జ్ఞాపకం… మనసు పొరల్లో రికార్డ్ చేసిన ఓ సందర్భం మాత్రమే కాదు. అలా ఉండేందుకు మెదడేమీ హార్డ్ డిస్క్ కాదు. జ్ఞాపకంతోపాటు దాని తాలూకు ఉద్వేగాలు కూడా నిలిచి ఉంటాయి. రంగు, రుచి, వాసనలు తోడవుతాయి. తొలి జ్ఞాపకమైన అమ్మ చీర దగ్గర్నుంచీ, ప్రియురాలి ఎడబాటు వరకూ… ఇష్టమైన హోటల్లో ఇడ్లీ సాంబార్ నుంచి చివరిసారి తిరుపతికి వెళ్లిన ట్రైన్ వరకూ అన్నీ అద్భుతమైన జ్ఞాపకాలే! వాటిని తలుచుకుంటే ఏదో తృప్తి. ఆనాటి బాధ కూడా తెలియని సంతృప్తిని ఇస్తుంది. గత సంతోషాన్ని తలుచుకున్న కొద్దీ అది రెట్టింపవుతుంది.
ఆలోచిస్తే ఆ జ్ఞాపకాలకు కూడా మనతోపాటు ఓ సమాంతర జీవితం ఉంటుందేమో! అవమానపడిన చోటే… గౌరవం దక్కితే ఓ అద్భుతమైన ముగింపు దక్కినట్టే కదా! శ్రమకోర్చి పెంచిన పిల్లలే మనల్ని పసిపాపల్లా సాకితే ఓ వలయం పూర్తయినట్టే కదా! అందుకే ఈ నోస్టాల్జియా గురించి ఓసారి మాట్లాడుకుందాం. సాధారణంగా నోస్టాల్జియా అంటే సానుకూలమైన జ్ఞాపకాలే అన్న అభిప్రాయం ఉంటుంది. కానీ ప్రతి ముఖ్యమైన గురుతూ పదిలమే. మన ఉనికిలో భాగమయ్యే ఆ జ్ఞాపకాలు మన వ్యక్తిత్వం మీదా, ఆరోగ్యం మీదా అనూహ్యమైన ప్రభావాన్ని చూపిస్తాయని అంటున్నారు. మరి ఆ జ్ఞాపకాలే లేని పరిస్థితులు వచ్చేస్తే ఎలా? అదీ ఆలోచించాల్సిందే!
దూరంగా
ఉన్న అమ్మకు ఫోన్ చేయాలంటే సెంటర్‌కి వెళ్లి పావుగంట లైన్లో నిలబడే రోజులవి. కరెంటు బిల్లు కట్టాలంటే ఒక పూట సెలవు పెట్టాల్సిన కాలమది. కావాల్సిన పాట కోసం టేప్ రికార్డరులో ఫాస్ట్ ఫార్వార్డ్ నొక్కుతూ, ఆ వేగానికి టేపు వదిలేస్తే పెన్సిల్‌తో తిప్పుతూ, నచ్చిన పాట పదిసార్లు విన్నాక అరిగిపోతే మనసు విరిగినంత బాధపడే పరిస్థితులవి. అర్ధరాత్రి ఆకలేస్తే వండుకోవడమే… నో స్విగ్గీ! ఊరి చివరికి వెళ్లాలంటే రిక్షావాడితో బేరం ఆడటమే… నో ఓలా! సినిమాకి వెళ్లాలంటే ఫంక్షన్ లాంటి సందడి, కొత్తబట్టలు కావాలంటే టైలరే సెలెబ్రిటీ.
వినాయకచవితి పందిళ్లలో నోరు తెరుచుకుని చూసిన సినిమాలు, దూరదర్శన్ చిత్రలహరిలో ప్రకటనల మధ్య ఇరుక్కున్న పాటలు… ఇవన్నీ అప్పట్లో అసౌకర్యంగానో, కాలయాపనగానో తోచేవి! కానీ ఇప్పుడవే మధుర జ్ఞ్ఞాపకాలుగా మారిపోయాయి. రోజులు గడుస్తున్న కొద్దీ ఇలాంటి అనుభూతులు తగ్గిపోతున్నాయా… 1990-2010 మధ్య పుట్టిన జెన్ జి దే ఈ నోస్టాల్జియాలో ఆఖరి తరమా అంటే అవునన్నట్టుగానే జవాబులు వినిపిస్తున్నాయి.
