‘అనాయాసేన మరణం.. వినా దైన్యేన జీవితం..’ అని భగవంతుడిని కోరుకుంటారు చాలామంది. రోగాల పాలై, ఆసుపత్రుల చుట్టూ తిరుగుతూ.. దుర్భరమైన మరణం రావొద్దని దైవాన్ని ప్రార్థిస్తారు. ఎన్ని ఆరోగ్య సూత్రాలు పాటించినా.. అవసాన దశలో శరీరానికి ఏవో రుగ్మతలు రావడం ఖాయం. ఎవరో అదృష్టవంతులు రాత్రికి రాత్రి నిద్రలో కన్నుమూస్తారు! వృద్ధాప్యంలో ఎవరికీ భారం కాకుండా, ఎవరినీ దేహీ అనకుండా జీవితం సాగాలంటే మాత్రం అది మీ చేతుల్లోనే ఉంది. వయసులో ఉన్నప్పుడు ముందుచూపు లేకుండా వ్యవహరిస్తే.. ముదిమి వయసులో దేవుడు కూడా మిమ్మల్ని ఉద్ధరించలేడు. రిటైర్మెంట్ ప్లాన్ కచ్చితంగా చేసుకుంటే.. అనాయాసేన మరణం మాటేమిటో గానీ, వినా దైన్యేన జీవితానికి మాత్రం గ్యారెంటీ లభిస్తుంది.
Money Management | యంగ్ ఏజ్‌లో ఉన్నప్పుడు మనిషి జీవితం రాజమౌళి సినిమాలా కలర్ఫుల్గా అనిపిస్తుంది. వయసు పైబడే కొద్దీ.. ముగింపు లేని డైలీ సీరియల్లా భారంగా సాగుతుంది. జీవిత చరమాంకం కూడా సూపర్‌హిట్ కావాలంటే.. రిటైర్మెంట్ ప్లాన్ పక్కాగా ఉండాలి. మీ శేష జీవితాన్ని విశేషంగా గడపాలంటే.. ఇబ్బడిముబ్బడిగా ఆస్తులు కూడబెట్టడం కాదు! నెలకు లక్ష రూపాయల దాకా పెన్షన్ వచ్చేలా ప్రణాళిక సిద్ధం చేసుకుంటే… గడ్డాల నాడు కూడా బిడ్డలు మీ మాటలు వింటారు. ఇప్పుడంటే లక్ష వస్తే సరిపోతుంది. ఇప్పుడు మీరు ముప్పయ్లో ఉంటే మాత్రం ఈ లెక్క సరిపోదు. మీకు అరవై వచ్చేనాటికి నెలనెలా కచ్చితంగా రూ.2 లక్షలు మీ ఖాతాలో పడితేగానీ.. ప్రశాంత జీవితం గడిపే ఆస్కారం ఉండదు.
కొత్త పెన్షన్ విధానంలో ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగులకు కూడా రిటైర్మెంట్ తర్వాత కచ్చితమైన పెన్షన్ వచ్చే అవకాశం లేకుండా పోయింది. ప్రైవేట్ ఉద్యోగుల సంగతి సరేసరి. ఏ ఉద్యోగం చేస్తున్నా అరవై దాటాక నెలకు కనీసం రూ.లక్ష వచ్చేలా పెన్షన్ ప్లాన్ చేసుకోవడం చాలా అవసరం. మీరు, మీ తదనంతరం మీ జీవిత భాగస్వామికి కూడా అంతే మొత్తం పెన్షన్ వచ్చేలా ప్లాన్ తీసుకోవాలి. నలభై ఏండ్ల వ్యక్తి… నెలకు కనీసం రూ.20 వేల చొప్పున ఎస్ఐపీ కడితే.. రిటైర్మెంట్ నాటికి అది దాదాపు రూ.2 కోట్లకు చేరుతుంది. అప్పుడు ఆ మొత్తాన్ని ఇతర పెట్టుబడి సాధనాల్లో మేలైన దాన్ని ఎంచుకొని ఇన్వెస్ట్ చేసి.. ప్రతినెలా మీకు గ్యారెంటీగా పెన్షన్ వచ్చేలా చూసుకోవాలి. స్పష్టంగా చెప్పాలంటే… రిటైర్ అయ్యాక మీరు బంగారు గుడ్డు పెట్టే బాతులా ఉండాలన్నమాట. అంటే మీరున్నంత కాలం ఆదాయం రావాలి. మీరు పోతేనే ఆదాయం వచ్చేపనైతే.. సమస్యలు కొని తెచ్చుకున్నట్టే. కూడబెట్టిన సొమ్మును ఒక్కసారిగా తీసుకోకుండా.. నెలవారీగా వచ్చే ఏర్పాటు చేస్తే.. మీ లెవల్ మరోలా ఉంటుంది.
