పౌరాణికంలో కాళిదాసు ఊర్వశీ
ఆధునికంలో రవీంద్రుని ఊర్వశీ
అరవిందుని ఊర్వశీ,
కృష్ణశాస్త్రి ఊర్వశీ విశిష్ట
నాయికలుగా కనిపిస్తారు.
అట్లాగే తెలుగులో
విశ్వనాథ కిన్నెరసాని
రాయప్రోలు నష్టనమల
నాయని వత్సల
నండూరి ఎంకి
సి. నారాయణరెడ్డి లకుమ.
సినారె లకుమ కర్పూర వసంతరాయలు కావ్యం లోనిది. ఇదొక కథాకావ్యం. ఈ కావ్యం ఆయన 1957లో రాశారు. ఇందులో ముఖ్యపాత్ర లకుమ. లకుమ తెలుగు సాహిత్యంలో విలక్షణమైన కావ్యనాయిక. ఇది చారిత్రాత్మకమైన పరిస్థితుల నేపథ్యంలో రాసిన కాల్పనిక గాథ. కథాకావ్యాలు రాయడంలో అందెవేసిన చెయ్యిగా పేరొందిన సినారె చారిత్రక కావ్యాలకు గుర్తింపును, ఉదాత్తతను సమకూర్చారు. ఈ కావ్యంలోని పాత్రలను ఆయన సృష్టించటమే కాకుండా చక్కని సన్నివేశాలను కల్పించి, కల్పనల ద్వారా, కథనం ద్వారా వాటికి ప్రాణం పోశారు. కవితాత్మకతతో శక్తివంతం చేశారు. దానికి తోడు ఉపమలు, ఉత్రేక్షలు, వ్యంజనలు, ధ్వని ఈ కావ్యానికి సొగసులను ఇనుమడింపజేశాయి. ఈ చారిత్రక కావ్యానికి శృంగారం, కరుణ, వీరరసాలను రంగరించి రసిక హృదయాల ముందు ఆవిష్కరించారు. వీటన్నిటి సమాహారమే కర్పూర వసంతరాయలు అనే కావ్యం. అడుగడుగునా నూతన పదబంధాలు, గారవించే భావ సుగంధాలు ఈ కావ్యానికి ప్రత్యేకమైన ఆభరణాలు.
కర్పూర వసంతరాయలు అనే బిరుదు కొండవీటి కుమారగిరిరెడ్డికి ఉండేది. రెండవ ఆశ్వాసంలో లకుమ, వసంతరాయలు.. ఇద్దరి విరహావస్థను కవి విశేషమైన రీతిలో అభివర్ణించారు. రాజు ఇచ్చిన రత్నహారాన్ని లకుమ కలలో పాములా అనుకుని భయపడిన ఘట్టాన్ని కవి చక్కగా మలిచారు. ఈ కథనానికి కొంతవరకు ప్రబంధ శైలితో పోలికలు ఉన్నమాట వాస్తవమే. కానీ భాష లలితమై, సరళమైన కలకండ తీపిని తెలుగుకు అద్దాయి, పద్యాల నడకలో వయ్యారం కనిపిస్తుంది.
లకుమ, ఆమె లావణ్యం, ఆమె నాట్యం చూసి రాజు ఎదలో ప్రేమ అంకురిస్తుంది. అది కాలక్రమంలో వటవృక్షమై అతనిని నిదురపోనీయకుండా చేస్తుంది. రాజుకు, నాట్యగత్తెతో ప్రేమ అనే భావనే వినూత్నమైనది.
వెండి గజ్జల రవళియే
కవ్వించునా నన్నింతగా?
గుండె గజ్జలలోన చొరబడి
యుండెనేమో వింతగా
అని తనలో తాను వాపోయాడు..
ఆటవెలదుల ఇంటి పడుచే
నాటికైనను కాదు లకుమ
శప్తయై దివి నుండి భువిపై
జారి వచ్చిన అచ్చర సుమ
విరహావస్థలో పాన్పుపై చల్లిన పువ్వులు ముళ్లుగా తోస్తున్నవి. సవాలక్ష ఊహలు వస్తున్నవి. ప్రకృతిలో అన్నీ హాయిగా నిద్రపోతున్నవి. ఈ సంగతి కవి చూసి ఈ విధంగా రాశాడు.
నేల నిదురవోయె
నింగి నిదురవోయె
గాలి నిదురవోయె రేడో
కందె అదిరిపోయె
ఒక్క రాజే అదిరిపోయి, నిప్పుల లాంటి పాన్పు మీద పొరలుతూ ఉంటాడు. మరి అక్కడ లకుమ అవస్థ అట్లాగే ఉంటుంది.