ఇలా పనిచేస్తుంది!
మన నిత్యజీవితంలో ఎదురయ్యే చిన్నచిన్న విషయాలను మర్చిపోవడానికి కారణం… మెదడులో ఉపయోగపడే జ్ఞాపకాలను దాచుకునే ప్రయత్నం. ఇలాంటి సందర్భాలలో మరపు ఓ వరం. అదే లేకపోతే మెదడు పేకాట కౌంట్లతోను, గత ఏడాది కరెంటు బిల్లులతోను నిండిపోతుంది. మన జ్ఞాపకాలలో అనుభూతిపరమైన వాటిని తిరిగి గుర్తుచేసుకోవడం ఓ సాధారణ ప్రక్రియ కాదు. మన కార్ నెంబర్ ఎంత? మన టీవీ కంపెనీ ఏంటి?… లాంటి విషయాల్లాగా, అవి ఓ డేటా రూపంలో బయటకు రావు. మన మెదడులోని హిప్పోకేంపస్, వెంట్రల్ స్ట్రేటం, సబ్‌స్టాన్షియా నిగ్రా అనే భాగాలు కలిసి ఈ నోస్టాల్జియా అనుభూతిని కలిగిస్తాయని తేలింది. నోస్టాల్జియా అందరిలోనూ ఒకేలా ఉండదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. తరచూ ఈ అనుభూతిని పొందే లక్షణాన్ని ట్రెయిట్ నోస్టాల్జియాగా పేర్కొంటారు. ఓ నాలుగు సిద్ధాంతాల ద్వారా ఈ స్థాయిని అంచనా వేసే ప్రయత్నం చేస్తారు.
ఇక ఓ వ్యక్తి నోస్టాల్జియాను అనుభూతి చెందడం వెనుక ఉన్న ఉద్దేశాల మీద కూడా చాలా పరిశోధనలే జరిగాయి. కొందరు తమ సామాజిక బంధాలను మెరుగుపర్చుకునేందుకు వ్యక్తులు, అనుబంధాలకు సంబంధించిన జ్ఞాపకాలను నెమరువేసుకుంటారనీ, కొందరు విఫల జీవితాన్ని కప్పిపుచ్చుకునేందుకు గతకాలపు చిన్నచిన్న విజయాలను తల్చుకుంటూ ఉంటారనీ చెబుతారు. అలాగే అనుభూతులను గుర్తు చేసుకునే విధానంలోనూ భిన్నరకాలు కనిపిస్తాయి. కొందరు గతకాలాన్ని తల్చుకుంటే కొందరు తమ వ్యక్తిగత జీవితాన్ని జ్ఞప్తి చేసుకుంటారు.
ఎన్ని లాభాలో!
జ్ఞాపకం, అనుభూతి, ఆలోచన, ఉద్వేగం… ఇవన్నీ మానసికమైనవిగా మనకి తోచవచ్చు. కానీ, ఇదంతా కూడా హార్మోన్లు ఆడే ఆటే అన్నది శాస్త్రవేత్తల మాట. కాబట్టి నోస్టాల్జియా వల్ల ఏర్పడే రసాయనిక చర్యలు మన మనసు మీదా, వ్యక్తిత్వం మీదా, తప్పకుండా సానుకూలమైన ప్రభావం చూపిస్తాయని నమ్మాల్సిందే. వాటిలో కొన్ని…
‘గతంలో ఇలా ఉండేవాడిని’ అనే ఆలోచన వర్తమానంలోనూ మంచి అలవాట్లను ప్రేరేపిస్తుందని కొన్ని పరిశోధనలు నిరూపించాయి. కొందరు తాము యవ్వనంగా ఉన్న రోజుల్ని తల్చుకుని అదే స్థాయి ఆరోగ్యాన్ని నిలిపి ఉంచుకునేందుకు వ్యాయామం, ఆహారాల విషయంలో జాగ్రత్త పడటాన్ని ఇందుకు ఉదాహరణగా పేర్కొంటున్నారు.
హడావుడిగా సాగిపోయే జీవితంలో సామాజిక నైపుణ్యాలు తగ్గిపోతున్నాయి. కలిసి పెరిగిన మిత్రులను, చిన్నప్పటి వేడుకల్లో కలుసుకున్న బంధువులను, మన ఇరుగుపొరుగు ఉండి వెళ్లినవారిని… ఇలా పాత బంధాలను మళ్లీ గుర్తుచేసుకుని, వారితో అనుబంధాన్ని తిరిగి బలపర్చుకునేందుకు నోస్టాల్జియా ఉపయోగపడుతుందట.
