వంటల్లో పాత్రలదీ కీలక పాత్రే! ఏం తింటున్నామన్నదే కాదు.. ఎందులో వండుతున్నామన్నదీ ముఖ్యమే! అందుకే, పదార్థాలకు తగ్గట్టుగా.. పాత్రలను ఎంపిక చేసుకోవాల్సిందే! లేకుంటే.. లేనిపోని తిప్పలు పడాల్సిందే!
నేటితరం వంటగదులు ఫ్యాషన్ రంగు పులుముకున్నాయి. ప్రతి కిచెన్‌లోనూ ప్లాస్టిక్ పాత్రలు, నాన్‌స్టిక్ ఉత్పత్తులే సందడి చేస్తున్నాయి. లేనిపోని ఆరోగ్య సమస్యలను తెచ్చిపెడుతున్నాయి. దీనికి పరిష్కారంగా కొందరు ఇనుము, ఇత్తడి, స్టీల్ పాత్రలను కొనుగోలు చేస్తున్నారు. అన్నిరకాల ఆహార పదార్థాలనూ వాటిలోనే వండి వారుస్తున్నారు. అయితే, ఇలా చేయడం కూడా ముప్పేనని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొన్నిరకాల పాత్రల్లో కొన్ని ఆహార పదార్థాలను వండటం ఏమాత్రం మంచిదికాదని చెబుతున్నారు.
సంప్రదాయ వంటలు వండేందుకు ఇత్తడి పాత్రలు మంచి ఎంపిక. అయితే, కొందరు నాన్‌వెజ్ వంటలకూ వీటిని ఉపయోగిస్తుంటారు. ఉప్పుతోపాటు కొన్నిరకాల మసాలాలు, ఆమ్లస్వభావం కలిగిన పదార్థాలు.. అధిక ఉష్ణోగ్రత వద్ద ఇత్తడితో కలిసి ప్రతిస్పందిస్తాయి. ఫలితంగా.. వంటలు రుచిని కోల్పోతాయి. పెరుగు, నిమ్మకాయ, టమాట, వెనిగర్ వేసి చేసే వంటలను ఇత్తడి పాత్రల్లో వండకపోవడమే మంచిది.
ఆమ్లస్వభావం ఉండే ఆహార పదార్థాలను ఇనుప కడాయిల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ వండకూడదు. వీటిలో ఉండే ఆమ్లాలు.. ఇనుముతో రసాయన చర్య జరిపి.. ఆహారాన్ని పాడుచేస్తాయి. ఆరోగ్యానికీ కీడు కలిగిస్తాయి. ఇక ఇనుప పాత్రలో పాలు వేడిచేయడం, పాల ఉత్పత్తులతో వంటలు చేయడం మానుకోవాలి. అలా చేస్తే.. వంటలు రుచినీ, వాసననూ కోల్పోతాయి. అంతేకాదు.. ఇనుప వస్తువులు అధిక వేడిని కలిగిస్తాయి. కొన్నిరకాల ఆకుకూరలు, పుట్టగొడుగులు ఆ వేడిని తట్టుకోలేవు. అందుకే, వాటినీ ఇనుప పాత్రలకు దూరం పెట్టడమే బెటర్! ఇక ఇంట్లో ఎవరైనా కాలేయ సంబంధ వ్యాధులతో బాధపడుతుంటే.. ఐరన్ పాత్రలు వాడకపోవడమే మంచిది. ఇనుప పాత్రలలో వండే ఆహారంలో ఐరన్, మెగ్నీషియం అధికంగా చేరి.. కాలేయానికి కొత్త సమస్యలు తెచ్చిపెడతాయి.
చాలామంది వంటకు స్టీల్ సామగ్రినే వాడుతుంటారు. వీటిలో అన్నిరకాల ఆహార పదార్థాలనూ వండుకోవచ్చు. ఇవి, ఆహారానికి ఏమాత్రం హాని చేయవు. కాకుంటే.. స్టీల్ పాత్రలు మందంగా ఉండేలా చూసుకోవాలి. లేకుంటే, అడుగు అంటుకునే అవకాశం ఉంటుంది.