ఇది చేగూరి సరిత ఇల్లు. వీళ్లంతా రేపటి లేడీస్ టైలర్స్. సరిత వాళ్ల టీచర్. ఆమె ఎం.ఎ తెలుగు చదివింది. బి.ఎడ్ చేసింది. కొంతమంది టీచర్లు ఇంటి దగ్గర పిల్లలకు ట్యూషన్లు చెబుతూ అదనపు సంపాదన కోసం కష్టపడుతుంటారు. సరిత మాత్రం పేద తల్లులు సంపాదించుకోవడం కోసం ఇంటి దగ్గర కుట్టుపని పాఠాలు చెబుతున్నది. కరోనా కష్టకాలంలో తనకాళ్ల మీద తాను నిలబడేందుకు కుట్టు మెషిన్ చక్రం తిప్పింది. టీచర్ కాస్తా టైలర్‌గా మారింది. ఆ టైలర్ మళ్లీ టీచర్‌గా మారడానికి ఎన్నో రోజులు పట్టలేదు. తనలాంటి పేద తల్లులకు బతుకు పాఠాలు చెబుతుంటే ఆ ఇల్లే బడిగా మారింది!
హైదరాబాద్‌లోని ఉప్పల్ దగ్గర్లో ఉంటుంది నాచారం. అక్కడి సూర్యానగర్ కాలనీలో ఉంటుంది సరిత. తెలుగు యూనివర్సిటీలో యోగాలో పీజీ డిప్లొమా చేసిన ఆమె పాఠశాలల్లో ట్రైనర్‌గా పని చేసేది. వాళ్ల ఆయన కూడా ప్రైవేటు స్కూల్లో పీఈటీగా చేసేవాడు. ఇద్దరూ ఉద్యోగాలు చేస్తూ జీవనం సాగిస్తున్న రోజులవి. కరోనా వచ్చిన తర్వాత బడులన్నీ మూతపడ్డాయి. ప్రైవేటు టీచర్లకు జీతాల్లేవు. బతకడానికి బయట పనీ లేదు. కుట్టు మెషిన్ పెట్టుకుని అయినా సంసార సాగరాన్ని ఈదాలని నిశ్చయించుకుంది సరిత. రెండు జతలు కుడితే నాలుగు రాళ్లు సంపాదించుకోవచ్చే ఆలోచన బాగానే ఉంది. కానీ, కుట్టు మెషిన్ కొనడానికి డబ్బుల్లేవు. ఎక్స్‌ట్రామైల్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు మందా నాగమోహన్ చొరవ చేసి ఓ కుట్టు మెషిన్ కొనిచ్చారు. జన ప్రగతి ఛారిటబుల్ ట్రస్ట్ నడిపే శరత్ చంద్ర పికో పాల్స్ కుట్టుమెషిన్ ఇప్పించారు. అలా ఇంటిపట్టునే ఉంటూ చుట్టుపక్కల వాళ్లకు కావాల్సినవి కుట్టడం మొదలుపెట్టింది సరిత. కాలక్షేపం అవుతున్నా చేతినిండా పనిలేదు. ఖాళీగా ఉండటం ఎందుకని కొంతమంది ఇరుగుపొరుగున ఉండే పేదింటి ఆడవాళ్లకు కుట్టుపని నేర్పడం మొదలుపెట్టింది. ఎంతైనా టీచర్ కదా! ఇద్దరితో ఇంట్లోనే కొత్త బడి ప్రారంభించింది. ఆ ఇద్దరినీ చూసి నెల రోజులకు మరో ఇద్దరు జతయ్యారు. నలుగురికీ శిక్షణ ఇస్తూ పోయింది. సక్సెస్‌ఫుల్‌గా డ్రెస్సులు కుట్టడం నేర్చుకున్నారు. ఆ నలుగురి ముఖాల్లో సంతోషం చూసి.. మరో అయిదుగురు పేదింటి ఆడబిడ్డలు టైలరింగ్ నేర్చుకుంటామని ముందుకొచ్చారు.
వాళ్ల ఉత్సాహాన్ని గుర్తించి సరిత ప్రోత్సహించింది. మూడు నెలలు శిక్షణ తీసుకున్నారు. రెండు బ్యాచ్‌లకు సక్సెస్‌ఫుల్‌గా శిక్షణ ఇచ్చాక.. మరింత మందికి శిక్షణ ఇవ్వాలని భావించింది. ఆగిపోవద్దు.. ఓ రోజు… ‘నీ టైలరింగ్ వర్క్ ఎట్లుందమ్మా’ అని టైలరింగ్ మెషిన్ కొనిచ్చిన నాగమోహన్ సరితను పలకరించాడు. ‘రెండు బ్యాచ్‌లకు విజయవంతమైన శిక్షణ.. బ్యాచ్‌కి అయిదుగురు లేడీస్ టైలర్స్… మూడు నెలలకో బ్యాచ్’ అని ముచ్చటగా చెప్పింది. తన కాళ్ల మీద తాను నిలబడటం కోసం ఇచ్చిన కుట్టు మెషిన్ మీద ఇంత మందికి బతుకుదెరువు చూపినందుకు ఆయన చాలా సంతోషించాడు. ఇంతమందికి సాయపడినందుకు అభినందించి. ‘నువ్వు ఇలాగే చేస్తూ ఉండు. వాళ్లకు మా సంస్థ సపోర్ట్ కూడా ఉంటుంది. ఎన్ఆర్ఐల సాయంతో ఆ పేద టైలర్లందరికీ కుట్టు మెషిన్లు కొనిస్తామ’ని మాటిచ్చాడు. అప్పుడు ఇంటి దగ్గర టైలరింగ్ శిక్షణను నిరంతరంగా కొనసాగించాలని సరిత నిర్ణయించుకుంది. ఇప్పటికే నాలుగు బ్యాచ్‌లు విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్నాయి. ప్రస్తుతం అయిదో బ్యాచ్‌కి శిక్షణ ఇస్తున్నది.
