అక్కడికి వెళ్తే.. ‘మీ బాల్యాన్ని గుర్తుచేసుకుని మురిసిపోండి’ అంటూ పర్యాటకులను ఆహ్వానించే టెడ్డీబేర్లను చూసి మంత్రముగ్ధులై పోతారు. గ్యాలరీల్లో నడుస్తూ కళాత్మక, చారిత్రక ప్రయాణమూ చేస్తారు. ఈ బొమ్మల్లో లీనమైపోయి.. మళ్లీ పిల్లలైపోతారు. బాల్యాన్ని అనుభూతి చెందుతారు!

టెడ్డీ బేర్ పరిచయమై వందేళ్లు దాటింది. టెడ్డీ బేర్‌తో ఆడుకోని పిల్లలు ఉండరేమో. ఎక్కడైనా టెడ్డీ బేర్ కనిపిస్తే పిల్లలు కొనివ్వమని మారాం చేస్తారు. పెద్దలు చిన్నప్పటి అల్లరిని గుర్తు చేసుకుంటారు. అందమైన బాల్యంలో మధురమైన జ్ఞాపకాలెన్నో మిగిల్చిన టెడ్డీ బేర్‌తో ఓ మ్యూజియమే నిర్మించారు! ప్రతి పర్యాటకుడిని చిన్నపిల్లాడిని చేసే అద్భుతమైన ఈ మ్యూజియం దక్షిణకొరియాలో ఉంది.
టెడ్డీ బేర్ టీచర్
పిల్లలు బొమ్మలను ఇష్టపడతారు. రోజంతా బొమ్మలతో ఆడుకుంటారు. వాటికి ప్రాణం ఉందని భావిస్తారు. బొమ్మలకు ముచ్చట్లు చెబుతూ, వాటిని పనికి పురమాయిస్తూ ఆడతారు. ఇలా ఆడే పిల్లలకు విద్య, కాలక్షేపం, వినోదం ఉండేలా రకరకాల టెడ్డీ బేర్లు తయారయ్యాయి. ప్రీ ప్రైమరీ చదువులో పిల్లలకు కార్డ్స్ చూపిస్తూ రకరకాల జంతువుల పేర్లు నేర్పించినట్టు, రంగుల్ని గుర్తించడం చెప్పినట్టే టెడ్డీ బేర్లతోనూ పిల్లలకు చదువు చెప్పొచ్చు. ఈ మ్యూజియంలో బేర్లు చేసేది అదే పని. రకరకాల దుస్తులు వేసుకుని వాటిని పిల్లలకు పరిచయం చేస్తాయి. రంగులను పరిచయం చేస్తాయి. మనుషులు చేసే రకరకాల వృత్తుల వేషధారణలో రూపొందిన టెడ్డీ బేర్లు ఆయా వృత్తులను పిల్లలకు పరిచయం చేస్తున్నాయి.
సంగీత పరికరాలు, పనిముట్లను పిల్లలకు ఇష్టమైన పద్ధతిలో టెడ్డీ బేర్‌తో పరిచయం చేయించడానికి పెద్దలూ ఇష్టపడుతున్నారు. ఇలా ఆటపాటల విద్యని చాలా బడుల్లో ఇప్పుడు ప్రవేశపెట్టారు. ఎంత ప్రయోగమైనా పదులు తప్ప వందల టెడ్డీ బేర్లు మాత్రం తరగతి గదిలోకి రావు. కాబట్టి పిల్లలకు చూసిందే చూసి బోర్ అనిపిస్తుంది. కొత్తదనానికి ఉన్నంత ఆకర్షణ మరో దానికి లేదు. కాబట్టి కొత్త కొత్త టెడ్డీ బేర్లతో పిల్లల ఆనందాన్ని ఇంకా ఇంకా రెట్టింపు చేసే టెడ్డీ బేర్ మ్యూజియం ఆలోచన విజయవంతమైంది. పిల్లలతోపాటు పెద్దలూ ఈ టెడ్డీ బేర్లను చూడడానికి రావడంతో మ్యూజియానికి ఆదరణ పెరిగింది. ఈ మ్యూజియం స్థానికులనే కాదు ప్రపంచ పర్యాటకులనూ ఆకర్షిస్తున్నది.

టెడ్డీబేర్ వరల్డ్ టూర్!
జెజు పట్టణంలో టెడ్డీ బేర్ మ్యూజియం ప్రారంభించిన ఏడేళ్ల తర్వాత తెసమ్ పట్టణంలో మరో టెడ్డీ బేర్ మ్యూజియం ప్రారంభించారు. పిల్లలు ఇష్టపడే ఐస్‌క్రీమ్‌లు, బర్గర్ల కోసం కొన్ని కంపెనీలు ఫ్రాంచైజీలను తెరిచినట్లే టెడ్డీ బేర్ మ్యూజియానికీ ఫ్రాంచైజీలు తీసుకుంటున్నారు. వియత్నాం, థాయ్‌లాండ్‌లోని పర్యాటక ప్రాంతాల్లో టెడ్డీబేర్ మ్యూజియాలు ఏర్పాటయ్యాయి. వియత్నాంలో స్లీప్‌లెస్ సిటీగా పేరపొందిన పుకోక్ దీవిలో ఒక టెడ్డీ బేర్ మ్యూజియం తెరిచారు. పదిహేను వందల చదరపు మీటర్ల వైశాల్యంలో ఉన్న ఈ మ్యూజియంలో అయిదు వందల టెడ్డీబేర్లను కొలువుదీర్చారు. విశేషం ఏమిటంటే… ఈ టెడ్డీ బేర్లన్నీ చేతితో తయారు చేసినవే. మ్యూజియంలో నడుస్తుంటే టెడ్డీబేర్‌లో లీనమై, బాల్యాన్ని మళ్లీ అనుభూతి చెందాల్సిందే! బాల్యం కంటే గొప్ప జీవితం ఏముంటుంది?! అలాంటి బాల్యాన్ని మళ్లీ మళ్లీ అనుభూతి చెందాలంటే ఇలాంటి టెడ్డీబేర్ మ్యూజియాలను మళ్లీ మళ్లీ చూడాల్సిందే!

