కొందరి జీవితాలు నిత్య స్ఫూర్తిమంత్రాలు. ఆడామగా అన్న భేదాన్ని అధిగమించినవిజయ పతాకలు. ముందు మనకు నచ్చింది చేస్తే సమాజమూ మెచ్చుతుందని చేసి చూపించే మార్పు గొంతుకలు. అలాంటి వారిలో ‘మాధవి బండారి’ కూడా ఒకరు. నలభైయ్యేండ్ల క్రితం ఆడపిల్లలకు కబడ్డీ ఏంటి… అని వింతగా చూసిన సమాజంలోనే తాను కబడ్డీ ప్లేయర్‌నని గర్వంగా చెప్పుకొన్నారామె. జాతీయ స్థాయిలో పతకాలు గెలుచుకోవడమే కాదు, ఆ తర్వాత రాష్ట్ర టీమ్‌కి కోచ్‌గా, ప్రొ కబడ్డీ కమెంటేటర్‌గా, రాష్ట్ర ప్రభుత్వం తరఫున పీఈటీలకు ట్రైనర్‌గా… ఏ పని చేసినా తన సావాసం కబడ్డీతోనే. ఇష్టంగా కష్టపడటమే తన విజయ రహస్యం అంటూ ఆట గురించి ఆమె ‘జిందగీ’తో పంచుకున్న మాటలు.
Madhavi Bandari | ఆట గురించి చెప్పమంటే ఒకటీ రెండూ విషయాలు కాదు… నా దగ్గర టన్నుల కొద్దీ సంగతులు ఉంటాయి. ఎందుకంటే కబడ్డీ అనేది ఒక పోటీనో, ఒక విజయమో, ఒక పతకమో, ఒక పరాజయమో కాదు. అది నా జీవితం. నాతోపాటే పుట్టి నాతోపాటే పెరిగింది. ఒక రకంగా నా శరీరంలో ఒక భాగం. అందుకే నాకు ఊహ తెలిసిన నాటి నుంచి నేటి వరకూ పెండ్లి, పిల్లలు, ఉద్యోగం, బాధ్యతలు… అన్నిటితోపాటే అదీ ఉంది. దానిలోని ప్రతి అడుగునూ నేను ఆస్వాదిస్తా. పడుతూ లేస్తూ ఆడే ఈ ఆట నన్ను జీవితంలో పడకుండా నిలబెట్టింది. అయితే చిన్నప్పుడు పిల్లలతో కలిసి కబడ్డీ ఆడితేనే మొరటుగా చూసే ఇదే సమాజంలో పెండ్లయి, పిల్లలు పుట్టాక కూడా దాన్ని కొనసాగించగలిగానంటే, అందుకు నా నేపథ్యం, కుటుంబమే కారణం.
పల్లె నేపథ్యం వల్లే…
మాది యాదగిరిగుట్ట దగ్గరి బీబీనగర్. నాన్న హైదరాబాద్‌లో మెడికల్ ఆఫీసర్‌గా పనిచేసేవారు. నేను మా ఇద్దరు అక్కలు, ఇద్దరు అన్నయ్యలు… అందరం నాయనమ్మ, తాతయ్య దగ్గరే పెరిగాం. ఇంట్లో నేనే చిన్నదాన్ని. పల్లెటూరు అవడంతో రోజంతా ఆటలే ఆటలు. అందులోనూ ముఖ్యంగా కబడ్డీ, ఖోఖో… ఆడేవాళ్లం. అక్కడ ఏడో తరగతి పూర్తయ్యాక హైదరాబాద్ వచ్చాను. తార్నాక వెస్లీ స్కూల్లో చేరాను. నాతోపాటు ఊరి నుంచి మరికొందరు పిల్లలు కూడా వచ్చారు.
గేమ్స్ పీరియడ్‌లో ఇక్కడివాళ్లు కూర్చుని అదీ, ఇదీ చేస్తుంటే… మా బ్యాచ్ మాత్రం పోటాపోటీగా కబడ్డీ, ఖోఖో ఆడేవాళ్లం. దాంతో పీఈటీ సర్ మమ్మల్ని ప్రత్యేకంగా ఆదరించారు. నేను స్కూల్ నేషనల్స్‌కి కూడా ఆడాను. అప్పుడే మమ్మల్ని శ్రీకృష్ణ కబడ్డీ క్లబ్ వ్యవస్థాపకులు బలరాం యాదవ్ చూశారు. వాళ్ల క్లబ్లో చేర్చుకుని ఎంతగానో ప్రోత్సహించారు.
