Bucket Hat Caps | సమ్మర్ వచ్చిందంటే ఇంట్లో టోపీ ఎక్కడ పెట్టామో వెతుకుతాం. దొరక్కపోతే కొత్తది ఆర్డర్ పెట్టేస్తాం. వేసవి అవ్వగానే మళ్లీ టోపీ ఊసే ఉండదు. మరి, వింటర్ సంగతేంటి? చలి తగలకుండా వెచ్చగా ఉండాలంటే? టోపీలు ఏం లేవా? అంటే.. ఎందుకు లేవు? మంకీ క్యాప్‌లు ఉన్నాయిగా అంటారేమో!! అవి కావండోయ్… ఇప్పుడు మనం మాట్లాడుకునే టోపీలు ఇప్పటివి కాదు.. జమానా నుంచి వాడుకలో ఉన్నవి. ఏ కాలంలోనైనా హాయిగా వాడదగ్గవి. అవే ‘బకెట్ హ్యాట్’లు. ఎవర్ గ్రీన్ ట్రెండ్‌గా నేటి తరాన్ని ఆకట్టుకుంటున్న ఈ బకెట్ హ్యాట్లకు సంబంధించిన ఫ్యాషన్ విశేషాలే ఇవి.
బకెట్ హ్యాట్ అనే పేరు దాని ఆకారం నుంచి వచ్చిందే! ఇది ఒక బకెట్లా గుండ్రంగా ఉంటుంది. తలను అన్ని వైపుల నుంచి కప్పి ఉంచుతుంది. ముత్తాతల నాడు పాశ్చాత్య దేశాల్లో మత్స్యకారులు, రైతులు ఈ టోపీని ధరించేవారు. కాలక్రమంలో ఈ టోపీలు ఫ్యాషన్ రంగంలోకి ప్రవేశించాయి. తర్వాత రకరకాల మెటీరియల్స్‌తో తయారై, కొంగొత్త రంగులు పులుముకున్నాయి. నయా డిజైన్లు సంతరించుకొని ఫ్యాషన్ ప్రియులకు దగ్గరయ్యాయి. 19వ శతాబ్దం చివర్లో ఐర్లాండ్‌లోని మత్స్యకారులు ఎండ, వర్షం నుంచి కాపాడుకోవడానికి ఒక ప్రత్యేకమైన రకం టోపీని ధరించేవారు. ఆ టోపీలే ప్రపంచవ్యాప్తంగా ఒక ఫ్యాషన్ ఐకాన్‌గా మారాయి.
1950 ప్రాంతంలో యూరప్ యువత ఆధునిక జీవన సంస్కృతి వైపు అడుగులు వేసింది. ఆ సమయంలో అక్కడ ‘మోడ్’ ఉద్యమం పురుడుపోసుకుంది. యువతను ఆకర్షించడానికి రాక్ బ్యాండ్స్ నిర్వహించేవారు. ఈ హిప్-హాప్ సంస్కృతిలో బకెట్ హ్యాట్కూ ప్రత్యేక స్థానం ఉంది. ర్యాపర్లు, స్ట్రీట్‌వేర్ ప్రేమికులు బకెట్ హ్యాట్‌కు తమ ైస్టెల్కు అనుగుణంగా ధరించేవారు. అలా బకెట్ హ్యాట్‌కు ఎనలేని ప్రాధాన్యం వచ్చింది. ఫ్యాషన్ స్టేట్మెంట్గా మారింది.
బకెట్ హ్యాట్ ఫ్యాషన్ మాత్రమే కాదు! ఇది వేసవిలో ఎండ నుంచి కాపాడుతుంది. అలాగే, చలికాలంలో తలను మొత్తం కప్పేసి వెచ్చగా ఉంచుతుంది. అంతేకాదు.. వాటర్ ప్రూఫ్ మెటీరియల్స్‌తో తయారైన బకెట్ హ్యాట్లు వానాకాలం ఇబ్బడిముబ్బడిగా అమ్ముడవుతాయి. ఇది బడ్జెట్లో దొరుకుతుంది. ఎలాంటి మెటీరియల్‌తో అయినా దీనిని రూపొందించొచ్చు. ట్రెండీగా కనిపించడానికి అదనపు అలంకరణలూ చేయొచ్చు. క్యాజువల్ కాలేజీ డ్రెస్లకూ, ఫ్యాషన్ వస్త్రశ్రేణిపైకి కూడా ఇది నప్పుతుంది.
ఫార్మల్, ఇన్ఫార్మల్.. లుక్ ఏదైనా ఈ బకెట్ హ్యాట్ ైస్టెల్‌గా సెట్ అయిపోతుంది. ఓవర్ సైజ్డ్ డ్రెస్‌లకు ఇది చక్కని ఆప్షన్. నేటి తరం యువతీ యువకులు మరో అడుగు ముందుకేసి పర్యావరణహితంగా ‘ప్లాంట్స్ ఫ్రెండ్లీ ఫ్యాబ్రిక్స్’తో తయారుచేసిన బకెట్ హ్యాట్స్ని వాడుతున్నారు.
ఆర్గానిక్ కాటన్‌తో తయారుచేసిన వాటికి, రీసైకిల్ పాలిస్టర్ మెటీరియల్స్‌కి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. అంతేకాదు.. తమ అభిరుచికి తగ్గట్టుగా బకెట్హ్యాట్కి అదనపు సొగసులు అద్ది ‘హ్యాట్సాఫ్’ అనిపించుకుంటున్నారు!