వేసవి సెలవులు వచ్చాయంటే.. పల్లెలకు, టూర్లకు ప్లాన్ చేస్తుంటారు. నచ్చిన ప్రాంతాలకు ప్రయాణాలు కట్టేస్తుంటారు. అయితే, ట్రావెలింగ్‌ను పిల్లలు ఎంజాయ్ చేసినా.. నిద్ర పోవడంలో ఇబ్బంది పడుతుంటారు. పరిసరాల మార్పు, ప్రయాణపు షెడ్యూల్, ప్రయాణంలోని ఉత్సాహం.. ఇవన్నీ పిల్లల నిద్రకు అంతరాయం కలిగిస్తాయి. దాంతో, మరుసటి రోజు చిరాకుగా, అలసిపోయినట్లు కనిపిస్తారు. తగినంత నిద్ర లేకపోతే.. పిల్లలతోపాటు తల్లిదండ్రులకూ ఇబ్బందిగా ఉంటుంది. ఇలాంటి వారికి నిపుణులు కొన్ని సలహాలు అందిస్తున్నారు.
ప్రయాణాల్లో చాలామంది తల్లిదండ్రులు చేసే పొరపాటు.. పిల్లలకు స్మార్ట్‌ఫోన్, ట్యాబ్ అప్పగించడం. దీనివల్ల ప్రయాణాల్లో వారి అల్లరి తగ్గుతుందని భావిస్తారు. కానీ, ఇది వారి నిద్రపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. స్క్రీన్టైమ్ పెరగడం వల్ల.. పిల్లలకు నిద్ర దూరమవుతుంది. కాబట్టి, పడుకోవడానికి కనీసం ఒక గంట ముందు.. స్క్రీన్ వాడకాన్ని నివారించాలి.
పిల్లలు ఇంట్లో వాడే దుప్పటి, దిండు, వారికి ఇష్టమైన బొమ్మను వెంట తీసుకెళ్లండి. ఈ వస్తువుల వాసన, వాటి స్పర్శ.. పిల్లలకు సురక్షితమైన అనుభూతిని ఇస్తాయి. వారికి అలవాటైన వస్తువులు.. వారిని త్వరగా నిద్రపోయేలా చేస్తాయి.
ప్రయాణాల్లో పిల్లలకు మెత్తని, కాటన్ దుస్తులు వేయండి. వాతావరణానికి తగిన దుస్తులను ఎంచుకుంటే.. వారికి అసౌకర్యం కలగకుండా ఉంటుంది. దాంతో పడక ఎక్కగానే.. చక్కగా కునుకు పట్టేస్తుంది. ఆకలిగా ఉంటే.. ఇంట్లోకూడా నిద్ర పట్టదు. కాబట్టి, ప్రయాణ సమయంలో వారికి తేలికపాటి ఆహారం అందించండి. పొట్ట నిండుగా ఉంటే.. త్వరగా నిద్ర పడుతుంది.
లైట్లు ఎక్కువగా ఉంటే పిల్లలు నిద్రపోవడానికి ఇష్టపడరు. కాబట్టి, వీలైతే వారి కళ్లకు అడ్డుగా ఉండేలా చిన్న సన్‌షేడ్స్, మెత్తని వస్ర్తాన్ని వాడండి. కారు ప్రయాణంలో వారు నిద్రపోయినప్పుడు సీటు బెల్ట్, క్యారియర్ కంఫర్ట్‌గా ఉండేలా చూసుకోండి.
ఇంట్లో పడుకునేముందు పిల్లలు ప్రతిరోజూ చేసే పనులను.. ప్రయాణాల్లో కూడా కొనసాగించండి. ముఖం కడగడం, దుస్తులు మార్చడం, కథలు చెప్పడం, పాటలు పాడటం.. ఇవన్నీ ఇక నిద్రపోయే సమయం ఆసన్నమైందని వారి మెదడుకుసంకేతాన్ని పంపుతాయి. దాంతో, నిద్ర ముంచుకొచ్చేస్తుంది.
సాధ్యమైనంత వరకు ప్రయాణాన్ని పిల్లల నిద్ర వేళలకు అనుగుణంగా ప్లాన్ చేసుకోండి. రాత్రి వేళల్లో ప్రయాణించడం వల్ల వారు సహజంగానే నిద్రపో వడానికి అవకాశం ఉంటుంది.