‘సుభాషితం’ అంటే మంచిమాట. రిటైర్డ్ డీయీవో తులసీ దాస్‌కు మాటలంటే ఇష్టం. మాట్లాడటమంటే ఇంకా ఇష్టం. అందుకోసం ఏకంగా ఓ యాప్ తయారు చేయించారు. ఆ మాటల మూటకు ‘దాసుభాషితం’ అని పేరుపెట్టుకున్నారు. ఆలోచన ఆయనదైతే, ఆచరణ మాత్రం మీనా యోగీశ్వర్ది. అందులోని సాహిత్యం, సంగీత విశేషాలు, ఇంటర్వ్యూలు.. మీనా ఐడియాల నుంచి ప్రాణం పోసుకు న్నవే. పుస్తకాభిమానమే దాసుభాషితానికి తనను దగ్గర చేసిందంటూ మీనా పంచుకుంటున్న ముచ్చట్ల్లు..
తల్లిదండ్రులు చేసే పని పట్ల పిల్లలకు
అవగాహన ఉంటుంది. మా నాన్న తాడేపల్లిగూడెంలో పత్రికా విలేకరి. నాన్న దగ్గరే రాయడం, చదవడం నేర్చుకున్నాను. తను వార్తలు రాసిస్తే నేను టైప్ చేసేదాన్ని. అప్పుడే, ఎలా రాయాలి? ఏ పదం ఎక్కడ వాడాలి? అనేది చెప్పేవారు. ఒక వార్తలో ‘మాట్లాడారు’ అని పదిసార్లు రాయకూడదని, ‘వ్యాఖ్యానించారు’, ‘అన్నారు’, ‘తెలిపారు’ అంటే బావుంటుందనీ సరిచేసేవారు. ఎత్తుగడ ఎలా ఉండాలి? శీర్షికలో ఎలాంటి పదాలు గుప్పించాలి? ముగింపులో మెరుపు తీసుకురావడం ఎలా? ..ఇలా రాతలోని కిటుకులన్నీ నాన్న ద్వారానే తెలిశాయి. బాగా రాయాలంటే బాగా చదవాల్సిందే. దీంతో సాహిత్యంతో అనుబంధం పెరిగింది.
పుస్తకముంటే చాలు
చిన్నప్పటి నుంచీ నాకు సాహిత్యమంటే మక్కువ. ఫిక్షన్ బాగా చదివాను.. ముఖ్యంగా నవలలు. ఇంట్లో స్కూల్ బుక్స్ మాత్రమే చదవాలనే నిబంధన ఉండేది కాదు. వేరే చదువకూడదన్న ఆంక్షలేవీ లేవు. చేతిలో ఏదో ఒక పుస్తకం ఉంటే చాలు. మా అన్నయ్య పవన్ సంతోష్ కూడా నాలాగే పుస్తకాల మధ్య పెరిగాడు. ఈ పుస్తకంలో ఇది ఉందని, ఆ పుస్తకం చదువు బాగుంటుందని చెప్పేవాడు. అప్పటి నుంచి మా అన్నయ్యే నా మెంటర్.
మొదటి మాటలు
కొండూరు తులసీదాస్ గారు డీయీవోగా ఉద్యోగ విరమణ చేశారు. ‘దాసుభాషితం’ ఆయన మానస పుత్రిక. సాహిత్యంపట్ల అవగాహన ఉన్నవారి కోసం దాసుగారు అన్వేషిస్తున్న సమయంలో నేను తారసపడ్డాను. నేను బీటెక్ చదివాను. బాల్యం నుంచీ తెలుగు సాహిత్యంపట్ల మక్కువ ఉంది. అదొక్కటే నా అర్హత. అందుకే ఆయన నన్ను ఎంచుకున్నారు. ఐదేండ్ల క్రితం అయిదు ఆడియో పుస్తకాలతో దాసుభాషితం మొదలైంది. ప్రయోగాత్మకంగా ప్రొఫెసర్ మృణాళిని రేడియో ఇంటర్వ్యూలు చేర్చాం. తర్వాత ఇ-బుక్స్ కూడా జోడించాం. కానీ వాటిని తొలగించి ఆడియో కంటెంట్ మాత్రమే ఇవ్వాలనుకున్నాం. ఇందులో ఆడియో పుస్తకాలు, వ్యాసాలు, ఇంటర్వ్యూలు, ప్రసంగాలు ఉంటాయి. చిలకమర్తి, శ్రీపాద, విశ్వనాథ, యద్దనపూడి సులోచనారాణి తదితరుల రచనలతో పాటు.. సమకాలీన కవిత్వం, కథలు, నవలలు వినవచ్చు. జీవిత చరిత్రలు, స్వీయ చరిత్రలు కూడా ఆలకించవచ్చు.
