పున్నమి నాడు పుట్టిందని పూర్ణిమ అనీ, కార్తిక మాసంలో పుట్టాడని కార్తిక్ అనీ… ఇలా పుట్టిన నక్షత్రాన్నీ, రోజునీ, మాసాన్నీ బట్టి పేర్లు పెట్టుకోవడం మనకు అలవాటే. అచ్చం అలాగే మనం ఓ రకం పూలకీ పేరు పెట్టాం. అవే డిసెంబరాలు. కనకాంబరాలు, నీలాంబరాల్లాగే డిసెంబర్లో పుట్టిన వీటిని డిసెంబరాలు అని ప్రేమగా పిలుచుకుంటాం. ఎన్నెన్నో రంగుల్లో విరబూసే ఈ పూల వెనుక మరెన్నో సంగతులున్నాయి.
చలికాలం రాగానే వాకిట్లో ఫ్లవర్వేజ్ పెట్టినట్టు చెట్టునిండా పూస్తాయి డిసెంబర్ పూలు. ఇక, పూల బుట్ట చేత బట్టి, అందమైన మాల కట్టి జడతో దానికి జట్టు కట్టడమే మన పని. పొడవుగా ఉండే పూలు కనుక లావైన దండ ముస్తాబవుతుంది వీటితో. ఈ నెలలో పూస్తాయి కాబట్టి డిసెంబర్ పూలు అంటాం కానీ వీటి అసలు పేరు బార్లీరియా. ఇందులో 300 రకాల దాకా రకాలు ఉన్నాయట. తెలుపు, గులాబీ, నీలం, ఊదా, లావెండర్ రంగులు ఎక్కువగా ఉంటాయి. మనకు ఎక్కువగా పరిచయం లేని ఎరుపు రంగు కూడా ఈ రకంలో పూస్తుంది. ఇవి భారత్తో పాటు చైనా, తైవాన్, అమెరికా, ఆఫ్రికా, అరేబియన్ దీవులు, ఈజిప్ట్… ఇలా ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లోని ఉష్ణ, సమశీతోష్ణ మండలాల్లో పెరుగుతాయి. పెరిగే చోటును బట్టి సెప్టెంబర్ మొదలు జనవరి దాకా బాగా పూస్తాయివి. ఒక రకంగా చెప్పాలంటే మంచుకురిసే మాసపు రంగుల మల్లెలన్నమాట.
బార్లేరియాలకు సంబంధించిన ఆసక్తికర అంశం ఏమిటంటే మన దగ్గర పెరిగే ముళ్ల గోరింట పువ్వులు కూడా ఈ రకానికి చెందినవే. ముళ్ల గోరింటనే వజ్రదంతి అని కూడా పిలుస్తారు. ఈ చెట్టు ఆకుల రసం పళ్లను వజ్రాల్లా బలంగా ఉంచేందుకు సాయపడుతుందట. ఇదనే కాదు, బార్లేరియాలో చాలా జాతుల్ని పూర్వకాలపు మందుల నుంచీ నేటి మోడ్రన్ మెడిసిన్ వరకూ వివిధ వ్యాధులకు ఔషధంగా వినియోగిస్తున్నారు. ఆయుర్వేదంలోనూ దీనికి ఎంతో ప్రశస్తి ఉంది. యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ వైరల్ గుణాలున్న ఇది చిగుళ్ల నుంచి రక్తాన్ని కారడం ఆపడంతో పాటు, అల్సర్లను నివారిస్తుంది.
కోరింత దగ్గు, మధుమేహంలాంటి వాటి నియంత్రణకు ఉపయోగపడుతుంది. అంతేకాదు, క్యాన్సర్లను నివారించడంలోనూ ఈ మొక్క ప్రభావవంతంగా పనిచేస్తుందట. దీని వేళ్లను పాము, తేలు కాటుకు చేసే వైద్యంలో వినియోగిస్తారు. దీని ఆకుల రసాన్ని కాళ్ల పగుళ్లను తగ్గించేందుకు వాడతారు. ఇక, ఎంతో అందంగా చెట్టు నిండా విరబూసే ఈ పూలు సీతాకోక చిలుకల్ని విపరీతంగా ఆకర్షిస్తాయి. వాటి లార్వాలు ఏర్పడేందుకు అనుకూలంగా ఉంటాయి. ఈ పూలు ఎంత తీయగా ఉంటాయో సీతాకోక చిలుకలకేంటి, పువ్వు తెంపి చివర చప్పరించిన వారందరికీ తెలిసిందే. అందుకే ఈ చెట్టుకు తేనె పూవు చెట్టన్న పేరూ ఉందన్న మాట!