అందమైన బొమ్మలెన్నో మార్కెట్లో ఉంటాయి. కానీ దాదాపు అన్నీ విదేశీ పోలికలతో ఉండేవే. అచ్చమైన తెలుగమ్మాయిలా అరచేయంత కళ్లు, తుమ్మెదంటి వాల్జడ, నిండైన కట్టూ బొట్టూ అందులో ఉంటే ఒట్టు. ఆ బెంగ తీరేట్టు మనల్ని పోలినట్టు ఉండే ముచ్చటైన బొమ్మల్ని తయారు చేస్తున్నది మన జనగామ బిడ్డ గుడిపాటి కావ్య. ఇంట్లో జరిగే వేడుకల్లో అలంకరించు కునేందుకు మనలాంటి దుస్తులు, హెయిర్ ైస్టెల్‌ను కూడా వాటికి జోడించి ఇస్తూ… తనదైన రీతిలో ‘తెలంగాణ డాల్స్’ పేరిట ప్రత్యేక పేజీని నడుపుతున్నదామె. విదేశాలకూ చేరిన ఆ బొమ్మల ప్రయాణాన్ని ‘జిందగీ’తో పంచుకున్నదిలా…
నాకు చిన్నప్పటి నుంచీ కళలంటే ఎంతో ఆసక్తి. స్కూల్లో బొమ్మలు బాగా గీసేదాన్ని. రంగురంగుల పెన్సిళ్లను తీసుకుని నచ్చినవన్నీ అచ్చేసేదాన్ని. ఇంటర్మీడియెట్ అయిపోయి పెద్ద చదువులు ఎంచుకోవాల్సి వచ్చినప్పుడు నాకు ఇష్టమైన కళలవైపే వెళ్లాలని అనుకున్నా. నెట్లో వెతుక్కొని హైదరాబాద్‌లోని జవహర్లాల్ నెహ్రూ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ గురించి తెలుసుకున్నా. కష్టతరమైన దాని ఎంట్రెన్స్ పరీక్షలో తొలి ప్రయత్నంలోనే అర్హత సాధించా. అలా బ్యాచిలర్స్ ఆఫ్ పైన్ ఆర్ట్స్‌లో 2018లో చేరా. ఇంతకీ మా ఊరు జనగామ దగ్గరి కుందారం. అమ్మ మాధవి. నాన్న మధుసూదన్. ఇద్దరు తమ్ముళ్లు. నాన్న పని రీత్యా నా ఎనిమిదో తరగతిలోనే మేం హైదరాబాద్ వచ్చాం.
ఫైన్ ఆర్ట్స్ కాలేజీలో చేరాక రంగుల కాంబినేషన్లు, డిజైనింగ్, డిస్ప్లే లాంటి విషయాలను సశాస్త్రీయంగా తెలుసుకుంటూ వచ్చాను. ఒక్కో పనినీ సృజనాత్మకంగా, సునిశితంగా చేయడానికి గంటల కొద్దీ సమయాన్ని వెచ్చించడం అక్కడే అలవాటైంది. అలా అక్కడ నేర్చుకున్న విషయాలను నా దగ్గర ఉన్న బొమ్మల్ని డిజైన్ చేయడంలో ఉపయోగిస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన వచ్చింది. అప్పుడే ఒక బొమ్మ తీసుకుని దాన్ని మన తెలుగు వాళ్లలా కనిపించేలా రకరకాల మార్పులు చేర్పులు చేసి చూశాను. మన దగ్గర ఉన్న గుడ్డ ముక్కల్ని బొమ్మలకు కట్టడం అలవాటే. ఆ స్థానంలో అచ్చం మనం వేసుకునేవాటిలా ఫ్యాషనబుల్‌గా కనిపించేలా తీర్చిదిద్దాలనుకున్నా. అనుకున్నదే తడవుగా బొమ్మను నాదైన శైలిలో తీర్చిదిద్దా. అలా కొన్ని బొమ్మల్ని చేసి ఇంట్లో అలంకరించుకున్నా. వాటిని ఊరికే అలా పెట్టుకోవడం ఎందుకు అనిపించి 2019లో ఒక రోజు ఆ బొమ్మల కోసమే ఇన్‌స్టా పేజీని తెరిచా. ముస్తాబు చేసిన బొమ్మల రీల్స్ చేసి అందులో పోస్ట్ చేయడం మొదలు పెట్టా. దానికి మంచి స్పందన వచ్చింది. ఆశ్చర్యంగా నా మొదటి ఆర్డర్ అమెరికా నుంచి వచ్చింది. తన నగల షాపులో డిస్ప్లే పెట్టేందుకు దసరా థీమ్‌తో ఒకేసారి పది బొమ్మలు అడిగి చేయించుకున్నారామె. అప్పటికి నాకు పందొమ్మిదేండ్లే. కానీ, నా మీద వాళ్ల నమ్మకం చూసి ఆత్మవిశ్వాసం పెరిగింది. బొమ్మలకు మంచి స్పందన కూడా మొదలైంది.

