‘కాదేదీ కవితకు అనర్హం’ కవి మాట. ‘లేదేదీ పన్నుకు అనర్హం’ విత్తమంత్రి పాట. బడ్జెట్ ఘడియలు సమీపిస్తున్న కొద్దీ.. దలాల్ స్ట్రీట్‌లో బుల్, బేర్లు రేసుకు సిద్ధమవుతుంటాయి. కనీవినీ ఎరుగని బడ్జెట్ అని సమర్థించుకోవడానికి అధికార పక్ష సభ్యులు లెక్చర్లు ప్రిపేర్ అవుతుంటారు. పసలేని నస అని కొట్టిపారేయడానికి విపక్షాలూ కత్తులు నూరుతుంటాయి. ఇక సగటు ఉద్యోగి దగ్గరికి వచ్చేసరికి పుచ్చుపట్టిన తన ఆదాయానికి ఈసారైనా పన్ను పోటు తగ్గుతుందేమో అని ఆశగా ఎదురుచూస్తుంటాడు. ఇంటిని నడిపే ఇల్లాలైనా, ఉద్యోగం చేస్తున్న అతివైనా.. బడ్జెట్ సమీపిస్తున్నప్పుడు ఏదో ఆశిస్తుంది. ఎందుకంటే.. బడ్జెట్ ప్రభావాన్ని పరోక్షంగా అందరికన్నా ఎక్కువగా ఫేస్ చేసేది వీళ్లే. కొద్ది గంటల్లో నయా బడ్జెట్ ప్రవేశిస్తున్న వేళ… ఆమె మనసులో ఏముందో తెలుసుకుందాం..
బడ్జెట్ మరుసటి రోజు నుంచీ.. ఆమెకు సవాళ్లు ఎదురవుతాయి. ప్రతి ఉదయం ఆప్యాయంగా పలకరించే పాలవాడు.. ఎందుకో ఆ పూట పాలివాడిగా కనిపిస్తాడు. ఆ ఇల్లాలి అనుమానాలను నిజం చేస్తూ.. ‘ఇవాళ్టి నుంచి లీటరుకు రెండు రూపాయలు ఎక్కువగా ఇవ్వాలమ్మా!’ అని అడిగేస్తాడు. అన్నీ తెలిసినా ‘ఏ.. ఎందుకు?’ అని ప్రశ్నిస్తే.. ‘బడ్జెట్’ అంటాడంతే! లీటరుకు రెండు రూపాయలు.. రోజుకు లీటరున్నర.. నెలకు 90 రూపాయలు కృష్ణార్పణం అనుకుంటుంది. పాలవాడితో పేచీ పెట్టుకోవడం పెద్ద విషయం కాదామెకు. డిస్కషన్స్‌లో పడితే ఆఫీసుకు ఆలస్యం అవుతుంది. అందుకే, ‘సర్లే చూద్దాం’ అనేస్తుంది. ఎంతైనా మధ్యతరగతి గృహిణి, అందులోనూ ప్రైవేట్ ఉద్యోగిని ఇంతకన్నా ఏం చెప్పగలుగుతుంది?
పాలు గిన్నెలో పుచ్చుకొని వంటింట్లో ప్రవేశించడంతోనే.. నిండుకుంటున్న పప్పు దినుసులు, డబ్బాలో ఆఖరికొచ్చిన చాయపత్తా… వెటకారంగా చూస్తాయి. తిరగమోత వేళ కాకముందే.. పోపులపెట్టెలో దాచుకున్న చిల్లర అల్లరి మొదలవుతుంది. దేశ ఆర్థిక వ్యవస్థను అత్యున్నత స్థాయికి తీసుకెళ్లడమే తమ లక్ష్యం అన్న విత్తమంత్రి మాటలకు కోరస్‌లా వినిపిస్తాయా నవ్వులు! ఎం.కామ్ చదివిన ఆ ఇల్లాలికి.. ఒక దేశం ఆర్థికంగా బలపడటానికి పాలకులు ఎంచుకునే వ్యూహం పన్ను అని తెలియనిది కాదు. కానీ, ఆ క్షణం మర్చిపోయినట్టు నటిస్తుంది. గుర్తుంటే గుండె బరువెక్కడం తప్ప ఏం చేయలేని పరిస్థితి.