శ్రోతలే మా బలం
కొవిడ్ సమయం అది. అందరూ తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. పుస్తకాలతో కాలక్షేపం సంతోషాన్నిస్తుందని, ఒత్తిడి తగ్గుతుందనే ఉద్దేశంతో సబ్స్క్రిప్షన్ ఉచితంగా ఇచ్చాం. కొంతకాలం తర్వాత మళ్లీ పెయిడ్ సబ్స్క్రిప్షన్ పద్ధతిలోకి మారాం. ప్రతివ్యక్తి జీవితంలో వ్యక్తిగతమైన, వృత్తిపరమైన, ఆధ్యాత్మికమైన అంశాలు ఉంటాయి. ఈ మూడింటిలో సమతుల్యత సాధిస్తే జీవితం ఆనందంగా సాగుతుంది. అందుకే, దాసుభాషితం యాప్ ఈ మూడింటి మీద ప్రయాణం చేస్తుంది. శ్రోత ఎదుగుదలకు ఎంతోకొంత దోహదపడాలన్నదే మా తాపత్రయం. సాహిత్యం నుంచి బోలెడన్ని నేర్చుకుంటాం. పుస్తకాల నుంచి అనేక విషయాల్ని జీవితానికి అన్వయించుకుంటాం. అంతేకాదు, కొత్త రచయితలను ప్రోత్సహించాలన్నది నా కల. రచయిత కావాలనుకునేవాళ్లకు దాసుభాషితం ఒక వేదికగా ఉపయోగపడాలి. ‘కళల్ని ఆస్వాదించడం ఎలా?’ అనే కోణంలోనూ కొత్త కంటెంట్ రాయిస్తున్నాం. ఆధ్యాత్మికతకు సంబంధించిన విషయాలూ అప్లోడ్ చేస్తున్నాం. గుడులు, పండుగలు, వ్రతాలు, పూజలు కాకుండా తాత్విక చింతనపట్ల మనిషి ఆసక్తిని సంతృప్తి పరిచే రచనలు అందిస్తున్నాం.
అభిరుచిలోనే ఆనందం
నా ఆసక్తీ ఉద్యోగం ఒకటే అవుతుందని, ఇలాంటి ఓ అవకాశం అంటూ వస్తుందనీ నేను ఊహించలేదు. నేను ఇష్టంగా చదివిన రచయితలతో మాట్లాడటమే నా పని. ఇదంతా ఎంతో సంతోషాన్ని ఇస్తున్నది. చిన్నప్పటి నుంచీ సాహిత్యం చదవడం వల్లే.. దాసుభాషితంలో ఏయే రచనలు ఉండాలో, ఏ రచయితను పరిచయం చేయాలో నిర్ణయించగలుగుతున్నా. ఆడియో బుక్స్ రూపొందిస్తున్నా. దాంతోపాటే మేనేజ్మెంట్ స్కిల్స్ పెంచుకుంటున్నా. ఇంజినీరింగ్ చదివేప్పుడు ఫేస్బుక్లో, కోరాలో రాసేదాన్ని. ఆ అనుభవం ఇప్పుడు న్యూస్ లెటర్స్, రచయితల పరిచయాలు, పుస్తకాల సమీక్షలు రాయడంలో ఉపయోగపడింది. దాసుభాషితాన్ని మరింతమందికి చేరువ చేయాలన్నదే నా లక్ష్యం. ఆ ప్రయత్నంలో విజయం సాధిస్తాననే నమ్మకం ఉంది.
సినీ కర్ణాటకం
సంగీత పుస్తకాలు కూడా ఆడియోల రూపంలో తెచ్చాం. ‘సినీ కర్ణాటకం’ పేరుతో ఒక సిరీస్ చేశాం. తెలుగు సినిమాల్లోని పాటలకు కర్ణాటక సంగీతంలోని ఏ రాగాన్ని ఆధారం చేసుకుని బాణీలు కట్టారో తెలిపే కార్యక్రమం ఇది. ఇందులో ఆ రాగాలను గాయకులతో పాడించడంతోపాటు వ్యాఖ్యానం కూడా ఉంటుంది. అక్కినేని నాగేశ్వరరావు, పద్మనాభం, ఎస్.పి. శైలజ, వేటూరి సుందరరామమూర్తి, దాసరి నారాయణ రావు, యద్దనపూడి సులోచనా రాణి, ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, కోదండ రామిరెడ్డి, సినారె, అంజలీదేవి, ఘంటసాల, సావిత్రి, ఆర్. నారాయణమూర్తి, కృష్ణ కుమారి, మంగళంపల్లి బాలమురళీకృష్ణ, రావు బాల సరస్వతీదేవి తదితరుల ఇంటర్వ్యూలనూ వినొచ్చు.
…? నాగవర్ధన్ రాయల