రియల్ లైఫ్‌లో స్క్రాప్ బిజినెస్ ఫ్యాక్ట్స్ ఏంటో తెలుసుకోకపోయినా ఫర్వాలేదు గానీ.. నెట్టింట్లో జరుగుతున్న డేటా స్క్రాపింగ్ గురించి మాత్రం కచ్చితంగా తెలుసుకోవాలి. ఇక్కడ స్క్రాప్ అంటే.. మీరు కొన్న, వాడేసిన వస్తువులు కాదండోయ్!! మీ ఆలోచనలు.. పోస్టింగ్‌లు.. ఫొటోలు.. కామెంట్లు.. వగైరా అన్నీ పోలోమంటూ సామాజిక మాధ్యమాల్లో పెట్టేసే ఉంటారుగా! వాటన్నిటినీ సైలెంట్‌గా నొక్కేసి మరెక్కడెక్కడో వాడే ప్రబుద్ధులు ఉన్నారని ఊహించగలరా? వినడానికి షాక్‌గానే ఉన్నా.. ఇదే డేటా స్క్రాపింగ్.
ఇప్పుడు సోషల్ మీడియాలో వేగంగా పెరుగుతున్న కొత్త సైబర్ ముప్పు డేటా స్క్రాపింగ్. సింపుల్‌గా చెప్పాలంటే.. వెబ్సైట్లు, యాప్స్, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల నుంచి డేటాను ఆటోమేటిక్‌గా తీసుకోవడం. పెద్దసంఖ్యలో సమాచారం సేకరించేందుకు హ్యాకర్లు లేదా డేటా అనలిస్టులు సాఫ్ట్వేర్లను వాడతారు. ఇలా సేకరించిన డేటా తర్వాత మార్కెటింగ్, రీసెర్చ్, లేదా కొన్నిసార్లు చట్టవిరుద్ధ కార్యకలాపాలకు కూడా ఉపయోగపడుతుంది. పొరపాటున మీ డేటా ఫ్రాడ్‌స్టర్ల చేతికి చిక్కితే.. ప్రమాదం ఎటు నుంచైనా ముంచుకురావొచ్చు.
హద్దులు మీరుతున్నారు..
సేకరించింది ఏదైనా మంచి పనుల కోసం వాడితే ఫర్వాలేదు. అంటే.. మార్కెట్ స్టడీ, ట్రెండ్ అనాలిసిస్ లాంటి పనులకి ఈ టెక్నిక్ ఉపయోగిస్తే కొంతలో కొంత నయం అనుకోవచ్చు! దీన్నే టార్గెటెడ్ మార్కెటింగ్‌గా పిలుస్తారు. యూజర్ల ఆసక్తులు, ప్రాధాన్యాల ఆధారంగా టార్గెటెడ్ యాడ్స్ కోసం ఈ డేటాను ఉపయోగిస్తారు. అంతేకాదు.. ఇన్ఫ్లూయెన్సర్లను గుర్తిస్తారు. వారితో బిజినెస్ కోలాబరేషన్స్ చేస్తారు. ఇంకా చెప్పాలంటే.. రెప్యుటేషన్ మేనేజ్మెంట్కు కూడా ఈ డేటానే ఆధారం. అంటే.. ఏదైనా ప్రత్యేకించి ఓ బ్రాండ్‌పై ఉన్న అభిప్రాయాన్ని తెలుసుకోవడం అన్నమాట. ఇదంతా నాణేనికి ఒకవైపు మాత్రమే! మరోవైపు ఇదే డేటా దుష్టుల చేతుల్లో పడితే! చెడు పనులకు వాడితే! ఊహించని ప్రమాదమే జరుగుతుంది. మీ పేరుతో, ఫొటోతో నకిలీ ప్రొఫైల్స్ క్రియేట్ చేయవచ్చు. కామెంట్స్ చేయొచ్చు. మీ ఇష్టాలు, లైక్స్, సెర్చ్ హిస్టరీ ఆధారంగా ఫేక్ యాడ్స్ పంపొచ్చు. లింక్‌లు షేర్ చేయొచ్చు. వాటిని ఆసరాగా చేసుకుని సైబర్ మోసాలకు పాల్పడొచ్చు.
డేటా ఎలా తీసుకుంటారు?
