భారత్.. ప్రపంచంలోనే అతిపెద్ద మార్కెట్. అందులో సగం జనాభా మహిళలే. నెలసరి వచ్చే మహిళల సంఖ్య 35 కోట్లకుపైనే. అలా అని, పీరియడ్ సమయంలో వాడే ఉత్పత్తులు మార్కెట్లో సులభంగా అమ్ముడు అవుతాయనుకుంటే పొరపాటే. ఇది నా స్వానుభవంలో తెలుసుకున్న విషయం. ఎందుకంటే, నేను స్థాపించిన రెండో పీరియడ్ కేర్ ఉత్పత్తుల స్టార్టప్.. ‘లెమ్మీ బి’ విజయం వెనుక పరాజయ పాఠాలూ ఉన్నాయి. మనం జనంలోకి ఎలా చొచ్చుకుపోవాలనే రహస్యాన్ని మూడు సంవత్సరాల కష్టం తర్వాత కానీ తెలుసుకోలేకపోయాను.
తొలి అడుగు
మా స్వస్థలం ఒడిశాలోని భువనేశ్వర్. ఇంజినీరింగ్ చదవడానికి హైదరాబాద్ వచ్చాను. ఇక్కడే ఐసీఐసీఐ, ఎయిర్‌సెల్, వొడాఫోన్‌లాంటి సంస్థల్లో పనిచేశాను. తొలినుంచీ నాకు సొంతంగా స్టార్టప్ పెట్టాలలి కోరిక. కొంత అనుభవం సంపాదించుకున్నాక ఉద్యోగం మానేసి ఆస్ట్రేలియా వెళ్లి డిజైన్ థింకింగ్‌లో ఎంబీఏ చదివాను. ఇండియాకు తిరిగొచ్చాక నెలసరి సమయంలో వాడే ఉత్పత్తుల సంస్థ ‘మిరాయ్ మి’ స్థాపించాను. కానీ అది సజావుగా సాగలేదు. ఎంత క్వాలిటీ ఇచ్చినా ప్రజలకు చేరువ కాలేకపోయాం. అయినా, మొండిగా మూడు సంవత్సరాలు నడిపాను. ఎక్కడ లెక్క తప్పుతున్నామనే విషయం మీద తర్జన భర్జన పడేవాళ్లం.
‘మిరాయ్ మి’ పెట్టుబడుల కోసం నేను ఢిల్లీ వెళ్లిన సమయంలోనే ప్రపంచాన్ని కొవిడ్ కమ్మేసింది. లాక్డౌన్ సమయంలో అక్కడే ఇరుక్కుపోయాను. మూడు నెలలు ఒంటరిగా గడిపాను. ధ్యానంలాంటివి నాకు ఊరటనిచ్చాయి. లక్ష్యం గురించి ఆలోచించేందుకు కూడా సమయం దొరికింది. మార్కెట్ రీసెర్చ్‌పై అప్పుడే అవగాహన పెంచుకున్నా. నెమ్మదిగా పనిమొదలు పెట్టాను. అదే ఏడాది తొలి సంస్థను మూసేశాను. ‘లెమ్మీ బి’ పేరిట మరో స్టార్టప్ ప్రారంభించాను. దీనిద్వారా మెన్స్ట్రువల్ కప్, రీ యూజబుల్ పీరియడ్ ప్యాంటీస్, బయోడీగ్రేడబుల్ ట్యాంపూన్లు, మెన్స్ట్రువల్ డిస్క్‌లు, ప్యాంటీ లైనర్లు… ఇలా టీనేజర్లు, మధ్య వయస్కులు, ట్రాన్స్జెండర్ల కోసం విభిన్న ఉత్పత్తులు అందిస్తున్నా.
