ముఖానికి నగ అందాన్ని తెచ్చిపెడుతుంది. నగల డిజైన్లలో ముఖాకృతి కూడా అందంగానే కనిపిస్తుంది అని చాటుతున్నాయి ఉమెన్ ఫేస్ ఇయర్ రింగ్స్, లాకెట్స్. చెవి పోగులు, పెండెంట్లలో వివిధ ముఖాకృతులు ఇమిడిపోవడం ఇందులోని ప్రత్యేకత.
నగుమోము చూడాలంటే కాలేజీ గేటు ముందు కాసేపు నిలబడితే చాలు. అదే నగమోము చూడాలంటే ఫ్యాషన్ దారుల్లో వెళ్లాల్సిందే. అప్పుడే, అటుగా నడిచే ఫ్యాషన్ ట్రెండ్ల గురించి తెలుస్తుంది. కొత్తదనం ఏమిటన్నది బ్లాక్ బోర్డు మీద చెప్పినంత చక్కగా బోధపడుతుంది. అందులోనూ సాఫ్ట్వేర్లా ఫ్యాషన్ కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతుందాయె! అందుకే, కాస్త ఫ్యాషన్ టేస్ట్ ఉన్నవాళ్లకు ఈ ఫేస్ జువెలరీ గురించి తెలిసే ఉంటుంది! సాధారణ డిజైన్లకు భిన్నంగా ఫంకీగా కనిపిస్తాయివి.
జీన్స్, టీషర్ట్తో పాటు కుర్తీల మీదికీ నప్పుతాయి. ప్లాస్టిక్, సిరామిక్, క్లేలాంటి వాటితో పాటు బంగారం, వెండి తదితర ఖరీదైన లోహాలతోనూ ఈ జువెలరీ తయారు చేస్తున్నారు. రెండు వైపులా ఒకే రకమైన అమ్మాయి మోముతో వచ్చేవి కొన్నయితే, రాజు-రాణి, అబ్బాయి-అమ్మాయి… ఇలా రెండు చెవులకూ వేరు వేరు ముఖాలతో తయారవుతున్నవి కొన్ని. నల్లపూసల్లోనూ, సన్నని చెయిన్లకు వేసుకునేలానూ ఈ లాకెట్లు రూపొందిస్తున్నారు.