అదో రంగస్థలం. అక్కడో గోల్కొండ కోట. సింహద్వారానికి ఇరువైపులా ద్వారపాలకులు. కోటలోకి అడుగుపెడితే.. సైనికులు. వాళ్ల మధ్య పట్టు తలపాగా, ముత్యాల హారాలు, బంగారు ఆభరణాల్లో మురిసిపోతున్న మంత్రులు… ఎదురుగా సింహాసనంపై నవరత్న ఖచిత ఆభరణాల్లో వెలిగిపోతూ నవాబు.. గోల్కొండ గతవైభవం, రాచరిక పౌరుషం ఉట్టిపడేలా మేకప్ ఆర్టిస్ట్ బాపనిపల్లి పరమేశ్వర్ చేసిన కనికట్టు అది! అంగీలకు డబ్బుల్లేక పాలమూరు నుంచి పట్నం వచ్చిన పరమేశ్వర్ వస్ర్తాలంకరణలో ఆరితేరాడు. తన మేకప్ కళతో నటులెందరినో నవరసాల్లో వెలిగించాడు. పాలమూరు చీకట్లను దాటి రంగుల కలలు కంటూ అయిదు నందులు గెలిచిన తెలంగాణ బిడ్డ బతుకుపయనమిది.
అయిదెకరాల పొలం ఉన్నా.. ఆకలి బతుకులు మాయి. నేను ఏడో తరగతి చదువుతున్న రోజులవి. అప్పటికే రెండేండ్ల సంది కరువు. మా అమ్మానాన్నలు చన్నమ్మ, బక్కయ్య రెక్కలు ముక్కలు చేసుకొని పనిచేసినా పొట్టకే సరిపోతుండె. అంగీలు గిట్ల సరిగ్గ ఉండకపోవు. ఎండకాలం సెలవుల్లో కూలి కోసమని గండ్రావుపల్లి (నేటి నాగర్‌కర్నూల్ జిల్లా, పెద్దకొత్తపల్లి మండలం) నుంచి హైదరాబాద్ వచ్చిన. అట్ల 44 ఏండ్ల కిందట పట్నంల దిగిన. వారం రోజులు పని కోసం మస్తు తిరిగిన. రైల్వేస్టేషన్, బస్టాండ్, చౌరాస్తలల్ల పండుకున్న. చిన్నోడినని మేస్త్రీ పనికి తీసుకోలే. పిల్లల్ని షాపులల్ల పెట్టుకుంటరని బాగ్‌లింగంపల్లిలో ఉన్న ‘ఆదర్శ డ్రెస్ ప్యాలెస్’లో అడిగితె..‘నువ్వు చేస్తావో లేదో, నెల రోజులు చూస్తా’ అన్నడు ఓనర్ తిరుమల శేషాచారి. బువ్వ పెట్టి చేయించుకున్నడు. నెల తర్వాత భోజనం పెట్టి నెలకు ముప్పయ్ రూపాయల జీతం ఇస్తన్నడు.
ఊరి దారి.. బతుకు దారి
నాకు పద్నాలుగేండ్లు వచ్చినయ్. ‘అరె పిలగ.. పనితోపాటు సదువుండాలె. పది వరకన్నా సదవాలె’ అని నలుగురు చెప్పేసరికి ఇంటికిపోవాల్ననే ఆలోచన వచ్చింది. మూడేండ్ల తర్వాత ఇంటికిపోయిన. నాగర్‌కర్నూల్ జాతీయ ఉన్నత పాఠశాలలో చేరిన. పదో తరగతి దాంక సదివిన. పది పరీక్షలు రాసిన. ‘మళ్లీ రాగలవు’ అని ఆదర్శ డ్రెస్ ప్యాలెస్ నుంచి ఉత్తరం అచ్చింది. మల్ల హైదరాబాద్ వచ్చిన. అక్కడ ఏడాదినర్ధం పనిచేసినంక, కేశవరామ్ గారి దగ్గర చేరిన.
ఆయన మంచి ఆర్టిస్ట్. బొమ్మలు బాగా గీసేటోడు. అమ్మవారి బొమ్మలు, క్యాలెండర్లో కృష్ణుడి బొమ్మలు చూసి అట్ల మేకప్ చేయాల్నని పట్టుదలతో నేర్చుకున్న. ‘మనం షాపుని శుభ్రంగా ఉంచుకుంటే ఇల్లు కూడా శుభ్రంగా ఉంటుంది’ అని మా గురువు కేశవరామ్ గారు చెప్పేటోడు. ఆయన ‘నాటకానికి దుస్తులు తీసుకుపోయి, తీసుకుని వచ్చేయ్’ అని పంపేటోడు. నాకు తప్ప వేరేటోళ్లకు ఇచ్చేవాడు కాదు. షాప్ నుంచి ఏ మడతతో తీస్కపోయిన్నో, అదే మడతతో తెచ్చి అప్పగించేది. ‘రాత్రి నాటకం ఆడలేదా? ఏంటి?’ అనడిగేటోడు. అంత కచ్చితంగా పనిచేస్తుండే నేను.
