రామచక్కని సీతకు అరచేత గోరింట పూసే రోజులొచ్చేశాయి. జాబిలమ్మల చేతుల్లో నక్షత్రాల తోడు పూర్ణచంద్రోదయం కనిపించే సమయమూ ఇదే! ఆషాఢ మాసమంటే అంగనలందరికీ ఆనందమే. లేతపచ్చటి ఆకులో దాగున్న ఎరుపు రంగును అలంకారంగా మార్చుకునే ఈ నెల అచ్చంగా వాళ్లదే మరి. ఆ హరిత పత్రాలు మెత్తటి మెహందీగా మారి బోలెడు డిజైన్లలో ఇన్నాళ్లూ మురిపించాయి. ఇప్పుడవి అరచేతులు దాటి గోళ్ల మీదకి చేరుతున్నాయి. నెయిల్ మెహందీ డిజైన్స్ ఈ ఆషాఢపు ట్రెండ్!
గోరింటపురాతనమైనదే కావచ్చు. దాన్ని ఆషాఢ మాసంతో విధిగా పెట్టుకోవడమూ తాతమ్మలనాటి ఆచారమే అయ్యుండొచ్చు. కానీ సంప్రదాయానికి వినూత్నతను అద్దడం మనవాళ్ల నైజం. అందులోనే ట్రెండును సృష్టించుకొని ఆనందించడం ఆడపిల్లల తత్వం. అందుకే ఓపక్క గోరింట వాడుతూ, మరోపక్క మెహందీని అలంకరించుకుంటూ ట్రెడిషనల్ ఫ్యాషన్‌కి సరికొత్త అర్థాన్ని చెబుతున్నదీ తరం. రంగవల్లికల్లా చేతినిండా హెన్నా డిజైన్లు అలంకరించుకున్నా అదికూడా కాస్త అలవాటైన ైస్టెలే అయిపోయింది. మరి ఈసారి కొత్తగా ఏం ట్రై చేద్దామా అన్న ఆలోచనతో పుట్టినవే నెయిల్ మెహందీ డిజైన్లు.
ముద్దుగా ముచ్చటగా: గోరింటాకు పెట్టుకున్నామంటే గోళ్ల నిండుగా ఉండటమే ఇన్నాళ్లూ తెలుసు. ఇక ఈ నెయిల్ మెహందీతో అవికూడా చిన్ని డిజైన్లతో ముద్దుగా ముచ్చటగా ముస్తాబవుతున్నాయి. మెహందీ కోన్‌కు చిన్నపాటి రంధ్రం చేసి, గోళ్ల మీద ఈ డిజైన్లను వేస్తున్నారు. లేకపోతే మరింత సునిశితమైన డిజైన్లు వచ్చేందుకు మూతకు సన్నని గొట్టాలు ఉండే ప్రత్యేక బాటిళ్లు దొరుకుతాయి. ఫైన్ టిప్డ్ అప్లికేటర్లుగా పిలిచే వీటితో మరింత సన్నగా గీత గీయవచ్చు. నెయిల్ మెహందీలో సంప్రదాయ డిజైన్లతోపాటు, నాజూగ్గా ఉండే ఇతర వెరైటీ మోడళ్లనూ ప్రయత్నిస్తున్నారు.
నెయిల్ పాలిష్, రాళ్లు, కుందన్లలాంటి గోళ్ల అలంకరణల కలగలుపుగా ఈ మెహందీని పెట్టుకుంటున్నారు మరికొందరు. దీనికోసం గోళ్లు పెంచుకుంటున్న వాళ్లు కొందరైతే, ఆర్టిఫీషియల్ గోళ్లు అతికించుకుని ముస్తాబవుతున్న వాళ్లు ఇంకొందరు. నారింజ నుంచి మట్టి ఎరుపు రంగు దాకా అచ్చం గోరింట వర్ణాల్లో దొరుకుతున్న నెయిల్ పాలిష్‌లతో వీటిని ప్రయత్నిస్తున్నారు. ఇందులో ఎవరి అభిరుచి వారిది. మొత్తానికి ఈ ట్రెండుతో గోరంతా గోరింట పూస్తున్నదన్నమాట!