అతివల అలంకరణలో ఆభరణాలది ప్రత్యేక స్థానం. సందర్భాన్నిబట్టి రకరకాల నగలు వేసుకుని మహిళలు అందంగా మెరిసిపోతారు. చేతులకు గాజులు, భుజాలకు వంకీలు, మెడలోకి హారాలు ఇలా ప్రత్యేక నగలు ధరిస్తుంటారు. ట్రెడిషన్‌ను ఫాలో అవుతూనే ట్రెండీ లుక్ కోసం తాపత్రయ పడుతుంటారు. అలాంటి వారికోసం రూపుదిద్దుకున్నవే కఫ్ బ్రేస్లెట్స్.
ట్రెడిషన్ విత్ ట్రెండ్ కాన్సెప్ట్‌తో పురాతన నగలకే ఆధునిక హంగులు జోడించి భలేగా ముస్తాబు చేస్తున్నారు డిజైనర్లు. కఫ్ బ్రేస్లెట్లు ఫ్యాషన్ ప్రపంచంలో ముచ్చటైన ఆవిష్కరణ. మణికట్టు చుట్టూ అందంగా ఒదిగిపోయే ఈ బ్రేస్లెట్స్ బంగారం, వెండి, ప్లాటినం లోహాల్లో అందుబాటులో ఉన్నాయి. ఈ బ్రేస్లెట్స్ని ధరించడం, తీసేయడం తేలిక. అంతేకాదు అభిరుచిని బట్టి జంతువులు, పక్షులు, ప్రకృతి వింతలను ఈ కఫ్లపై నగిషీలుగా చెక్కించుకోవచ్చు. సంప్రదాయ దుస్తుల మీదికి ధరించేందుకు వీలుగా వజ్రాలు, ముత్యాలు, రత్నాలు పొదిగిన భారీ కఫ్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఫ్యాషన్ ప్రియుల మనసుదోచే స్నేక్ కఫ్‌లు, మినిమల్ కఫ్‌లు, స్టేట్మెంట్ కఫ్‌లు కూడా మార్కెట్లోకి వచ్చేశాయి.
ప్రతి ఒక్కరి జీవితంలో కొందరు ప్రత్యేక వ్యక్తులు, వారికి సంబంధించిన జ్ఞాపకాలు తప్పకుండా ఉంటాయి. అలాంటి వ్యక్తుల పేర్లు, అక్షరాల డిజైన్లు చెక్కిన కఫ్ ఉంగరాలు, బ్రేస్లెట్లు తయారు చేయించుకోవచ్చు. ప్రేమికులు, భార్యాభర్తలు, తల్లిదండ్రులు, పిల్లల గుర్తులను కూడా ఈ బ్రేస్‌లెట్లలో పొదిగి అందమైన జ్ఞాపకాలుగా మలుచుకునే వీలుంటుంది. ఇష్టమైన వ్యక్తుల ప్రతిబింబాలు, ఫొటోలు కూడా ఈ కస్టమైజ్డ్ జువెలరీలో పొందుపరుచుకునే వీలుంది.
ఇలా రకరకాల థీమ్స్‌తో తయారుచేసిన బ్రేస్లెట్లు ఇప్పుడు ఫ్యాషన్ ట్రెండ్. బంగారం, వెండి, ప్లాటినమ్ వంటి లోహాలతోనే కాదు అందరికీ అందుబాటులో ఉండే వన్‌గ్రామ్ గోల్డ్, ఇమిటేషన్ జువెలరీతో తయారైన కఫ్ బ్రేస్లెట్లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. కాలేజీలకు వెళ్లే అమ్మాయిలకు, ఉద్యోగాలు చేసే మహిళలకు రోజువారి అలంకరణలో ఇవి చక్కని ఎంపిక. ఇంకెందుకు ఆలస్యం.. మీకూ నచ్చిన కఫ్లని ఎంచుకుని అలంకరించుకోండి!