Marriage Detective | తస్మాత్ జాగ్రత్త! జమానా బదల్ గయా. వంద అబద్ధాలు ఆడినా సరే.. ఒక్క పెండ్లి కూడా చెయ్యలేరు. చెప్పేవి చిన్నా చితకా అయితే ఫర్వాలేదు. ఏకంగా భాగస్వాముల జీవితాన్నే తలకిందులు చేసే అబద్ధాలు ఆడుతున్నారు చాలామంది. అందులో ఆడ,మగ.. ఇద్దరూ ఉన్నారు. ఆ అబద్ధాలను బద్దలుకొట్టడానికి వచ్చేస్తున్నారు మ్యారేజ్ డిటెక్టివ్స్.
కొత్తగా పరిచయమైన స్నేహితురాలి ముందు కోతలు కోస్తూనే ఉంటాడు రఘునందన్. లండన్‌లో చదువుకున్నానని, మల్టీనేషనల్ కంపెనీలో పనిచేస్తున్నానని, ముంబైలో బీచ్ ఫేసింగ్ ఫ్లాట్ ఉందని.. అబద్ధం మీద అబద్ధం.. మల్టీస్టోరీడ్ బిల్డింగ్‌లా కట్టేశాడు. ఒంటరి లైఫ్ బోరింగ్‌గా ఉందని, పెండ్లి కోసం మ్యాట్రిమోనియల్ సైట్స్‌లో వివరాలు అప్లోడ్ చేశాననీ రొమాంటిక్ భాషలో చెప్పాడు. అతని మాటలకు ఫిదా అయిపోయింది ఆ కాంతామణి. ఉదారంగా డేటింగ్‌కు అనుమతి ఇచ్చింది. సహజీవనానికి పచ్చజెండా ఊపింది. ఇద్దరూ ఓ లగ్జరీ ఫ్లాట్‌లో కొత్త జీవితం మొదలుపెట్టారు. కొన్నాళ్లు బాగానే సాగింది. అయితే, తన తండ్రి నుంచి కాల్ వచ్చినప్పుడల్లా అతను బయటికి వెళ్లి గుసగుసగా మాట్లాడేవాడు. బ్యాంకు పని ఉందంటూ మాయమైపోయేవాడు. మొదట్లో అనుమానం రాకపోయినా.. క్రమంగా ప్రవర్తనలో ఎక్కడో తేడా కొట్టింది. వెంటనే ఓ సీక్రెట్ మ్యారేజ్ ఏజెన్సీని సంప్రదించింది. అంతే.. వారం తిరిగేలోపు రఘునందన్ అబద్ధాల చిట్టా బయటపడింది. అతనికి భార్య, పిల్లలు ఉన్నారు. ఒకట్రెండు ఎఫైర్స్ కూడా లేకపోలేదు. బ్యాంక్ ఉద్యోగం మినహా అన్నీ అబద్ధాలే. అదీ ఓమోస్తరు కొలువే. మ్యారేజ్ మోసగాళ్లలో మహిళలూ ఉన్నారు. అందుకే జీవిత భాగస్వామి ఎంపిక విషయంలో చాలా అంటే చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మానసిక రుగ్మతలు, వ్యసనాలు, లైంగిక సమస్యలు, నేర చరిత్ర, కుటుంబ వివరాలు, ఎఫైర్స్, ఆర్థిక స్థితి, చదువు, ఉద్యోగం, ప్రవర్తన.. తదితర విషయాలు కచ్చితంగా తెలుసుకోవడానికి సీక్రెట్ ఏజెన్సీలను సంప్రదిస్తున్నారు.
