అందం అంటే.. ఇందువదనం కనువిందు చేయడం ఒకటే కాదు.. కేశాలు మొదలుకొని కాలి గోళ్ల వరకూ.. అన్నిటి మీదా శ్రద్ధ పెట్టాల్సిందే. ముఖ్యంగా.. చేతిగోళ్లను మకుటాల్లా తీర్చిదిద్దుకుంటే.. కనిపించే తీరే వేరుగా ఉంటుంది. అయితే, బయటినుంచి ఎన్ని నెయిల్ పాలిష్‌లు రాసినా.. కొందరి గోళ్లు మాత్రం పెళుసుగా, విరిగినట్లు కనిపిస్తాయి. శరీరంలో విటమిన్లు, ఖనిజాలు, ఇతర సూక్ష్మపోషకాల లోపం ఉన్నప్పుడే.. ఇలాంటి సమస్యలు ఎదురవుతాయి. సమతుల పోషకాహారాన్ని తీసుకున్నప్పుడే.. గోళ్లు బలంగా, ఆరోగ్యంగా తయారవుతాయి.
యాంటి ఆక్సిడెంట్లు, విటమిన్లు సమృద్ధిగా ఉండే పాలకూర, బ్రొకోలి లాంటి ఆకుపచ్చని ఆహారాన్ని తీసుకుంటే.. గోళ్లు ఆరోగ్యకరంగా పెరుగుతాయి. వీటిలో లభించే ఐరన్, ఫోలేట్, కాల్షియం, విటమిన్ ఎ, విటమిన్ సి.. గోళ్లు విరిగిపోకుండా కాపాడతాయి. ఇక చిలగడదుంపల్లో బీటా కెరోటిన్ పుష్కలంగా లభిస్తుంది. ఇది గోళ్ల ఆరోగ్యంలో కీలకపాత్ర పోషిస్తుంది. సాల్మన్ చేపలను ఆహారంలో చేర్చుకోవడం వల్ల.. ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, ప్రొటీన్, విటమిన్ డి, సెలీనియంతోపాటు అనేక ఇతర సూక్ష్మపోషకాలు శరీరానికి అందుతాయి. ఇవి గోళ్లు విరిగిపోకుండా, పగుళ్లు రాకుండా చూస్తాయి. గోళ్ల పెరుగుదలను ప్రోత్సహిస్తాయి.
అవకాడోలో విటమిన్ ఇ, విటమిన్ బి, ఫోలేట్తోపాటు అనేక సూపర్ న్యూట్రియెంట్లు ఉంటాయి. ఇవి గోళ్ల ఆరోగ్యానికి భరోసా ఇస్తాయి. అవకాడోలో ఉండే విటమిన్ ఇ.. గోళ్ల పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. గోళ్లకు సహజమైన మెరుపును అందిస్తుంది. ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు.. గోళ్లను నిరంతరం తేమగా ఉంచడంలో సాయపడతాయి.
గోళ్లను బలోపేతం చేసే రాగి, జింక్ వంటి సూక్ష్మపోషకాలు, మాంగనీస్, విటమిన్ బి6, విటమిన్ ఇ, బి-కాంప్లెక్స్ వంటి విటమిన్లు పొద్దుతిరుగుడు విత్తనాల్లో పుష్కలంగా లభిస్తాయి. బలహీనమైన, పెళుసు గోళ్లతో బాధపడేవారు.. వీటిని తరచుగా తీసుకుంటే మంచిది.