
మానవ మృగాలేవీ లేవక్కడ
భగభగల సూరీడు నెత్తిమీద పొడుస్తున్నాడు
నీళ్ల కరువో నిష్ఠ కరువో
ఒళ్లంతా నీళ్లు చల్లుకుంటున్నారు
కన్నీళ్లతో తడిసి ముద్దయిన దేహాన్ని
ఇంకేం తడుపుకుంటారులే..
కొన్ని సత్యాలతో, కొన్ని అసత్యాలతో
అక్కడోళ్ల కళ్లల్లో వేదాన్ని నిర్వేదాన్ని పోగేసింది
బతుకుల మధ్య భగ్గుమన్న కాష్ఠం..!
– డా.కటుకోఝ్వల రమేష్ 9949083327