నోస్టాల్జియా అంటే కేవలం జ్ఞాపకం మాత్రమే కాదు… నాటి సందర్భాన్ని తిరిగి ఊహించుకునే ప్రయత్నం చేయడం. ఇక్కడ గత అనుభవంతోపాటు అనుభూతి ఉంటుంది. అందుకే తరచూ నోస్టాల్జియాకు ప్రయాణించేవారిలో సృజన పాళ్లు ఎక్కువగా ఉంటాయని చెబుతున్నారు.
కొవిడ్ లాంటి విషమ పరిస్థితిని ఎదుర్కొనేందుకు ఉపయోగపడిన అంశాల్లో నోస్టాల్జియా ఒకటని తేలింది. గతాన్ని తల్చుకుంటే, మళ్లీ పరిస్థితులు అలాంటి స్థితికి చక్కబడతాయనే ఆశతో చాలామంది జీవించారు. కొవిడ్ ముగిసిన తర్వాత చాలామంది తమకు ఇష్టమైన ప్రదేశాలకు వెళ్లేందుకు క్యూ కట్టడానికి… మేల్కొన్న నాటి అనుభూతులే కారణమని పేర్కొన్నారు.
ఒత్తిడిగా ఉన్నప్పుడో, జీవితంలో నిరాశ పెరిగిపోయినప్పుడో… గతకాలపు మధురస్మృతులను నెమరువేసుకుంటే మూడ్ మారిపోతుందని మానసిక నిపుణుల మాట. ఆ సందర్భంలో వెలువడే డోపమైన్ హార్మోన్ బాధను దిగమింగేంతటి సంతోషాన్ని అందిస్తుందని సూచిస్తున్నారు.
ఆశ్చర్యంగా అనిపించినా… మన సంస్కృతీ సంప్రదాయాలను కాపాడటంలో నోస్టాల్జియాది ప్రధాన పాత్ర. ఆ పండుగల అనుభూతులు, గతచరిత్ర వైభవం, తరతరాలుగా ప్రత్యేకంగా నిలుస్తున్న అలవాట్లు… వీటన్నిటినీ గర్వకారణంగా ముందుకు తీసుకువెళ్లేందుకు నోస్టాల్జియా ప్రేరణగా నిలుస్తుంది.
ఈ జాబితా ఇక్కడితో ఆగేది కాదు. నోస్టాల్జియా మన ఉనికికి బలాన్నిస్తుందనీ, నేను భిన్నమైనవాడిననే ఆత్మవిశ్వాసానికి ఆలంబనగా నిలుస్తుందనీ, ఇతరులను కూడా అర్థం చేసుకోగల సహానుభూతిని పెంచుతుందనీ… ఇలా చాలా లాభాలే పేర్కొంటున్నారు.
ఎందుకు తగ్గిపోతున్నది!
ఇప్పటి తరానికి అన్నీ దొరుకుతున్నాయి. కానీ, దక్కినవాటికి ఎంత సంతృప్తి లభిస్తున్నందంటే కాస్త ఆలోచించాల్సిందే. ఉరుకుల పరుగుల జీవితంలో తన గతంలోకి ప్రయాణించే వెసులుబాటు కూడా ఉండటం లేదు. ఆ మాటకు వస్తే ఏ రోజుకారోజే అన్నట్టు జీవితం సాగిపోతున్నది. ఈ హడావుడికి తోడు మరిన్ని కారణాలూ ఉన్నాయి.
అనుకున్నది అరచేతిలో: ఒకప్పుడు ఏదన్నా కావాలంటే ఎదురుచూడాల్సి వచ్చేది. టెలిఫోన్ కనెక్షన్ దగ్గర్నుంచీ మెయిల్ డౌన్లోడ్ వరకూ… అన్నిటికీ ఓపిక పట్టాల్సి వచ్చేది. ఎదురుచూపుల ఫలితం కచ్చితంగా గుర్తుండిపోయేది. కానీ ఇప్పుడు ఏది కావాలంటే అది… ఎలా కావాలంటే అలా… అన్నీ అందుబాటులోకి వచ్చేస్తున్నాయి. ఓటీటీ, హోం డెలివరీ, ఆన్లైన్ షాపింగ్‌తో అనుకున్నది వెంటనే అరచేతిలో వాలిపోతున్నది. దాంతో అదెంత విలువైనదైనా.. వినియోగం వరకే దాని ప్రాధాన్యం పరిమితం అవుతున్నది.