పెండ్లి తర్వాత కూడా జీవిత భాగస్వామి రహస్యాలు తెలుసుకునేందు ప్రైవేట్ డిటెక్టివ్‌లను సంప్రదించేవారి సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇందుకు ఉదాహరణే.. మెట్రో
డిటెక్టివ్ ఏజెన్సీ. ఈ సంస్థకు చెందిన డిటెక్టివ్లు నెలకు దాదాపు 45 ప్రీ మ్యాట్రిమోనియల్ కేసులను పరిశోధిస్తున్నారు. హైదరాబాద్‌కు చెందిన అదితి అనే వైద్యురాలు ఓ వ్యక్తిని పెండ్లి చేసుకోవాలనుకుంది. అయితే అతనికి ధూమపాన వ్యసనం ఉండటంతో వద్దనుకుంది. ఆ తర్వాత అతనే స్వయంగా వచ్చి.. పూర్తిగా మారిపోయానని, ఇకనుంచీ మందు, సిగరెట్ ముట్టనని ప్రమాణం చేశాడు. అతని మాటలు నమ్మిన ఆ వైద్యురాలు మళ్లీ పెద్దలతో మాట్లాడింది. ఎంగేజ్మెంట్ కూడా పూర్తయింది. వెడ్డింగ్ కార్డులు ప్రింట్ చేయించారు. అయినా ఎక్కడో అతనిపై ఓ చిన్న అనుమానం. వెంటనే ఓ డిటెక్టివ్‌ను సంప్రదించింది. వారం వ్యవధిలోనే అతను మందు, సిగరెట్, గంజాయి తాగుతున్న ఫొటోలు ఆమెకు చేరాయి. అంతే, పెండ్లి క్యాన్సిల్ చేసుకుందా డాక్టరమ్మ.
తమ దగ్గరికి వచ్చిన కేస్లకు సంబంధించి.. ప్రాథమిక సమాచారం సేకరించి, పోలీస్ స్టేషన్లో ఆరా తీస్తారు మ్యారేజ్ డిటెక్టివ్స్. ఆధార్, పాన్ సాయంతో ఆర్థిక చరిత్ర తవ్వుతారు. సామాజిక మాధ్యమాల ద్వారా కొంత తెలిసిపోతుంది. బంధువులు, డ్రైవర్లు, రెస్టారెంట్ సిబ్బంది ఇలా.. వారిని ఎరిగిన ప్రతీ వ్యక్తితో స్నేహం చేస్తారు. రహస్యంగా ఫాలో అవుతారు. మెడికల్ రిపోర్టులు తెప్పించుకొని వైద్యులతో ధ్రువీకరించుకుంటారు. తుది నిర్ణయం మాత్రం క్లయింట్‌దే. ఇలాంటి పరిశోధనల వల్ల వ్యక్తిగత గోప్యతకు భంగం వాటిల్లుతుందనే వాదనలూ వినిపిస్తున్నాయి. ఆ గోప్యత వెనుక చీకటి జీవితం ఉన్నప్పుడు.. బట్టబయలు చేస్తే తప్పేమిటని నిలదీసేవారూ లేకపోలేదు. నిజమే, వజ్రాన్ని వజ్రంతోనే కోయాలి. రహస్యాల్ని రహస్యంగానే ఛేదించాలి.
అనాథనని చెప్పాడు. ఆస్తి పాస్తులు చాలా ఉన్నాయని నమ్మబలికాడు. నయాపైసా కట్నం వద్దన్నాడు. ఎదురుకట్నం కింద కోటి రూపాయల విలువైన ఫ్లాట్ కొనిస్తానని చెప్పాడు. ఆ అమ్మాయి నమ్మింది. అతగాడి సెల్‌ఫోన్ స్విచ్చాఫ్ అయ్యాక కానీ విషయం అర్థం కాలేదు. వెంటనే డిటెక్టివ్‌లను సంప్రదించింది. మొత్తానికి అతని అడ్రస్ సంపాదించారు. ఆ నిత్య పెండ్లికొడుకు మోసాలను సాక్ష్యాలతో నిరూపించారు. థ్యాంక్స్ టు మ్యారేజ్ డిటెక్టివ్స్!
“కట్నం కింద ఖరీదైన కారు ఇవ్వనందుకు.. పెళ్లిని రద్దు చేసిన కాలేజీ లెక్చరర్”