ఇంటి నుంచి బయటికి అడుగెయ్యాలంటే.. ఒంటికి సెంటు కొట్టాల్సిందే. చెమట వాసన రావొద్దన్నా, శరీరం సువాసనలు వెదజల్లాలన్నా.. బాడీ మొత్తం ‘బాడీ స్ప్రే’ చేసుకోవాల్సిందే! శరీరమే కాదు.. గది కూడా కమ్మటి వాసనలతో నిండిపోవాలని రూమ్ స్ప్రేలూ వాడేస్తున్నారు. ఈ సువాసనలు మనసుకు హాయినిస్తాయి. కానీ, ఆరోగ్యానికి చేటు తెస్తాయి. ఇప్పుడొస్తున్న అనేక రకాల పర్ఫ్యూమ్స్, రూమ్ ఫ్రెష్నర్ల తయారీలో ప్రమాదకర రసాయనాలను వాడుతున్నారు. విభిన్నమైన సువాసనల కోసం, అవి ఎక్కువ సమయంపాటు తాజాగా ఉండటం కోసం.. బెంజీన్, ైస్టెరిన్, ఫార్మాల్డిహైడ్, థాలేట్స్, వోలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్ లాంటివి విరివిగా కలిపేస్తున్నారు. ఈ రసాయన సమ్మేళనాలు శ్వాసకోశ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతాయి. కొన్ని చర్మానికి హాని చేస్తే.. మరికొన్ని క్యాన్సర్కు దారితీస్తాయి.
బెంజీన్: బాడీ స్ప్రే సువాసనలు ఎక్కువ సమయంపాటు శరీరంపై ఉండేందుకు ‘బెంజీన్’ అనే రసాయనాన్ని వాడతారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికే బెంజీన్ను ‘కార్సినోజెన్’గా ప్రకటించింది. అంటే.. దీనిని దీర్ఘకాలంపాటు వాడితే క్యాన్సర్కు గురయ్యే ప్రమాదం ఉంది.
స్టైరిన్: ఇది ఓ క్యాన్సర్ కారకం. శ్వాసకోశ వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. చికాకును కూడా కలిగిస్తుంది.
థాలేట్స్: సువాసనలు ఎక్కువసేపు ఉండేందుకు ఎయిర్ ఫ్రెష్నర్లలో వీటిని వాడుతుంటారు. ఇవి మహిళల్లో హార్మోన్ల అసమతుల్యతను ప్రేరేపిస్తాయి. ఫలితంగా.. సంతాన సమస్యలు పెరుగుతాయి. పిండాల ఎదుగుదలపైనా ప్రభావం చూపుతాయి.
ఎసిటాల్డిహైడ్: ఇది నాడీవ్యవస్థ, శ్వాసకోశ వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. దీర్ఘకాలంలో క్యాన్సర్కు దారితీస్తుంది.
వోలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్: వీటిని ఎక్కువగా రూమ్ ఫ్రెష్నర్ల తయారీలో వాడుతారు. ఇవి శ్వాసకోశ సమస్యలతోపాటు కళ్లు, ముక్కు, గొంతు భాగాల్లో చికాకు
కలిగిస్తాయి.