ఒక పక్క చదువుకుంటూనే నా బొమ్మల పని కూడా చేసేదాన్ని. ఎవరైనా పెండ్లి, మెచ్యూర్ ఫంక్షన్, సీమంతంలాంటివి చేసుకున్నప్పుడు వాళ్లు ఏ దుస్తులు ధరిస్తారో మాకు ఫొటోలు పెడితే అలాంటి దుస్తులు, వాళ్ల మోడల్ హెయిర్ ైస్టెల్ ఉండేలా బొమ్మల్ని చేసి ఇస్తా. మగవాళ్ల గడ్డం మీసం తలకట్టులాంటివి కూడా బొమ్మలో కనిపించేలా చేసేందుకు ప్రయత్నిస్తా! మాకు అలాంటి ఆర్డర్లు కూడా ఎక్కువగానే వస్తాయి. కొంతమందైతే తాము ఇలాంటి నగ ధరించదలచుకున్నామని కూడా పెడతారు. అలాగే, వ్రతం, బారసాల, పాలు పొంగించే కార్యక్రమం… ఇలా రకరకాల సన్నివేశాలకు సంబంధించిన బొమ్మలు చేసి ఇవ్వమని అడుగుతారు. ఆ కార్యక్రమంలో ఎవరెవరు ఉండాలనుంటున్నారో కూడా చెబుతారు. తమని తాము బొమ్మల్లో చూసుకోవాలనే మోజు ఉన్న ఇంకొందరు పాత ఫొటోలు పంపి దాన్ని పోలిన బొమ్మ చేసిమ్మని అడుగుతుంటారు. అవి కూడా చేసిస్తున్నాం. దుర్గ, లక్ష్మి, సరస్వతిలాంటి అమ్మవార్ల బొమ్మలు, అలాగే బొమ్మల కొలువు కోసం దేవీదేవతల బొమ్మలు కూడా కస్టమర్ల కోరికను బట్టి తయారు చేస్తున్నాం. కొందరు తమ కోసమే ప్రత్యేకంగా బొమ్మలు చేయించుకోకపోయినా వేడుకలో అలంకరణకు బొమ్మలు కావాలని కోరుకుంటున్నారు. అలాంటి సందర్భాల కోసం అద్దెకు కూడా బొమ్మల్ని ఇస్తున్నాం. అలాంటప్పుడు మేమే జాగ్రత్తగా వాటిని తీసుకెళ్లి, మళ్లీ తెచ్చుకుంటాం.