ఎంపికలు: ప్రపంచీకరణ జీవితాన్ని మార్చేసింది. ఒక టీవీని పాతిక వేలు పెట్టయినా కొనవచ్చు, పాతిక లక్షలు పెట్టాల్సిన టీవీలూ అందుబాటులోకి వచ్చాయి. ఫోన్, అపార్ట్మెంట్, ఫ్రిజ్, నగలు, కారు… ఇలా ప్రతిదానిలోనూ ఎంపికలు పెరిగిపోతున్నాయి. దాంతో ఏ వస్తువు కొన్నా, ఏ అనుభూతిని సొంతం చేసుకున్నా అది సంతృప్తిని కలిగించడం లేదు సరికదా… రాజీపడాల్సి వచ్చిందే అన్న లోటే మిగులుతున్నది. ఇంటికి వచ్చిన వస్తువులు జ్ఞాపకాలుగా కాకుండా స్తోమతకు చిహ్నాలుగా మారిపోతున్నాయి.
ఓపిక ఏది: ఒకప్పుడు చిన్న మెయిల్ ఓపెన్ అయ్యేందుకు కూడా చాలాసేపు పట్టేది. ఇప్పుడు జీబీల కొద్దీ వీడియోలు కూడా చిటికెలో డౌన్లోడ్ అవుతున్నాయి. నెట్ స్పీడ్‌కి సమాంతరంగా… పిల్లల్లో సహనం కూడా తగ్గుతుందనేది ఓ గమనింపు. వాళ్లు చూడాలనుకున్నది 30 సెకన్లలోనే చూసేస్తున్నారు. రాబోయే రోజుల్లో ఇది 15 సెకన్లకు చేరుకుంటుందని అంచనా. ఈ తరహా మనస్తత్వంలో అనుభూతి స్థానంలో అలజడి రాజ్యమేలుతున్నది. ఫోన్ చూడకుండా ఒక్క క్షణం కూర్చోవడం అంటే సమయాన్ని వృథా చేసుకోవడం అనే ఆలోచన బలపడుతున్నది.
విశ్వమానవుడు: గ్లోబల్ విలేజ్ నేపథ్యంలో ఇది నా ఇల్లు, నా ఊరు, నా ఇరుగుపొరుగు, నా భాష అనే భావన బలహీనపడిపోతున్నది. ఎక్కడ అవకాశాలున్నా రెక్కలు కట్టుకుని ఎగిరిపోవడం, కొత్తకొత్త పరిస్థితులకు సర్దుకుపోవడం, మమకారాలు తగ్గించుకోవడం తప్పనిసరిగా మారింది. ఇలాంటి పరిస్థితుల వల్ల ‘నేను, నాది’ అనే భావన కూడా బలహీనపడిపోతున్నది. తన ఉనికే ప్రశ్నార్థకమైన నేపథ్యంలో మనిషి త్వరగా కుంగుబాటుకు లోనవుతున్నాడని పరిశోధనలు తేల్చాయి.
అబండెన్స్ ఆఫ్ మెమరీస్: గ్లోబలైజేషన్ నేపథ్యంలో మనకు ఓ మంచి అనుభూతిని కల్పించేందుకు మార్కెట్ శతవిధాలా ప్రయత్నిస్తున్నది. సినిమా హాల్ దగ్గర్నుంచీ, సెల్‌ఫోన్ వరకూ… వీలైనన్ని సౌలభ్యాలతో మనల్ని ఆకట్టుకుంటున్నాయి. సహజీవనం సహజమైపోతున్నది. ఈ అనుభవాల ఉప్పెనలో కొట్టుకుపోతూ… స్పష్టమైన నోస్టాల్జియా లేకుండా సాగిపోతున్నాడు ఇప్పటి మనిషి.