పెట్టుబడి లేని కంపెనీ
నాటకం ఉన్న రోజు ఆర్టిస్ట్‌లకు నేనే గుర్తొచ్చేది. ‘పరమేశ్ ఉంటే మేకప్ సక్సెస్. అతణ్నే పిలవండి’ అనేటోళ్లు. ఆ రోజుల్లో హైదరాబాద్‌లో మూడే డ్రెస్ కంపెనీలు ఉండేవి. ‘ఎలాగూ మేకప్ వేస్తావు కదా. డ్రెస్‌లు అద్దెకు తెచ్చుకో. మేకప్ డబ్బులు నువ్వు ఉంచుకుని, డ్రెస్‌ల డబ్బులు వాళ్లకు ఇచ్చేయ్’ అని పెద్ద కళాకారులు సలహా ఇస్తే.. మూడేండ్లకు కేశవరామ్ గారి దగ్గర సెలవు తీసుకున్న. ఫ్రీలాన్స్ మేకప్ ఆర్టిస్ట్‌గా కెరీర్ మొదలుపెట్టిన. శ్రీకృష్ణుడు, హరిశ్చంద్ర పాత్రలకు పేరుగాంచిన దేవనాథసూరి నన్నెంతగానో ప్రోత్సహించిండు. పద్యనాటకంలో గొప్ప నటుడిగా పేరుగాంచిన గుమ్మడి గోపాలకృష్ణకు మేకప్ చేసిన.
ఆయన ప్రదర్శన ఎక్కడుంటే అక్కడికి పోతుండే. కృష్ణుడు వేషధారి నాంచారయ్య (ఏజీ ఆఫీస్ ఉద్యోగి), నాటక దర్శకుడు సిద్ధప్ప నాయుడు (సెక్రటేరియట్ ఉద్యోగి) డ్రెస్ కంపెనీ పెట్టుకో, మేమే డబ్బులిస్తమన్నరు. వాళ్ల వయసుకి నేను చానా చిన్నోడిని. వాళ్లిద్దరూ మనోడిని ప్రోత్సహించాలె అనుకున్నరు. దుస్తులు, కిరీటాలు, ఆభరణాలు కొన్నం. మొత్తం ముప్పైవేలు అయినయ్. అప్పట్ల అది పెద్ద మొత్తం. డబ్బంతా వాళ్లే ఇచ్చిన్రు. కాగితం మీద సంతకం పెట్టమనలే. తాకట్టు అడగలే. వాళ్ల మేకప్ చార్జీ కింద అప్పు చెల్లు చేసుకున్నరు.
మహానుభావులతో..
భీముడి పాత్రలకు ప్రసిద్ధిగాంచిన నిమ్మగడ్డ నాగేశ్వరరావు నా పని తీరు చూసి మెచ్చుకున్నడు. ‘నీకు బాగా పేరొస్తది’ అన్నడు. ఆయన అన్నట్టే మంచి పేరొచ్చింది. గోపాలకృష్ణ గారి ద్వారా ఎంతోమంది గొప్ప ఆర్టిస్ట్‌లకు మేకప్ చేసిన. హరిశ్చంద్ర పద్యాలతో ప్రసిద్ధుడైన చీమకుర్తి వారికి మీసం పెట్టిన. సినిమాల్లో శ్రీకృష్ణుడికి ఎన్టీఆర్ ఎంత ఫేమస్సో తెలుగు రంగస్థలంలో పీసపాటి గారు అంత ఫేమస్. ఆయనకు కూడా మేకప్ చేసిన. పద్యనాటకాల్లో ఎంతోమంది కళాకారులు అనుసరిస్తున్న ఆంజనేయ రాజుకు కృష్ణుడి వేషం కట్టాను. ఏవీ సుబ్బారావు, ఆయన ముగ్గురు కొడుకుల ముఖాలకు రంగులద్దాను.