హ్యాకర్లు వాడుతున్న డేటా స్క్రాపింగ్ బాట్స్ చాలా స్మార్ట్‌గా పనిచేస్తాయి. అవి మీ పబ్లిక్ పోస్టులు, ఫాలోవర్స్, లైక్స్, కామెంట్స్ అన్నీ ఆటోమేటిక్‌గా స్కాన్ చేస్తాయి. తర్వాత ఈ డేటాని మార్కెటింగ్ కంపెనీలు, ఇన్ఫ్లూయెన్సర్ ఏజెన్సీలు, డార్క్ వెబ్ డీలర్ మాఫియా వాడుతుంటాయి. కొన్ని సందర్భాల్లో మాత్రం ఈ స్క్రాపింగ్ సైబర్ దోపిడీగా మారుతుంది. యూజర్ల వ్యక్తిగత వివరాలు చోరీ అవుతాయి. పలు రకాల టూల్స్‌తో డేటా స్క్రాపింగ్ సులభంగా జరుగుతుంది. ఇవి ఒక్కసారిగా వేల ప్రొఫైల్స్ నుంచి సమాచారం సేకరించగలవు.
డేటాను కాపాడుకోవడం ఎలా?
ప్రైవసీ సెట్టింగ్స్ చెక్ చేయండి
మీ పోస్టులు, ఫ్రెండ్స్ లిస్ట్, పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఎవరికి కనిపించాలో కంట్రోల్ చేయాలి.
స్ట్రాంగ్ పాస్‌వర్డ్స్‌ని వాడండి
ఒకే పాస్‌వర్డ్‌ని అన్ని అకౌంట్స్‌కి వాడొద్దు. 2-స్టెప్ వెరిఫికేషన్ యాక్టివ్ చేయండి.
థర్డ్ పార్టీ యాప్స్‌తో జాగ్రత్త
మీ ప్రొఫైల్ డేటాకు యాక్సెస్ కావాలి అని అడిగే యాప్స్‌ని అస్సలు అనుమతించొద్దు.
సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ పబ్లిక్‌గా పోస్ట్ చేయొద్దు
చిరునామా, ఫోన్ నంబర్, బ్యాంక్ వివరాలు.. ఇవి ఎప్పుడూ ప్రైవేట్‌గా ఉంచండి.
అనుమానాస్పద అకౌంట్స్, బాట్స్‌ని బ్లాక్ చేయండి.
ఏదైనా ఫేక్ ప్రొఫైల్ మీ కంటెంట్ తీసుకుంటున్నదని అనుమానం వస్తే వెంటనే రిపోర్ట్ చేయండి.
క్యాప్చా లేదా బాట్ డిటెక్షన్‌ను వాడండి
మీ వెబ్సైట్ ఉంటే ఆటోమేటిక్ స్క్రాపింగ్ ఆపేందుకు సెక్యూరిటీ టూల్స్ ఇన్స్టాల్ చేయండి.
పాలసీలు తెలుసుకోండి
మీరు వాడే సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల టర్మ్స్ ఆఫ్ సర్వీస్, ప్రైవసీ పాలసీల గురించి తెలుసుకోండి.
అనవసరమైన కనెక్షన్లు వద్దు
మీ ఫాలోవర్స్, ఫ్రెండ్స్ లిస్ట్‌ను క్రమం తప్పకుండా చెక్ చేయండి. అనుమానాస్పద ఖాతాలను రిమూవ్ లేదా బ్లాక్ చేయండి.
గుర్తుంచుకోండి..
డేటా స్క్రాపింగ్‌ను పూర్తిగా ఆపడం కష్టం. కానీ, జాగ్రత్తగా ఉంటే డ్యామేజ్ నుంచి తప్పించవచ్చు. ఇంటర్నెట్లో మీరు షేర్ చేసే ప్రతి సమాచారం ఒక డిజిటల్ ఫుట్‌ప్రింట్ లాంటిది. దాన్ని ఎవరు ఎలా వాడతారో మనం నియంత్రించలేం. అందుకే జాగ్రత్తగా ఉండండి.. ఏదైనా షేర్ చేసే ముందు ఒకసారి ఆలోచించండి.
అనిల్ రాచమల్ల
వ్యవస్థాపకులు
ఎండ్‌నౌ ఫౌండేషన్