ప్రతి బ్యాచ్‌లో అయిదుగురికి శిక్షణ ఇస్తారు. ఈ అయిదుగురిని సరితే ఎంపిక చేస్తుంది. టైలరింగ్ నేర్చుకోవడానికి బయట ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి. కానీ, పదివేలకు పైగా ఫీజ కట్టాల్సి ఉంటుంది. అంత డబ్బు కట్టలేని స్థితిలో ఉన్న పేదవాళ్లకు మాత్రమే సరిత తన ఇంటి దగ్గర కుట్టుపనిలో శిక్షణ ఇస్తుంది. వాళ్లకు ఉచితంగా నేర్పాల్సిన అవసరం ఉందా లేదా? మూడు నెలల శిక్షణ తర్వాత ఉచితంగా కుట్టు మెషిన్లు ఇవ్వాలా లేదా? అని ఆవిడే నిర్ణయిస్తుంది. ఎక్స్‌ట్రామైల్ ఫౌండేషన్‌ను సంప్రదించి అవసరమైన వాళ్లకు కుట్టు మెషిన్ ఇప్పిస్తుంది. ఇల్లు లేనివాళ్లు, బతుకుదెరువు కోసం నగరానికి వలస వచ్చి పని చేస్తున్న వాళ్లను సరిత ఎంపిక చేసుకుంటుంది.
బైరాన్‌పల్లికి చెందిన అఫ్రిన్ కుటుంబం పొట్టచేత పట్టుకొని హైదరాబాద్‌కు వచ్చింది. పిల్లలను బడికి పంపి ఇంటిపట్టునే ఉండేదామె. ‘ఒకప్పుడు మెహందీ పని చేసేదాన్ని. కానీ, అది ఏడాదంతా ఉండదు. పెళ్లిళ్లు ఉంటేనే పని. అది లేనప్పుడు ఇక్కడ కుట్టుపని నేర్చుకున్నా.. ఇప్పుడు ఇంటి దగ్గరే ఉండి నెలకు నాలుగు వేలు సంపాదిస్తున్న. మెహందీ పని ఉంటే దానికీ పోతున్న’ అని ఆనందంగా చెబుతున్నది అఫ్రిన్.
కొల్లాపూర్ దగ్గర గంగాదేవి తండా నుంచి బతకడానికి వచ్చిన అనూష పదిహేను రోజుల నుంచి ఇక్కడ టైలరింగ్ నేర్చుకుంటున్నది. మూడు నెలలు నేర్చుకుంటే కుట్టు మెషిన్ ఇస్తారు. అది వచ్చాక టైలరింగ్ చేయొచ్చనే ఆశతో ఆమె ఉన్నది. అనూషతోపాటు మరో నలుగురికి పద్మ టైలరింగ్ నేర్పిస్తున్నది. ఆమె వీళ్ల కంటే ముందు బ్యాచ్‌లో టైలరింగ్ నేర్చుకున్నది. ఇంటి దగ్గర టైలరింగ్ వర్క్ చేస్తూనే వీళ్లకు కొంత సమయం కేటాయిస్తున్నది. పండుగలు, పెళ్లిళ్ల సీజన్లో టైలర్లకు ఎక్కువ సంఖ్యలో ఆర్డర్లు వస్తాయి. తక్కువ సమయంలో వాటిని కుట్టలేరు. అప్పుడు ఇంటి దగ్గర పనిచేసేవాళ్లకు ఇస్తారు. ఇలా పద్మకు నాలుగైదు నెలలు చేతినిండా పని ఉంటున్నది. ఇంట్లో పనితో సంపాదన, టైలరింగ్ ట్రైనింగ్‌లో సంతోషం ఉన్నాయని పద్మ అంటున్నది. పేదింటి ఆడబిడ్డలెందరికో సంతోషాన్నిస్తున్న ఈ కుట్టుమెషిన్ ఆగిపోకుండా ముందుకు వెళ్లాలని సరిత కోరుకుంటున్నది. ఎన్జీవోల సహకారంతో సాగిపోతున్న ఈ ప్రయత్నం ఆగిపోవద్దని బస్తీ ఆడబిడ్డలూ ఆశిస్తున్నారు.