ఈ మాటలు కాస్త కఠినంగా అనిపించినా, వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకుంటేనే తెలివైన వారు అనిపించుకుంటారు. మానవ సంబంధాలన్నీ ఆర్థికం చుట్టూనే తిరుగుతున్నాయి. నెలకు ఎలాంటి ఆదాయం లేకుండా, కేవలం ఆస్తులు మూటగట్టుకొని ముసలితనంలోకి ప్రవేశిస్తే ఆశించిన ఆదరణ దక్కకపోవచ్చు. ‘ముసల్ది, ముసలోడు ఎప్పుడు పోతారో!?’ అని గోతికాడ నక్కల్లాగా ఎదురుచూస్తుంటారు వారసులు. అదే మీరు కామధేనువు అయితే! అంటే, మీరు బతికి ఉన్నంతకాలం నెలనెలా పెన్షన్ వస్తుందంటే మాత్రం మీ ప్రాణం అదే వారసులకు అపురూపంగా మారుతుంది.
ఆస్తుల కోసం హత్యలు చేసే కిరాతకులు కూడా.. పెన్షన్ సొమ్ముకోసం తల్లిదండ్రులను నెత్తిన పెట్టుకొని చూసుకుంటారు. మీకు తిండి పెట్టకపోయినా, మంచి బట్ట కట్టకపోయినా.. మీ మనసు వికలం చెంది ప్రాణానికే ప్రమాదం రావొచ్చని కంగారుపడతారు. పొద్దునే కొడుకు గుడ్ మార్నింగ్ చెబుతాడు. ‘తాతయ్యా, బామ్మా బై!’ అంటూ మనవలు బడికి దారితీస్తారు. ‘ఏం టిఫిన్ చేయమంటారు అత్తయ్యా’ అని కోడలు మీ సలహా కోరుతుంది. ‘పైసా మే పరమాత్మా హై’ అంటే ఇదే!
ఒక్కమాటలో చెప్పాలంటే.. వాళ్ల చేతులు కాలినా మీ దీపాన్ని ఆరనివ్వరన్నమాట. ఒంట్లో నలతగా ఉందంటే చాలు.. హుటాహుటిన ఆసుపత్రికి తీసుకెళ్తారు. బైపాస్ సర్జరీ చేయిస్తారు. ఇద్దరు కొడుకులు ఉంటే స్టంట్లు నేను వేయిస్తానంటే నేను వేయిస్తానంటూ స్టంట్లు చేస్తారు. ఓ లక్ష ఆసుపత్రి బిల్లు కట్టి మీ ఆయుష్షును పెంచితే.. మరో రెండేండ్లు పెద్ద ప్రాణం ఉంటుందని వారి నమ్మకం. ఆ రెండేండ్లూ నెలకు లక్ష వస్తుందనే ఆశ.
ప్రస్తుతం మనదేశంలో పెన్షన్ అందుకుంటున్న వారిలో వందేండ్ల పైబడినవారు ఆరువేల మంది వరకు ఉన్నారు. వీళ్లకు ప్రతినెలా వస్తున్న పెన్షన్ లక్షకు పైనే! ఆ వారసులు వీళ్లను ఎంత ఆరోగ్యంగా చూసుకుంటున్నారో అర్థం చేసుకోవచ్చు. అందరూ అలా ఉంటారని కాదు! ఈ రోజుల్లో కాసులకే విలువ ఇచ్చేవాళ్లు చాలామంది కనిపిస్తున్నారు. మరో పాతికేండ్లకు ఇంటింటా ఈ తరహా వ్యక్తి ఉండొచ్చు. వారి దురాశే.. పెన్షనర్‌కు శ్రీరామ రక్ష!
– ఎం. రాంప్రసాద్ ‘పైసల ముచ్చట్లు’ రచయిత ram@rpwealth.in www.rpwealth.in