ఈ బొమ్మలు చేసేందుకు నేను బార్బీలతో పాటు కొరియా, చైనాల్లో తయారయ్యే బాల్ జాయింట్ డాల్స్‌ను ఢిల్లీ నుంచి ప్రత్యేకంగా తెప్పించుకుంటా. అంటే ఈ బొమ్మల్లో జాయింట్లు, అంటే కీళ్లు ఎక్కువగా ఉంటాయి. బొమ్మను ఒక ప్రత్యేకమైన పోజ్‌లో కూర్చోబెట్టాలన్నా, నిలబెట్టాలన్నా ఎక్కడికక్కడ వంపే వీలుంటాయివి. ఇక వీటి కళ్లను తెలుగువారిని పోలినట్టు పెద్దగా వెడల్పుగా నేనే తీర్చిదిద్దుతా. మా బొమ్మల్లో మాత్రమే ప్రత్యేకం అని రెండు విషయాలు చెప్పగలను అందులో మొదటిది జుట్టు. నా ప్రతి బొమ్మకూ పట్టు దారాలతో నేనే జుట్టును సూదీదారం వాడి కుడతా. అప్పుడు పెద్ద జడ వేయడానికి వీలుంటుంది. వేరే హెయిర్ ైస్టెల్స్కూ అవకాశం ఉంటుంది. రెండోది, బొమ్మల దుస్తులు. వాటి నెక్ డిజైన్లు, వర్క్‌లు ట్రెండ్‌కు తగ్గట్టు ఉండేలా చేస్తాం. అంత చిన్న వాటి మీద కూడా నేను ఎంబ్రాయిడరీ చేస్తా. అలాగే డ్రెస్‌లు అన్నింటికీ లైనింగ్ కూడా వేసి మన దుస్తుల్లాగే పూర్తిగా కుడతాం. అంటే బొమ్మకు వేసే దుస్తులేవీ అతికించడం అన్నది ఉండదు. దీనివల్ల అవి ఎక్కువ కాలం మన్నుతాయి. కుండ, ఉయ్యాల, ఎడ్లబండ్లలాంటివి మా దగ్గర వడ్రంగి పనివారితో ప్రత్యేకంగా చేయిస్తా. వీటి అలంకరణలో అమ్మా నాన్నా నాకు సాయం చేస్తారు. వాళ్లే ఎప్పుడూ నా సపోర్ట్.

ఒకామె నా బొమ్మలు చాలా నచ్చి ఢిల్లీ నుంచి ఆర్డర్ చేశారు. కానీ, తీసుకెళ్లే వాళ్లు లేరని మా వాళ్లకే ఢిల్లీకి రానూపోనూ కూడా ఫ్లైట్ బుక్‌చేశారు. నిజానికి బొమ్మ ధర కన్నా ఫ్లైట్ ధరే ఎక్కువ. ఆమెకు ఆ బొమ్మలు అంతగా నచ్చడం అన్నది నాకు చాలా సంతోషంగా అనిపించింది. మా దగ్గర మూడు అంగుళాల నుంచి మూడు అడుగుల బొమ్మల దాకా దొరుకుతాయి. ధర 500 నుంచి 10 వేల రూపాయల వరకూ ఉంటాయి. హైదరాబాద్‌తో పాటు ఢిల్లీ, ముంబయి, విశాఖ, కోల్‌కతా, చెన్నైలాంటి వివిధ నగరాలకు పంపుతుంటా. విదేశాల్లో అమెరికా, ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికాల నుంచి ఎక్కువగా బొమ్మల కోసం అడుగుతారు. దాదాపు వీళ్లంతా తెలుగువాళ్లే. మనం ఎవరు, ఎక్కడి నుంచి పనిచేస్తున్నాం అని తెలియాలనే నా పేజీకి తెలంగాణ డాల్స్ (@telanganadolls) అనే పేరు పెట్టుకున్నా. మన సంస్కృతి ప్రతిబింబించేలా బతుకమ్మ, బోనాల్లాంటి పండుగలకు సంబంధించిన బొమ్మలు చేసి పేజీలో పెడుతుంటా. ఇక, ప్రస్తుతం ఫైన్ ఆర్ట్స్‌లోనే మాస్టర్స్‌కి దరఖాస్తు చేసుకున్నా. హస్త కళలకు పేరొచ్చేలా ప్రత్యేకమైన సంస్థ పెట్టాలనే ఆశ ఉంది.