The Seven Year Itch | ‘పెళ్లంటే.. మూడే ముళ్లు.. ఏడే అడుగులు.. మొత్తం కలిపి నూరేళ్లు’ అన్నాడు ఓ తెలుగు సినీకవి. అయితే ఏడేండ్ల తర్వాత వందేండ్ల బంధం రుచించదని పాశ్చాత్యులు సినిమాలే తీశారు. కాల ప్రభావమో, పాశ్చాత్య సంస్కృతి దాడి వల్లనో ‘సెవెన్ ఇయర్స్ ఇచ్చింగ్’ సంస్కృతి మనదగ్గరా పెరిగిపోతున్నది. కలకాలం నిలవాల్సిన బంధానికి కాలదోషం పట్టడానికి కారణాలేంటి..
ఫీలింగ్ బోర్
వైవాహిక జీవితం, కుటుంబ బాధ్యతలు, పిల్లలు అన్నీ బాగుంటే భార్యాభర్తల బంధం కూడా బలంగా ఉంటుంది. దంపతుల మధ్య సాన్నిహిత్యం కొరవడితే లైఫ్ బోర్ కొట్టేస్తుంది. మొదట్లో ఉన్న పరాకు ఆపై చిరాకుగా పరిణమిస్తుంది. అనుమానాలకు తావిస్తుంది. గొడవలకు దారితీస్తుంది. చివరికి మరో తోడు కావాలనే బుద్ధి పుట్టేలా చేస్తుంది.
మాజీ ప్రేమలు
ఈ రోజుల్లో పెండ్లికి ముందు ప్రేమలు చాలామంది జీవితాల్లో కామన్. ప్రేమ ఫలించక పెద్దలు చూసిన సంబంధానికి తలొగ్గుతారు. గతాన్ని పాతరేసి కొత్త జీవితాన్ని ప్రారంభిస్తారు. కొన్నాళ్లు పోయిన తర్వాత ఆ పాత లవర్ కంటపడగానే పుర్రెలో పురుగు పుడుతుంది. వారిని కలవాలనీ, వారితో మాట్లాడాలనీ కోరిక పుడుతుంది. ఇంకేముంది.. వివాహేతర బంధానికి నాంది.. బతుకు జట్కా బండి!
వేధింపులు
చిన్న, పెద్ద అనే తేడాలు తప్పితే ప్రతి ఇంట్లోనూ ఏదో ఒక విషయంలో గొడవలు జరుగుతాయి. అవి చిలికి చిలికి గాలివానగా మారితే ప్రమాదమే! అంతలా సర్దుకుపోకపోతే విడిపోయి ఎవరికి వారే ఉంటే అది వేరే విషయం. కానీ, వివాహ బంధాన్ని భారంగా భావిస్తూ రోజులు వెళ్లదీస్తుంటే.. ఏదో ఓరోజు ఇచ్చింగ్ మొదలవుతుంది. కట్టుకున్నవారికి ద్రోహం చేయాలనే తలంపు వస్తుంది.
విపరీతమైన కోరికలు
ఆడ, మగ అనే తేడా లేకుండా అందరికీ కోరికలు ఉంటాయి. మగవాళ్లు బయటికి చెప్పుకోగలుగుతారు. అదే కోరిక ఆడవాళ్లు చెబితే పురుష పుంగవుడికి అనుమానం.ఆపై ఆగ్రహం. శృంగార జీవితంలో మొహమాటాలకు తావు ఉండకూడదు. పడగ్గదిలోనూ కోరికల చిట్టా విప్పకపోతే.. శారీరకంగా నలిగిపోవడం ఖాయం. ఈ సంఘర్షణ ఆమెను గానీ, అతణ్ని గానీ వేరే ఆలోచనలకు పురిగొల్పే ప్రమాదం ఉంటుంది.