వేగంగా మార్పులు: ఉత్తరాలు, టెలిగ్రాం, డయల్ ఫోన్, బటన్ ఫోన్, వైర్లెస్, పేజర్, 2జీ, 3జీ, స్మార్ట్‌ఫోన్ – కేవలం ఫోన్ల విషయంలోనే కాదు వాహనాలు, జీతాలు, టీవీలు… ఇలా అన్ని అంశాల్లోనూ ఒకప్పటి తరంలో మార్పులు ఇలా అంచెలవారీగా జరిగేవి. కానీ ఇప్పుడు ఊహ తెలుస్తూనే, నేరుగా తుదిదశలో ఉన్న ఉత్పత్తిని చేతిలోకి తీసుకుంటున్నారు పిల్లలు. దాంతో ఓ ప్రయాణం కోసం, వార్త కోసం, టీవీ కోసం ఎంత శ్రమించేవారమో వారికి తెలియడం లేదు. అవే నోస్టాల్జియాకు కీలకం కదా!
ఇవేనా! సోషల్ మీడియా మనకు వైరస్‌లా సోకి వదలడం లేదు, పట్టణీకరణతో పల్లెల స్వచ్ఛమైన అనుభవాలు మాయమైపోయాయి, చిన్న కుటుంబాలతో బంధాలు చెదిరిపోయాయి… ఇలాంటి సవాలక్ష కారణాలు నోస్టాల్జియాను దూరం చేసేసేవే.
గతంలోకి ఇలా ప్రయాణిద్దాం!
నోస్టాల్జియా వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో విన్నాం. ఆ లాభాల గురించి పక్కన పెడితే… ఆ ప్రయాణం ఓ అందమైన అనుభూతిని కలిగిస్తుంది అని స్పష్టంగా తెలుసు. ఇప్పటి తరం వాటికి దూరమైపోతున్నదని బాధపడుతున్నాం. అందుకే ఉరుకుల పరుగుల జీవితంలో పడి కొట్టుకుపోయేవారిని జ్ఞాపకాల ఒడ్డుకు చేర్చేందుకు నోస్టాల్జియా చిట్కాలు చెబుతున్నారు నిపుణులు…
చాలామంది గతానికి సంబంధించిన కొన్ని మధుర జ్ఞాపకాలను రాసుకున్నప్పుడు ఒంటరితనం నుంచి దూరమైన భావన పొందడమే కాకుండా, నాటి అనుభూతులను ఆస్వాదించగలిగినట్టు పరిశోధనల్లో తేలింది. ఆ అనుభూతులను మిత్రులతో పంచుకున్నప్పుడు నాటి జ్ఞాపకాల గాఢత రెట్టింపవడమే కాకుండా, వాటిని విన్నవారు కూడా నాటి అనుభవాలను నెమరువేసుకున్నారు.
ఏదన్నా సేకరించే వ్యాపకం ఉన్నవారికి ఓ విషయం స్పష్టంగా తెలుసు. తాము సేకరించిన వస్తువులను తిరిగి చూసుకున్నప్పుడల్లా, వాళ్లు నోస్టాల్జియాలోకి జారిపోతుంటారు. చెప్పాలంటే… ఆ సేకరణ ఓ ట్రిగ్గర్ పాయింట్లా పనిచేస్తుంది. పాత నాణాలు, పుస్తకాలు, కళాఖండాలు, బొమ్మలు, కీ చెయిన్లు… ఏవైనా సరే వాటిని పొందిన కాలానికి చటుక్కున తీసుకువెళ్లిపోతాయి. అందుకే అలాంటి ఓ వ్యాపకం అలవాటు చేసుకోవాలి.
మీరు చిన్నప్పుడు తరచూ వెళ్లే ప్రదేశానికి ఓసారి వెళ్లి చూడండి. ఉదాహరణకు ఊళ్లో లైబ్రరీకో, స్కూలుకో వెళ్లారనుకోండి. ఒక్కసారిగా నాటి జ్ఞాపకాలు ముప్పిరిగొనడం గమనిస్తారు. మరీ ముఖ్యంగా అక్కడ మీరు తిరుగాడిన చోటును చూసినప్పుడు కలిగే అనుభూతికి సాటిలేదు.
పాత పాటలు తప్పకుండా ఓ నోస్టాల్జియా అందిస్తాయి. వాటిని ఏ వయసులో విన్నామో… నాటి కాలాన్ని మనసులో పునర్నిర్మిస్తాయి. యవ్వనంలో ప్రేయసిని తల్చుకుంటూ పాడిన విరహ గీతాలు, కాలేజిలో కలిసి ఆడుకున్న అంత్యాక్షరులు మళ్లీ ఆ రోజుల్ని గుర్తుచేస్తాయి. మనసుకు దగ్గరైన అలాంటి పాటలతో ఓ ప్లే లిస్ట్ చేసుకుంటే కావాలనుకున్నప్పుడల్లా వాటిని వినవచ్చు.
