పౌరాణిక పద్యాలు వింటూ పెరిగిన బాల్యం తనది. అలా నాటకంపై మమకారం పెంచుకున్నాడు. దోస్తులతో కలిసి చిన్న చిన్న స్కిట్లు వేస్తూ నటనలోకి ప్రవేశించాడు. సినీ నటుడు కావాలనే కోరికతో పల్లె విడిచి పట్నం బాటపట్టాడు. రంగస్థలంపై పుట్టి, రేడియో తరంగాలపై రాటుదేలి, నేడు వెండితెరపై అలరిస్తున్న అంజి వల్గుమాన్ ప్రస్థానమిది. ‘భీమదేవరపల్లి బ్రాంచి’లో జంపన్నగా సందడి చేసిన అంజి తర్వాత బలగం, పరేషాన్, ఇంటింటి రామాయణం సినిమాల్లో గుర్తుండిపోయే పాత్రలు పోషించాడు. మంచి నటుడిగా ప్రేక్షకులకు కలకాలం గుర్తిండిపోవాలంటున్న అంజి బతుకమ్మతో పంచుకున్న అనుభవాలు ఆయన మాటల్లోనే..
జోగులాంబ గద్వాల జిల్లా జమ్మిచేడ్ గ్రామం మాది. మాది వ్యవసాయ కుటుంబం. వీధి బాగోతాలు, పౌరాణిక నాటికలు చూస్తూ పెరిగాను. నాకు తెలియకుండానే వాటికి కనెక్ట్ అయ్యాను. ఆ నాటికల ప్రభావం నాపై పడటం వల్ల స్కూల్లో చిన్న చిన్న స్కిట్లు వేసేవాణ్ని. ఇంటర్ చదివేటప్పుడు ఎన్ఎస్ఎస్లో చేరి, గ్రామాల్లో శ్రమదానం చేసేందుకు వెళ్లేవాణ్ని. పర్యావరణ పరిశుభ్రతను వివరిస్తూ స్కిట్లు వేసేవాణ్ని. వాటిని చూసిన మా స్నేహితులు, గ్రామస్తులు, లెక్చరర్లు ప్రోత్సహించేవారు.
నాకంటూ ఓ లక్ష్యమన్నదే లేనట్లు సాగుతున్న జీవితంలో వాళ్లందరి ప్రోత్సాహంతో సినీ రంగంలో మంచి నటుడిగా స్థిరపడాలనే కోరిక మొదలైంది. డిగ్రీ అయ్యాక హైదరాబాద్ బాటపట్టిన. బలమైన లక్ష్యమున్నా దానికి మార్గం మాత్రం కనబడలేదు. అందుకే ముందు సినిమా ఫిల్డ్ గురించి తెలిసిన వాళ్లను అడిగి తెలుసుకున్నాను. ఆ తరువాత ఫిల్మ్‌నగర్, కృష్ణానగర్ ఏరియాల్లో తిరుగుతూ ఆడిషన్లు ఎక్కడెక్కడ జరుగుతాయో వెతికాను. కొన్ని ఆడిషన్లకు వెళ్లినప్పుడు నా అవతారం చూసి ఆఫీస్ బాయ్ పనికోసం వచ్చావా అన్నట్లుగా వ్యవహరించేవారు. ఆడిషన్‌కు వచ్చినా అని చెప్పినా నమ్మేవారు కాదు.

రంగస్థలంపై భటుడిగా
అవకాశాలు రావాలంటే ఏదైనా కోర్సు చేస్తే బాగుంటుందని అనిపించింది. అందులో భాగంగానే ఉస్మానియా యూనివర్సిటీలో థియేటర్ ఆర్ట్స్ కోర్స్‌లో చేరాను. కోర్సు మాత్రమే ఓయూలో చేశాను. నా ప్రయాణమంతా తెలుగు యూనివర్సిటీలోనే సాగింది. అందులో నాటకాలు వేస్తారని తెలిసి నిత్యం రవీంద్రభారతి, తెలుగు యూనివర్సిటీ చుట్టే తిరిగేవాణ్ని. నా మొదటి నాటిక ‘ఖడ్గసృష్టి’లో చిన్న భటుడి పాత్రతో రంగస్థల నటుడిగా ప్రవేశించాను. ఆ తర్వాత 300కు పైగా నాటికల్లో వివిధ పాత్రల్లో మెప్పించాను. అయితే వీటిలో ‘కన్యాశుల్కం’, ‘మనుషులొస్తున్నారు జాగ్రత్త’, నేను డైరెక్టర్ చేసి నటించిన ‘వినాషి’ నాటికలు నాకంటూ గుర్తింపు తెచ్చాయి. ఈ అనుభవంతో ఆకాశవాణి హైదరాబాద్‌లో అనేక రేడియో నాటకాలు, డాక్యుమెంటరీ ఫీచర్లను నిర్మించడమే కాకుండా, స్వయంగా నటించాను కూడా.