తర్వాత కస్తూర్బా కాలేజీలో ఇంటర్మీడియెట్ చేస్తూ కూడా జాతీయ స్థాయిలో ఆడాను. సీనియర్స్ విభాగంలో తొలిసారి తెలంగాణ జట్టుకు సిల్వర్ మెడల్ తీసుకొచ్చాను. ఇవన్నీ చూసి విశాఖ పోర్ట్ ట్రస్ట్ వారు పిలిచి ఉద్యోగం ఇచ్చారు. వాళ్ల టీంలో తెలంగాణ నుంచి ఎంపికైంది నేనొక్కదాన్నే. అప్పుడు మరీ చిన్నదాన్ని అవడం వల్ల ఏడాది మాత్రమే పనిచేసి ఇంటికొచ్చేశాను.
ఉదాహరణగా చెబుతారు…
హైదరాబాద్ వచ్చాక ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీలో చేరాను. ఆటను మాత్రం కొనసాగించాను. తర్వాత పెండ్లయింది. ఏడాదికే బాబు, మళ్లీ పాప. పసిపిల్లలు అవడంతో కొన్నాళ్లు ప్రాక్టీస్ చేయలేదు. అప్పుడే రాష్ట్రంలో ఆఫ్రో ఏషియన్ గేమ్స్ ప్రారంభమయ్యాయి. మహిళా కోచ్‌లకు ప్రాధాన్యం ఉంటుందని తెలియడంతో మావారి సహకారంతో నేను స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా బెంగళూరులో డిప్లొమా ఇన్ స్పోర్ట్స్ కోచింగ్‌లో చేరాను.
నా జీవితంలో అత్యంత కష్ట సమయం అది. రెండు మూడేండ్ల పిల్లలు, భర్తను వదిలిపెట్టి ఎక్కడో దూరంగా ఒక్కదాన్ని ఉండటం. అంతేకాదు, ప్రసవాల కారణంగా ఫిట్నెస్కి దూరమవడంతో అక్కడ ప్రాక్టీస్ చాలా కష్టమయ్యేది. అక్కడివాళ్లు తొలుత ఈ పిల్లల తల్లి ఎందుకొచ్చింది అన్నట్టు చూశారు. కానీ నాకు వెనక్కి తిరిగి రావడం ఇష్టం లేదు.
అందుకే మూడు వారాలపాటు విపరీతంగా కష్టపడి ఫిట్నెస్ పెంచుకున్నా. కాలి ఎముకలు బాగా వాచిపోయాయి. కానీ నేషనల్ ప్లేయర్‌గా నా సత్తా ఏంటో ఆ తర్వాతే వాళ్లు చూశారు. ఇంటికి పంపించేద్దాం అనుకున్న అమ్మాయిలో ఇంత ప్రతిభ ఉందా అని ఆశ్చర్యపోయారు. ఇప్పటికీ సాయ్‌లో పాఠాలు చెప్పేప్పుడు నన్ను ఉదాహరణగా చెబుతుంటారని విన్నప్పుడు నా కష్టం వృథా పోలేదు అనిపిస్తుంది.

గొంతు గుర్తుపడతారు…
అక్కడినుంచి వచ్చాక మన స్టేట్ టీంకి కొన్నేండ్లపాటు కోచ్‌గా పనిచేశా. దాంతోపాటు బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్, మాస్టర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్, ఎంఫిల్, పీహెచ్డీ… ఇలా చదువుతూ ప్రైవేట్ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ స్థాయికి వెళ్లాను. తర్వాత డీఎస్సీ పడటంతో పరీక్షరాసి పీఈటీగా ఎంపికయ్యాను. అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేసిన నేను పల్లెటూరి పాఠశాలలో శిక్షణ ఇవ్వడమేంటని ఎప్పుడూ అనుకోలేదు.