పొయ్యి మీద టీ పొంగే సమయానికి వరండాలో ఆయనగారి పొగలు రింగులు చుడుతుంటాయి. సిగరెట్ల మీద ఏటా పన్నులు పెంచుతున్నా… తాగేవాడు మానడే అని ఆమె ఫీలింగ్. ధరలు పెరిగాయని ధూమపానం మానేస్తారని అనుకోవడం హాస్యాస్పదం. బొక్కసం ఆదాయం పెంచుకునేందుకు సిగరెట్ల మీద ట్యాక్సు పెంచడం రివాజు. ధూమపానం అతనికే కాదు.. ఆ ఇంటి నెలసరి బడ్జెట్‌కు కూడా హానికరమే అని నిట్టూర్పు విడుస్తుంది! ఇక మద్యపాన ప్రియుల సంగతి సరేసరి! ఏటేటా పెరుగుతున్న పన్ను కడుతూ తామే సంక్షేమ సారథులని కాలరెగరేస్తున్న వారిని ఏమనగలం? ప్రజలను బలహీనతల నుంచి బయటపడేయకుండా.. పన్నులు పెంచి ఇదే కట్టడి మంత్రమని తరతరాలుగా విత్తమంత్రులు ప్రవచిస్తుండటం ఆ ఇల్లాలికే కాదు.. ఏ ఇంతికైనా కష్టమే అనిపిస్తుంది.
చదువుకున్నా, అక్షరం రాకున్నా.. పొదుపు సూత్రాలు అతివకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మదుపులోనూ ఆమె సిద్ధహస్తురాలు. చిన్న మొత్తాలు పోగేసి.. భవితను బంగారం చేయడంలో మహిళది అందవేసిన చేయి. ఆ ఆశతోనే కొద్దికొద్దిగా కూడబెట్టి బంగారం కొనాలని ఆశపడని తల్లి ఉండదు. కానీ, ప్రతినెలా పద్దుల పుస్తకం చూసుకుంటే.. లోటు బడ్జెట్ వెక్కిరిస్తూ కనిపిస్తుంది. నిత్యావసర సరుకుల మీద 5-18 శాతం ఉండే జీఎస్టీ.. బంగారం మీద మూడు శాతంగా ఎందుకుందో సామాన్యులకైతే అర్థం కాదు. పైగా రోజురోజుకూ ధర పెరుగుతున్న బంగారంపై మోజు చంపుకొని ఇమిటేషన్ ఆభరణాలు కొందామంటే వాటిపై జీఎస్టీ 12 శాతం. ఈ నేపథ్యంలో ఆభరణాల విషయంలో ఆమెకు పెద్ద సంతృప్తి మిగలదు.
గుండె ధైర్యం చేసుకుని బతుకుతున్న ట్యాక్స్ పేయర్స్ గుండెల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ఆదాయ పన్ను పరిమితుల్లో మార్పులు, పన్నుల తగ్గింపులు కోరుకుంటున్నారు. ఈసారి బడ్జెట్లో ఆ ఆశలేమన్నా తీరతాయేమోనని ఇల్లాలు ఆశపడుతూనే ఉంటుంది. హెల్త్ ఇన్సూరెన్స్‌తో ఖర్చులు తగ్గించుకోవాలని చూస్తుంటే ఆ ఇన్సూరెన్స్ మీదా ట్యాక్స్ ఉంది. అదన్నా తగ్గిస్తే మేలని సాధారణ గృహిణే కాదు ఉద్యోగాలు చేసే ఆడవాళ్లూ ఆశపడుతున్నారు. నిత్యావసర సరుకులపై విధించిన పన్నులు సడలించాలని ఆశగా ఎదురు చూస్తున్నారు.
భార్యాభర్తలు ఉద్యోగాలు చేస్తున్న ఇళ్లల్లో ఆర్థిక వ్యవహారాలు కాస్త అనుకూలంగానే ఉంటాయి. ఈ పన్నుల విధానంపై వారికి అంత కోపతాపాలు ఉండవని అనుకుంటే పొరపాటే. చింతల్లేని చిన్న కుటుంబం ఓ చిన్న కారు కొనుక్కుందామని వెళ్తే… అక్కడ లగ్జరీ కారుకు, చిన్న కారుకు ఒకే ట్యాక్స్! సంపన్నులపై ఎందుకంత ప్రీతో అర్థం కాదు. ఉద్యోగులపై మరో పిడుగు పన్నుపోటు.
ఉద్యోగి ఆశించిన స్థాయిలో పన్ను పరిమితి పెరిగిన దాఖలాలు బడ్జెట్ చరిత్రలో లేదు. ఏటా పెంచే పరిమితి బెత్తెడైతే.. పెరిగే ద్రవ్యోల్బణం బారెడు. ఇన్నిట్లో ఏం మిగులుతుంది? ఇన్ని సంగతులు ఆలోచిస్తున్న ఆమెకు మర్నాడు దిన పత్రికల్లో విత్తమంత్రి కట్టుకున్న చీర రంగు, రకం వివరాలు ప్రత్యేకంగా ఇవ్వడం అదనపు క్షోభకు గురిచేస్తాయి అనడంలో సందేహం లేదు.