Irumudi | మాస్ మహారాజా రవితేజ ప్రధాన పాత్రలో తెరకెక్కిన తాజా చిత్రం ‘ఇరుముడి’ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. విడుదలైన తొలి నాలుగు రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్లో చేరిన ఈ చిత్రం, ముఖ్యంగా ఫ్యామిలీ ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ అందుకుంటోంది. రెండో వారంలోకి అడుగుపెట్టినప్పటికీ పలు ప్రాంతాల్లో హౌస్‌ఫుల్ ప్రదర్శనలతో సినిమా జోరు కొనసాగుతుండటం విశేషం. అయితే ఒకవైపు భారీ వసూళ్లతో దూసుకుపోతున్న ‘ఇరుముడి’.. మరోవైపు కొన్ని సన్నివేశాల కారణంగా వివాదాల్లో చిక్కుకుంది. సినిమాలో ప్రభుత్వ పాఠశాలలు, ఉపాధ్యాయులు, విద్యా వ్యవస్థను ప్రతికూలంగా చిత్రీకరించారంటూ ఉపాధ్యాయ సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఈ అంశం ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది.
‘ఇరుముడి’ సినిమాలో ప్రభుత్వ పాఠశాలలు, అక్కడ పనిచేసే ఉపాధ్యాయులను కించపరిచేలా కొన్ని సన్నివేశాలు ఉన్నాయని ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాలు ఆరోపిస్తున్నాయి. ముఖ్యంగా విద్యారంగంపై ప్రజల్లో తప్పుడు అభిప్రాయాలు ఏర్పడేలా కొన్ని పాత్రలు, ఘటనలను చూపించారని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సమాఖ్య నేతలు చెన్నుపాటి మంజుల, బసవలింగారావుతో పాటు యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. వెంకటేశ్వర్లు ఈ వ్యవహారంపై స్పందించారు. సినిమా వంటి శక్తిమంతమైన మాధ్యమం సమాజంపై ఎంతో ప్రభావం చూపుతుందని, అలాంటి మాధ్యమంలో ప్రభుత్వ పాఠశాలలు, ఉపాధ్యాయులపై ప్రతికూల భావన కలిగించేలా సన్నివేశాలు చూపించడం సమంజసం కాదని వారు పేర్కొన్నారు.
ప్రభుత్వ బడులు, ఉపాధ్యాయుల పట్ల ప్రజల్లో అపోహలు పెంచేలా ఉన్న వివాదాస్పద సన్నివేశాలను వెంటనే తొలగించాలని ఏపీటీఎఫ్, యూటీఎఫ్, ఇతర ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ వివాదం తీవ్రరూపం దాల్చడంతో ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ బొర్రా గోపీ మూర్తి కూడా స్పందించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని తన క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఈ విషయంపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌కు లేఖ రాసినట్లు తెలిపారు.ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని వివాదాస్పద సన్నివేశాలపై చర్యలు తీసుకోవాలని, వాటిని సినిమా నుంచి శాశ్వతంగా తొలగించేలా చూడాలని ఆయన విజ్ఞప్తి చేశారు. సినిమాలో అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు నియోజకవర్గ పరిధిలోని సీలేరు జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలకు సంబంధించిన బోర్డును చూపిస్తూ కొన్ని దృశ్యాలను చిత్రీకరించడంపై కూడా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. అధికారిక డ్రెస్ కోడ్‌తో విద్యార్థినులను చూపించడం, అదే పాఠశాలకు సంబంధించిన ప్రధానోపాధ్యాయురాలి పాత్రను ప్రతికూలంగా చిత్రీకరించడం ఉపాధ్యాయ వర్గాల్లో తీవ్ర ఆగ్రహానికి కారణమైంది.