ఒక పరిశోధన ప్రకారం ఇష్టమైన ఆహారమే కాదు… దాని నుంచి వచ్చే సువాసన కూడా మనల్ని చిన్ననాటి జ్ఞాపకాలను ప్రేరేపిస్తుంది. చిన్నప్పుడు ఇష్టమైన హోటల్లో దోశ, ఐస్ క్రీం, పార్లే జీ లాంటి బిస్కెట్లను ఓసారి కళ్లెదురుగా పెట్టుకుని చూడండి! ఆ మాట ఎంత నిజమో మీకు అనుభవమవుతుంది.
చాలామంది పెద్దవాళ్లు పాత బ్లాక్ అండ్ వైట్ సినిమాలను ఇప్పటికీ అబ్బురంగా ఎందుకు చూస్తుంటారు. ఎందుకంటే… అవి వారిలో నోస్టాల్జియాను మేల్కొల్పుతాయి కాబట్టి. ఆ గతాన్ని కోల్పోయిన బాధను మరుగుపరుస్తాయి కాబట్టి. ఈ మాట పరిశోధకులే చెబుతున్నారు. మనం కూడా టామ్ అండ్ జెర్రీ, సూపర్ మ్యాన్, శక్తిమాన్, మహాభారత్… ఇలాంటి నాటి కార్యక్రమాలు లేదా పాత సినిమాలు చూస్తే ఒక్కసారిగా మన కండ్లతోపాటు మెదడు కూడా గతానికి పరుగులు పెడుతుంది.
మరెందుకాలస్యం! గతంలోకి ప్రయాణించేందుకు మనకు టైమ్ మెషిన్ ఏమీ అక్కర్లేదు. భవిష్యత్తు గురించి చింత మాని, వర్తమానాన్ని కాసేపు కుదుటపరచుకుని… మన మనసుకు ఉన్న కళ్లాన్ని కాసేపు వదులుచేద్దాం. అప్పుడు అదే వెనక్కి వెళ్లిపోతుంది. పదండి ముందుకు పదండి తోసుకు అనే మాట అన్ని సందర్భాలకూ అన్వయించలేం. ఒక్కోసారి వెనక్కి కూడా ప్రయాణించాలి. రేపు మనం ఉంటామో లేదో? అనుకున్నది జరుగుతుందో లేదో? కానీ నిన్నయితే వాస్తవం కదా! అది జరిగిందే కదా! దాన్ని మళ్లీ ఓసారి నెమరువేసుకుందాం! అనుభవాల పల్లకిలో ఊరేగుదాం!!
ప్రతికూలతలూ లేకపోలేదు
ప్రతి విషయానికీ సానుకూలతతోపాటు… ప్రతికూలమైన ఫలితాలూ ఉంటాయి. నోస్టాల్జియా విషయంలోనూ అంతే! మనిషి మరీ నిరాశలో ఉన్నప్పుడు… గత కాలపు వైభవం ఇంకా కుంగిపోయేలా చేస్తుంది. గతంలో ఏదన్నా పొరపాటు జరిగితే అదే తప్పు అని పట్టుకునే మొండితనానికి కూడా నోస్టాల్జియా తోడ్పడుతుంది. కొందరు ఏ పనీ చేయకుండా, గతాన్ని తల్చుకుంటూ ఉండేందుకు కూడా కారణం అవుతుంది. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ నోస్టాల్జియాను నాయకులు తమ స్వార్థం కోసం వాడుకోవచ్చు. ఈమధ్య కొంతమంది తిరిగి హిట్లర్ నాటి నాజీ సిద్ధాంతాలను తిరిగి బలపరిచేందుకు నోస్టాల్జియాను ఉపయోగించుకుంటున్నారు.