ఇచట రాజునుబోలె లకుమయు
అచట వెర్రిగ పొరలె పాన్పున
ఆమెకు అదే అద్దరాతిరి
అదే తారలు, అదే జాబిలి
ఆమె వింతగా కలగంటుంది. తాను రాధగా, వసంతరాయలు వేణుగోపాలుడిగా, తర్వాత తన శరీరానికి అలంకరణమైన నాగమణి పాములా బుసకొట్టింది. ఆమె కెవ్వున కేకవేసి లేచి చూసుకున్నది.
కన్నులు విప్పెను లకుమ
ప్రకంప్యమాన మానసయై
దిక్కులు చూచెను లకుమ,
అతిస్విన్న శరీరకయై
నృత్యము సాగగా, సాగగా, రాజు తన్మయుడవుతాడు. చిన్మయుడవుతాడు. అతని ప్రాణాలు ఆమెయందే లగ్నమవటం వలన, అతను ఆనందపరవశుడై ఆసీనం నుంచి లేచే సమయం చూసి, రాణి అతనిని మర్యాద పాటించమని ఆపుతుంది. మహారాజు ఆమె నా ట్య కౌశల్యాన్ని మెచ్చుకొని మెడలోని రత్నాల హారాన్ని లకుమ మెడలో వేస్తాడు. దండతోపాటు అతని చేతులు కూడా ఒక్క క్షణం దం డలా అమరుతాయి ఆమె కంఠసీమలో. ఇది రఘువంశంలో అజ మహారాజు మెడలో ఇందుమతి మాల వేసినప్పుడు దృశ్యంలా అగుపిస్తుంది. ప్రజల హర్షధ్వానాలు ఆకాశాన్ని అంటుతాయి. అప్పుడు..
సిగ్గుతో తలవాల్చి
మొగ్గయయ్యెను లకుమ
ఆమె కన్నులు మూసుకుని
హృదయమును మూయగ
లేక యేడ్చెను
ఆమె జాలి గుండె. తొణకని కుండ. గుండె భారాన్ని దించటానికి కడుపు చెరువు చేసుకున్నది. అంతర్మథనంతో నలిగిపోతున్నది. ఎటూ పాలుపోని స్థితి తనది. అప్పుడు గద్గద స్వరంతో ఇలా అన్నది..
ఎటుల వాగ్దానమ్ము తీర్తును
ఎటుల రాయని వీడ నేర్తును
ఎందుకీ
హృదయమ్మునిచ్చితి
వీశ్వరా! ఈ సానిదానికి.
బంధాలు, అనుబంధాలతో నలిగిన వారిద్దరి ప్రేమను ఎంతో అందంగా చిత్రిస్తాడు కవి.
లకుమయే రాణ్మాళి
బ్రతుకునావను నడుపు చుక్కాని అంటూ
మరో ఉపమానం వేస్తాడు కవి.
ఆమె కన్నులు విరిసినంతనే
అతడు పగలనుకొనును
ఆమె కన్నులు మోడ్చినపుడే
రాతిరి యయ్యెననుకొనును
కొండవీటి ప్రభువైన వసంతరాయలు తమ పరస్పర ప్రేమ జీవితాన్ని ఆరని కర్పూరజ్యోతిగా వెలిగించాడు. కాబట్టి కర్పూ ర వసంతరాయలు తనువు, ఆత్మ, సర్వ మూ ఆమెలో లీనమైపోయాయి. పంచభూతాత్మకమైన నిఖిల సృష్టికి లకుమనే ప్రతీక గావించా డు. పృథ్వీ ఆమె కటిచక్రము, జలమా యె కంటిపాపల లోతులు, తేజము ఆమె ముఖరాజీవ ము, వాయుగతి ఆమె నిశ్వాసాలు, ఆకాశము మధ్య ము. అతని దృష్టి, ఆమె ముఖము కురమ్ములో తన మోము సరిచూసుకునేవాడట. ఆమె కనుపాపల్లో కురులు దిద్దుకొనేవాడట.
నేను పునర్జన్మమ్మెత్తితేని
ప్రభూ! రసికతామహాలయమౌ
మీ యువ హృదయముగా
జన్మింతుగాత!
సౌందర్యాన్వేషకులకు రమణీయమైన వాతావరణాన్ని సృష్టించి, తనదంటూ ఒకానొక మార్గంలో పరిమళభరితమైన పువ్వుల వాటికలో మృదుమధురమైన సంభాషణ చాతుర్యంతో వసంతరాయ స్వప్నసీమకు తీసుకెళ్లి, కల్పనలతో, చిత్రవిచిత్ర దృశ్యాలను ఆవిష్కరిస్తాడు. శబ్ద మాధుర్యంతో లయను సమకూరుస్తాడు. పరమాద్భుతమైన రీతిలో ఈ కథాకావ్యాన్ని నడిపించి అపురూపమైన రీతిలో మనకు అందించారు సినారె.
– కె. ప్రభాకర్