అదీ ఎంజాయ్ చేశా. దీన్నీ ఆస్వాదించా. ఆటను ఇష్టపడితే ఎక్కడున్నా ఆనందంగా ఉంటాం. అది వంద శాతం నిజం. బడిలో నా శిక్షణను చూసి రాష్ట్రంలోని పీఈటీలకు మీరు కోచింగ్ ఇవ్వాలంటూ నన్ను హైదరాబాద్‌కి పిలిచారు. గత కొన్నేండ్ల నుంచీ ఇక్కడే డిప్యుటేషన్ మీద పనిచేస్తున్నాను. ఇక్కడ చేస్తున్న సమయంలోనే స్టార్ స్పోర్ట్స్ వాళ్లు ప్రొ కబడ్డీ లీగ్‌కి మంచి కమెంటేటర్ కావాలని వాకబు చేయడంతో మహిళా కోచ్‌గా నా పేరు వాళ్లకి చేరింది.
తొలి పరీక్షలోనే వాళ్లు నా కామెంటరీ చూసి ఆశ్చర్యపోయారు. అలా ప్రొ కబడ్డీకి తొలి తెలుగు మహిళా కమెంటేటర్‌గా పనిచేశా. ఆ సీజన్లు విపరీతంగా హిట్ అవడంతో నా గొంతు కూడా అంతే ఫేమస్ అయింది. చాలామంది గుర్తుపడతారు కూడా. మొత్తం ఎనిమిది సీజన్లకు కమెంటేటర్‌గా పనిచేశా. ఖేలో ఇండియా, తెలంగాణ ప్రీమియర్ లీగ్, కబడ్డీ వరల్డ్ కప్ ఈవెంట్లలో వ్యాఖ్యాతగా వ్యవహరించా. నాకు ఆట మీద పట్టు ఉండటంతో స్టార్ స్పోర్ట్స్ హిందీ, ఇంగ్లిష్ భాషల కమెంటేటర్లకు నాతో పాఠాలు చెప్పించే వాళ్లు. కబడ్డీకి మంచి ఊపు తీసుకురావడంలో నా గొంతు పాత్ర కూడా ఉండటం గొప్పగా అనిపిస్తుంటుంది.
వాళ్ల ప్రోత్సాహమే

ఇప్పుడంటే నేను కబడ్డీ ప్లేయర్‌ని అని గొప్పగా చెప్పుకొంటున్నారు. కానీ, ఒకప్పుడు కబడ్డీ ఆడతా… అంటే ఒక రకంగా చూసేవాళ్లు. కానీ అలాంటి సమయంలో కూడా మా నాన్న నన్నెప్పుడూ నిరుత్సాహపరచలేదు. స్కూల్లో ఉన్నప్పుడు తెల్లవారుజామున నాలుగు గంటలకు లేచి నన్ను లేపి ప్రాక్టీస్‌కి తీసుకెళ్లే వారు. ప్రత్యేకంగా ఆహారం పెట్టేవారు. ఏ పనిచేసినా ‘నీకేంది బిడ్డా… తిరుగులేదు’ అని ప్రోత్సహించేవారు.
మా వారూ అచ్చం అలాగే దొరకడం నా అదృష్టం. నా ప్రతి అడుగులో ఆయన ఉంటారు. ఆయన ప్రోత్సాహం ఉంటుంది. మా పిల్లలూ అంతే సపోర్ట్ చేస్తారు. ఆడపిల్లను కాబట్టి ఇలా… అని నాకెప్పుడూ అనిపించలేదు. అందుకే నేను కూడా నా పిల్లలు, నేను పాఠాలు చెప్పే పిల్లలు ఎవరి దగ్గరైనా ఆడామగా తేడా చూపించను. కోచింగ్‌లోనే కాదు, బెంచీలు పట్టాలన్నా, కోర్ట్‌లో మార్కింగ్‌లు చేయాలన్నా… అన్నిటా ఆడపిల్లలు ఉండాల్సిందే అని చెబుతాను.వాళ్లకెప్పుడూ మినహాయింపు ఇవ్వను. మనం సమానత్వం కోరుకుంటున్నప్పుడు అన్నిటా సమానంగా ఉండాల్సిందే. అప్పుడే మనం విజయం సాధించగలం.
…? లక్ష్మీహరిత ఇంద్రగంటి
గడసంతల శ్రీనివాస్