Beauty Tips | ఉదయం పూట చలిగాలులు, కాస్త పొద్దెక్కగానే వేడిగాలులు.. శిశిరంలో వాతావరణం విచిత్రంగా ఉంటుంది. వాతావరణమే కాదు ఈ కాలంలో చర్మ సమస్యలూ చికాకు పెట్టిస్తాయి. దురద, పొలుసులుగా కనిపించే చర్మం, నొప్పితో కనిపించే దద్దుర్లను అశ్రద్ధ చేయడానికి లేదు.పొడిగాలులు, ఒంట్లో తగినంత తేమ లేకపోవడం ఈ దద్దుర్లకు దారితీస్తుంది. వీటికి తోడు మరీ వేడినీటితో స్నానం చేయడం, బిగుతైన దుస్తులు, సున్నితమైన చర్మం కూడా దద్దుర్లకు కారణం అవుతాయి.
చాలా సందర్భాల్లో వీటిని సాధారణ చర్మసమస్యగా భావించేస్తుంటారు. పొడిదనం వల్లే ఈ సమస్య వస్తుంది కాబట్టి, చర్మానికి తగినంత తేమ కలిగించేలా కొబ్బరినూనె, అలొవెరా జెల్ లాంటివి రాస్తే ప్రయోజనం ఉంటుంది. అలర్జీలకు వ్యతిరేకంగా ఉపయోగించే యాంటీహిస్టామిన్స్ లాంటి మందులను ఉపశమనం కోసం వైద్యుడి సలహా మేరకు వాడవచ్చు. వీటితో పాటుగా గోరువెచ్చని నీటితోనే స్నానం చేయడం, రసాయనాలు తక్కువగా ఉన్న కాస్మెటిక్స్ వాడటం తప్పనిసరి.