సురభి నాగ్, దుగ్గిరాల సోమేశ్వరరావు, రక్త కన్నీరు నాగభూషణం, మొదలి నాగభూషణ శర్మ వంటి ఎందరో మహానుభావులను కలుసుకున్న. వాళ్లకు మేకప్ వేసే అవకాశం దక్కింది. ఆ రోజుల్లో త్యాగరాయ గానసభ (హైదరాబాద్)లో అర్ధరాత్రి వరకు ప్రదర్శనలు జరిగేవి. చేతినిండా పని ఉంటుండే. నంది నాటకోత్సవాలకు కూడా పనిచేసే అవకాశం వచ్చింది. ఆ నాటకాల్లో ఉత్తమ నాటకాలు, నటులతోపాటు ఇతర కళాకారులకూ అవార్డులిచ్చేది. ఉత్తమ రంగస్థల మేకప్ ఆర్టిస్ట్‌గా అయిదుసార్లు అవార్డు గెలుచుకున్న. నంది నాటకోత్సవాల్లో శ్రీకృష్ణ రాయబారం, దావీద్ విజయం, శ్రీనాథుడు, మహావీర నరకాసుర, బొబ్బిలి యుద్ధం నాటకాలకు మేకప్ చేసినందుకు నాకు అయిదు నందులు దక్కినయ్.
ఆర్టిస్టులే నా బలగం..
చేతినిండా పని ఉన్న రోజుల్లో మా ఊరి నుంచి ఇద్దరు పిలగాళ్లను తీసుకొచ్చిన. వాళ్లను అసిస్టెంట్లుగా పెట్టుకోని మేకప్ చేసేది. ఒకటి రెండేళ్లు ఇంట్లో ఉంచుకొని, అన్నంపెట్టి పని నేర్పిన. తర్వాత సొంతంగా మేకప్ ఆర్టిస్ట్‌గా పని చేసుకోమని చెప్పిన. నాకు వచ్చిన ఆర్డర్లు ఇచ్చి వాళ్లని నిలబెట్టిన. ఇట్ల మా ఊరి వాళ్లే కాదు మా అత్తగారి ఊరివాళ్లు, సిటీలో కూరగాయలు అమ్మేటోళ్లు, పండ్లు అమ్మేటోళ్లు, గోడలకు సున్నాలు వేసే పిలగాళ్లను చేరదీసి అన్నం పెట్టిన. పని నేర్పించిన. వాళ్లు టీవీలో, సినిమాల్లో, రకరకాల చోట్ల పని చేసుకుంట బతుకుతున్నరు. రంగులు నాకెన్నో అనందాలిచ్చినయ్. మేకప్ నాకు అన్నం పెట్టింది. ఇంత పేరు తెచ్చింది. నా ఒంట్లో శక్తి ఉన్నంతవరకు ఈ పని కొనసాగిస్తూనే ఉంట!
ఎన్టీఆర్‌కు తిలకం దిద్దిన
విశ్వామిత్ర సినిమా షూటింగ్ జరుగుతున్న రోజుల్లో ఎన్టీఆర్ పర్సనల్ ఆర్టిస్ట్ ముత్తు రాలే. నేను అప్పటికే బొట్టు బాగా పెడుతనని పేరు. ఆ సినిమాలో బొట్టు పెట్టేందుకు నన్ను పిలిచిన్రు. ఎన్టీఆర్, కైకాల సత్యనారాయణతోపాటు ఇంకొంతమంది సహాయ నటులకు తిలకాలు దిద్దిన. అట్లనే నర్సింహరాజు, ప్రభ, సోమయాజులు, రమణమూర్తి వంటి సీనియర్ నటులెందరికో మేకప్ చేసే అవకాశం దక్కినా.. రంగస్థలం మీదనే నిలదొక్కుకున్న.
ఆయుధాలే ఆస్తులు!
పని మొదలుపెట్టినప్పటి సంది వచ్చిన లాభం దాచుకోలే. దుస్తులు, మేకప్ సామగ్రి కొనడానికే ఖర్చు పెట్టిన. డబ్బు సంపాదించలే. అన్నీ వస్తువులే సంపాదించుకున్న. సినీ నటుడు ధూళిపాళ గారు, కర్ణుడి వేషానికి ప్రసిద్ధిగాంచిన వేమూరి రామయ్య గారు సొంతంగా కిరీటాలు, ఆభరణాలు తయారు చేసుకున్నరు. వాళ్ల వయసు పైబడిన తర్వాత నాటకాలు ఆపేశిన్రు. అయితే, వాళ్ల ఆభరణాలు, ఆయుధాలు మూలనపడటం కన్నా.. నలుగురు కళాకారులకు ఉపయోగపడితే మేలనుకున్నరు. వాటిని భద్రంగా చూసుకుంటూ, కళాకారులకు అందించే సరైనోడు ఎవరా అని స్టేటంతా ఆరా తీసిన్రట. చివరికి నన్ను పిలిచిన్రు. పాండవులు వనవాసానికి ముందు ఆయుధాలను జమ్మి చెట్టు మీద దాచినట్టు. వానప్రస్థానికి ముందు వాళ్ల ఆయుధాలు, ఆభరణాలు నా చేతిలో పెట్టిన్రు. నా పనితనం, వ్యక్తిత్వం వాళ్లకు అంతగనం నచ్చింది.
…? నాగవర్ధన్ రాయల