షాకయ్యాను
2009లో మహాత్మా సినిమాలో చిన్న పాత్ర చేశాను. ఆ తర్వాత సారాయి వీర్రాజులో చిన్నపాత్ర దొరికింది. ఇలా దొరికిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటున్న సమయంలోనే ‘మెయిల్’ కోసం డెమో చేశాను. అంతా ఒకే అన్నాక మార్కెటింగ్ దృష్ట్యా నా స్థానంలో ప్రియదర్శిని పెట్టారు. ఆ విషయంలో నిరాశ చెందినా ఆ డెమో చూసిన ఇతర డైరెక్టర్లు యాక్టింగ్ బాగుందని భవిష్యత్తులో అవకాశాలిస్తామని మాటిచ్చారు. ఇలా చిన్నచిన్న పాత్రలు చేస్తున్న సమయంలో నా సీనియర్ కేపీ ‘భీమదేవరపల్లి బ్రాంచి’ డైరెక్టర్‌కు నా ప్రొఫైల్ పంపించాడు. ఆడిషన్‌కు వెళ్లిన తెల్లారే ఆఫీస్‌కు పిలుచుకొని డైరెక్టర్ రమేష్ చెప్పాల స్టోరీ మొత్తం చెప్పాడు. అందులో నా పాత్ర ఏంటి? అని అడిగేలోపే.. లీడ్ జంపన్న పాత్ర నీదే అని చెప్పడంతో షాక్ అయ్యా. ఈ సినిమా 2023లో విడుదలై ప్రేక్షకుల ఆదరణ పొందింది. అదే ఏడాది నేను నటించిన బలగం, ఇంటింటి రామాయణం, పరేషాన్ సినిమాలు సైతం విడుదల కావడంతో.. 2023 నా జీవితంలో మరిచిపోలేని ఆనందాన్ని ఇచ్చింది.
ఇబ్బందులను దాటుకొని
ఇప్పటివరకు 40 వరకు సినిమాల్లో నటించిన నాకు అందులో 10 సినిమాలు ప్రత్యేకమైన గుర్తింపునిచ్చాయి. ఇందులో వెబ్‌సిరీస్‌లు సైతం ఉండటం విశేషం. ‘కొత్త పోరడు’ హిట్ కావడంతో ‘సివరపల్లి’, ‘హోమ్టౌన్’తో పాటు ఇటీవల వచ్చిన ‘సూపర్ సుబ్బు’లో నటించి ఓటీటీలోనూ నా అదృష్టాన్ని పరీక్షించుకున్నాను. నటనమీద ఇష్టంతో చేయి సంచి పట్టుకొని హైదరాబాద్‌కొచ్చిన నేను ఎన్నో ఒడుదొడుకులు, ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నాను. జబర్దస్‌లో చేసిన సమయంలో చేతిలో రూపాయి లేకున్నా రిహార్సల్స్‌కు బస్‌లో వెళ్తూ పాస్ అని దొంగ ప్రయాణం చేసేవాణ్ని. ఆకలి భరించలేక ఐదు రూపాయల భోజనం తిన్న రోజులున్నాయి. ప్రస్తుతం కొన్ని కొత్త ప్రాజెక్టులతో ముందుకు సాగుతున్న నాకు ఎప్పటికైనా జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడిగా అవార్డు అందుకోవాలన్నదే నా లక్ష్యం.
…? రాజు పిల్లనగోయిన