వీడని గతం
ఓ ప్రముఖుడిని కలుసుకున్నాం. ఓ కాగితాన్ని దొరకబట్టుకుని తన ఆటోగ్రాఫ్ తీసుకున్నాం. దాన్ని చూసినప్పుడల్లా నాటి సంఘటన గుర్తొచ్చి మైమరపిస్తుంది. ఇది ఒకప్పటి సంగతి. ఇప్పుడలా కాదు. ప్రతి సన్నివేశాన్నీ చిటికెలో అందంగా బంధించేస్తున్నాం. అందుకోసం మన అరచేతిలో ఎప్పుడూ ఫోన్ కెమెరా సిద్ధంగా ఉంటున్నది. ఆ ఫొటోని అప్పటికప్పుడు సోషల్ మీడియాలో అప్లోడ్ చేసి కావల్సిన లైకులు తెచ్చుకుంటున్నాం. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫోన్లో దాన్ని చూసుకుంటున్నాం. జ్ఞాపకం అంటే ఓ శకలం. కానీ, ఒకే చొక్కాను నిరంతరం వేసుకుని తిరిగితే అది జ్ఞాపకంగా మారదు కదా! మన ప్రస్తుత అనుభవాలు ఇలాగే ఉంటున్నాయి. వీటిని ‘ప్రజెంట్ పాస్ట్’ (Present Past)గా వ్యవహరిస్తున్నారు. మనల్ని ముంచెత్తిన ఈ గాడ్జెట్స్ వల్ల గతం అనేదే లేకుండా పోయిందన్నది ఓ వాదన. ఇక నోస్టాల్జియాకు అవకాశం ఎక్కడిది?
జబ్బుగా భావించేవారు
ఇప్పుడు నోస్టాల్జియా అంటే గతాన్ని అనుభూతి చెందడం అనే అర్థంలో వాడుతున్నారు. కానీ ఒకప్పుడు దీన్ని ఓ మానసిక వ్యాధికి సూచనగా భావించేవారంటే ఆశ్చర్యం కలగక మానదు. ‘నోస్టోస్’, ‘ఆల్గోస్’ అనే రెండు గ్రీకు పదాల కలయిక ఈ మాట. విదేశాలకు వెళ్లిన సైనికులు తమ ఇళ్ల మీద పెంచుకునే బెంగ (హోం సిక్నెస్)కు సూచనగా దీన్ని వాడేవారు. ఓ స్విస్ డాక్టర్ 17వ శతాబ్దంలో ఈ పదాన్ని సృష్టించాడు. మూడు వందల ఏళ్ల పాటు దాన్ని ఇంటి మీద బెంగను స్పష్టం చేసేందుకే వాడేవారు. 21వ శతాబ్దంలో దీన్ని గతపు అనుభూతిగా నిర్వచించడం మొదలుపెట్టారు.
లక్ష పరిశోధనలు
పరిశోధకులకు నోస్టాల్జియా ఓ ఆసక్తికరమైన అంశం. అందుకు తగినట్టే దీని గురించి జరిగిన పరిశోధనలు చాలా ఆసక్తికరమైన ఫలితాలు ఇచ్చాయి.
చలిగా ఉన్న ఉష్ణోగ్రతల్లో…
వెచ్చని మంట దగ్గరో, వేసవి ఎండలోనో తిరిగిన అనుభూతులను తల్చుకున్నవారిని చలి అంతగా ఇబ్బంది పెట్టలేదని సౌతాంప్టన్ విశ్వవిద్యాయంలో జరిగిన ఓ పరిశోధన నిరూపించింది.
విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న
వస్తువులు కాకుండా స్థానిక ఉత్పత్తులు కొనేందుకు వాటితో నోస్టాల్జిక్ అనుబంధం ఓ ప్రోత్సాహకరంగా
పనిచేస్తుందని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో జరిగిన అధ్యయనం చెబుతున్నది.
దానధర్మాలు చేసేవారు, స్వచ్ఛంద కార్యకర్తలుగా పనిచేసేవారిలో నోస్టాల్జియా ప్రేరణనిస్తుందని చికాగో
విశ్వవిద్యాలయంలో జరిగిన అయిదు అధ్యయనాలు తేల్చాయి.
షాపింగ్ చేసేటప్పుడు మనల్ని చిన్నప్పుడు ఊరించిన ఉత్పత్తులు ఎదురుపడితే, వాటిని కొనమని మనసు తొందరపెడుతుందని ‘జర్నల్ ఆఫ్ కన్జూమర్ రీసెర్చి’ పేర్కొంది.
నోస్టాల్జియాలోకి ప్రయాణించడం వల్ల మానసిక ఆరోగ్యం మెరుగుపడుతున్నట్టు అసోసియేషన్ ఫర్ సైకలాజికల్ సైన్స్ వెల్లడించింది!
…? కె.సహస్ర