ఆ ఇబ్బంది పోగొట్టాలనే…
నెలసరి ఉత్పత్తుల్నే ఎందుకు ఎంచుకున్నారని అడుగుతుంటారు చాలామంది. నిజానికి ఈ ఆలోచన నా మనసులో చిన్నతనం నుంచీ ఉంది. రజస్వల అయినప్పుడు నేనెంత భయపడ్డానో నాకే తెలుసు. స్కూల్లో ఉన్నప్పుడు నెలసరి వస్తే.. ఎవరికీ చెప్పకుండా గంటలు గంటలు అలానే కూర్చునేదాన్ని. చిన్నతనంలో అమ్మతో కలిసి రెడ్‌క్రాస్‌లో పనిచేసినప్పుడు కూడా నెలసరిలో మహిళలు పడే ఇబ్బందుల్ని దగ్గర నుంచీ చూశాను. అందుకే ఆడవాళ్లకు ఆ సమయంలో పనికొచ్చే క్వాలిటీ ఉత్పత్తుల్ని అందించే సంస్థను స్థాపించాను. అయితే వీటి వాడకానికి సంబంధించి ప్రజల్లో చైతన్యం అవసరం అనిపించింది. అందుకే నలభై మందితో ఒక బృందాన్ని సిద్ధం చేశాం. వాళ్లు పాఠశాలలు, కళాశాలలకు వెళ్లి పిల్లల్లో అవగాహన కలిగిస్తారు.
పరిశుభ్రత పాటించకపోతే జరిగే అనర్థాలను వివరిస్తారు. ఎందుకంటే, మనం ఆ సమయంలో ఏం చేయాలన్నది అమ్మ నుంచి నేర్చుకుంటాం. అమ్మ ఏం వాడమంటే అదే వాడతాం. అమ్మకు అవగాహన లేకపోతే మనకూ ఉండదు. అందుకే ఇన్‌స్టా, ఫేస్బుక్, యూట్యూబ్.. ఇలా వివిధ మాధ్యమాల ద్వారా పీరియడ్స్ గురించి విస్తృత ప్రచారం కల్పించాం. ప్రశ్న జవాబుల వేదిక ‘కోరా’లో ‘జస్ట్ లెమ్మీ బి’ పేరిట ఓ పేజీ తెరిచాం. దాని ద్వారా పదివేలకు పైగా ప్రశ్నలకు సమాధానాలు చెప్పాం. అదో మైలురాయి. ప్రస్తుతం లెమ్మీ బి ద్వారా నెలకు కోటిన్నర రూపాయల వ్యాపారం చేస్తున్నాం. మా అంచనా ప్రకారం మరో మూడునాలుగు నెలల్లో ఇది మూడు కోట్లకు చేరుతుంది. ‘లెమ్మీ బి’ని ప్రపంచ స్థాయి సంస్థగా తీర్చిదిద్దేందుకు మావంతు కృషి చేస్తున్నాం.
ఇవే ప్రత్యేకం
‘లెమ్మీ బి’ సంస్థ ఉత్పత్తుల గురించి ప్రత్యేకంగా చెప్పాలనుకుంటున్నా. అందులో మొదటిది ‘జెడ్ డ్రిప్ లీక్ ప్రూఫ్ ప్యాంటీస్’. దీన్ని ధరిస్తే శానిటరీ న్యాప్కిన్ వాడాల్సిన పన్లేదు. 120 మిల్లీలీటర్ల వరకూ స్రావాన్ని ఆపగలవు. మళ్లీ మళ్లీ వాడుకోవచ్చు. ప్రసవం తర్వాత, వృద్ధాప్యంలో కొందరికి మూత్రం లీక్ అవుతూ ఉంటుంది. అలాంటి వాళ్లూ దీన్ని వినియోగించవచ్చు. కొంచెం పక్కకి వంగినట్టు కనిపించే.. మా మెన్స్ట్రువల్ కప్.. స్రావాన్ని సమర్థంగా ఆపుతుంది. మృదువైన సిలికాన్‌తో దీన్ని తయారుచేస్తాం. ‘పెయిన్ ఒ పాజ్’గా పిలిచే మా హీట్ ప్యాచ్‌ను పొట్టకు అతికిస్తే ఎనిమిది గంటల పాటు వేడిని ఉత్పత్తి చేస్తూ.. నొప్పిని తగ్గిస్తుంది. నడుము, భుజాలు.. ఇలా ఏ భాగంలో అయినా వాడవచ్చు.
…? లక్ష్మీహరిత ఇంద్రగంటి