‘మనసొక మధు కలశం’ అన్నాడో సినీ కవి. కానీ, మన మనసు ఒక అందమైన పెరటితోట లాంటిదని మానసిక నిపుణులు సెలవిస్తున్నారు. అందులో మంచి ఆలోచనలు నాటితే.. జీవితానికి ఉపయోగపడే అద్భుత ఫలాలను అందిస్తుందని అంటున్నారు. తోటలో కలుపు మాదిరే మనసులోనూ ప్రతికూల ఆలోచనలు, ఆందోళనలు పెరుగుతాయనీ.. వాటిని ఎప్పటికప్పుడు ఏరివేయాలని చెబుతున్నారు. మొత్తానికి.. ‘మైండ్ గార్డెనింగ్’తో జీవితాన్ని ఆనందమయం చేసుకోవాలని సలహా ఇస్తున్నారు.

1. మంచితోట కావాలంటే మంచి విత్తనాలు నాటాల్సిందే! మన మనసులో నాటేందుకు.. కృతజ్ఞత, సృజనాత్మకత, మంచి అభిరుచులు లాంటి విత్తనాలను ఎంచుకోవాలి. పుస్తకాలు చదవడం, మొక్కల పెంపకం, నచ్చిన కళలపై దృష్టి పెట్టడం ద్వారా.. ఆరోగ్యకరమైన కొత్త ఆలోచనలకు బీజం పడుతుంది. ఇక రోజులో జరిగిన కొన్ని మంచి విషయాలను రాత్రి పడుకునే ముందు ఒకసారి గుర్తుచేసుకోవాలి. ఇది మనసుకు మంచి పోషణను అందిస్తుంది.
2. విత్తనం వేసిన మరుసటి రోజే పండ్లు చేతికి రావు. అందుకు సమయం పడుతుంది. అలాగే, మానసిక మార్పు కూడా రాత్రికి రాత్రే జరిగేది కాదు. కాబట్టి, ఓపికగా వేచి ఉండాలి. మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోకుండా, ప్రతిరోజూ చిన్నచిన్న ప్రయత్నాలు చేస్తూ.. మీపై మీరు ప్రేమను చూపించుకోవాలి.

3. మొక్కలు ఒక క్రమపద్ధతిలో పెరిగితేనే తోట అందంగా ఉంటుంది. మనసు కూడా అంతే! గందరగోళ పరిస్థితులు ఉంటే.. దేనిపైనా మనసు నిలవదు. అందుకే, మనసులోని గందరగోళాన్ని ఒక డైరీలో రాయండి. దీనివల్ల ఆలోచనలన్నీ ఒక క్రమపద్ధతిలోకి వస్తాయి. రోజుకు కనీసం 10-15 నిమిషాలు ప్రశాంతంగా కూర్చుని శ్వాసపై ధ్యాస పెట్టండి. దీనివల్ల మనసులోని గందరగోళం తగ్గి, విషయాలపై స్పష్టత వస్తుంది.

4. తోటలో అప్పుడప్పుడూ కలుపు మొక్కలు పెరుగుతాయి. ముఖ్యమైన మొక్కల ఎదుగుదలను ఆపేస్తాయి. మన మనసులో కూడా ప్రతికూల ఆలోచనలు, డిజిటల్ డిటాక్స్ లాంటి కలుపు మొక్కలు కనిపిస్తాయి. ‘నేను చేయలేను’, ‘నాకే ఎందుకు ఇలా జరుగుతోంది?’ అనే స్వీయ సందేహాలను, ఓవర్ థింకింగ్‌ను గుర్తించి.. వాటిని వెంటనే తొలగించాలి. ఇక ఉదయం లేవగానే సోషల్ మీడియా స్క్రోల్ చేయడం, ప్రతికూల వార్తలు చదవడం వల్ల మనసులో ‘డిజిటల్ ఫెటిగ్’ పెరుగుతుంది. దీనిని తగ్గించాలి.
5. తోట చుట్టూ కంచె లేకుంటే.. జంతువులు వచ్చి పాడుచేస్తాయి. అలాగే మీ మనసుకు కూడా కొన్ని సరిహద్దులు పెట్టుకోవాలి. పని వేళలకు, వ్యక్తిగత జీవితానికి మధ్య స్పష్టమైన గీత గీయడం అన్నిటికన్నా ముఖ్యం. ఇదే.. మీ మనసు తోటను కాపాడే కంచె. ఇక మానసిక ప్రశాంతతను దెబ్బతీసే పనులకు, వ్యక్తులకు దూరంగా ఉండాలి. నచ్చని పనులకు ‘నో’ చెప్పడం నేర్చుకోవాలి.