ఫ్యాషన్ ప్రపంచంలో ఎంబ్రాయిడరీ స్థానం ప్రత్యేకం. పాదరక్షల నుంచి మెడకు ధరించే ఫ్యాబ్రిక్ చోకర్స్ వరకు ఎంబ్రాయిడరీ పనితనమే ప్రాణం. అందుకు కూడా ఓ యంత్రం ఉందని గుమ్మడి భవ్య దృష్టికి వచ్చింది. సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూనే లోతైన అధ్యయనం చేసింది. క్రమంగా ఎంబ్రాయిడరీ మెషీన్లు విక్రయించే స్థాయికి ఎదిగింది. ‘ప్రతి మహిళా ప్రతిరోజూ డబ్బులు చూస్తేనే ఆర్థిక స్వావలంబన సాధ్యం’ అంటున్న భవ్య స్టార్టప్ ప్రయాణం ఆమె మాటల్లోనే..
మా వారు నవీన్‌కుమార్. సీఎన్‌సీలో మెషీన్ ఇంజినీర్. అప్పటికే నేను సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాను. తాత్కాలిక అవసరాలు, ఇంట్లో ఖర్చుల కోసం జీతంపైనే ఆధారపడటం నాకు ఇష్టం లేదు. రోజూ డబ్బులొచ్చే పని ఏదైనా చేయాలనుకున్నా. మా ఆయన ద్వారా ఎంబ్రాయిడరీ మెషీన్ల గురించి తెలిసింది. నాకేమో కస్టమర్లతో మాట్లాడాలంటేనే బెరుకు. ఆయన మాత్రం నా ప్రతిభను గుర్తించారు.
నేను చేయగలనని బలంగా నమ్మారు. నవీన్ ప్రోత్సాహంతో ఎంబ్రా యిడరీ మెషీన్ల గురించి లోతుగా అధ్యయనం చేశాను. కస్టమర్ల అభిరుచికి అనుగుణంగా వాటిని తయారు చేయించవచ్చని అర్థమైంది. యంత్రాలను విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాలి కాబట్టి.. కమ్యూనికేషన్ స్కిల్స్ మెరుగుపర్చుకున్నాను. ‘మల్టీనేషనల్ ట్రేడింగ్ కార్పొరేషన్ (ఎంటీసీ)’ పేరుతో ఓ వ్యాపార సంస్థను రిజిస్టర్ చేయించాను. చైనా ప్రతినిధులతో మాట్లాడి తొలి విడత ఎంబ్రాయిడరీ యంత్రాలు దిగుమతి చేసుకున్నాను. క్రమంగా కస్టమర్లను పెంచుకుంటూ వెళ్లాను. మా ఉత్పత్తులు బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉండటంతో డిమాండ్ పెరిగింది. జనవరిలో డెస్క్‌టాప్ మోడల్ మెషీన్లను కూడా తీసుకొస్తున్నాం. ఇవి మహిళలకు సౌకర్యంగా ఉంటాయి.
చెప్పులరిగేలా..
మొదట్లో పరిస్థితులు ఏమంత అనుకూలంగా ఉండేవి కాదు. వ్యాపారానికి అవసరమైన రుణం కోసం డాక్యుమెంట్లు, సర్టిఫికెట్లు, ప్రాజెక్ట్ రిపోర్టుతో బ్యాంకర్ల చుట్టూ తిరిగాను. నేను ఉండేది సికింద్రాబాద్ సుచిత్రలో. లోన్ ఆఫర్ చేసింది చార్మినార్‌లోని ఓ బ్యాంకు. నా అకౌంట్స్‌లో ఏవో లోపాలున్నాయని హిమాయత్‌నగర్ బ్రాంచ్‌కు ట్రాన్స్ఫర్ చేశారు. అలా చార్మినార్ – సుచిత్ర- హిమాయత్‌నగర్.. తిరగాల్సి వచ్చేది. దీనివల్ల ఉద్యోగానికి ఇబ్బందులొచ్చాయి. నాలుగు లక్షల రుణం కోసం పదకొండు నెలలు ప్రదక్షిణలు చేశాను. అంతలోనే, పోటీదారులు కస్టమర్లను దారి మళ్లించారు. ఇక లాభం లేదని, బాలా నగర్లో ఓ షాపు అద్దెకు తీసుకున్నా. కరోనా తర్వాత ఇంటిపైనే ఓ ఆఫీసు, విశాలమైన స్టూడియో ఏర్పాటు చేసుకుని అక్కడి నుంచే వ్యాపారం నిర్వహిస్తున్నా. తెలంగాణతో పాటు బీహార్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, కర్ణాటక, ఏపీ, రాజస్థాన్‌లోనూ మెషినరీ విక్రయిస్తున్నాం.
దిశమార్చిన వీహబ్
భారీ స్థాయిలో మెషినరీ తెప్పించడంలో కొన్ని ఇబ్బందులు ఉండేవి. వీహబ్‌ను సంప్రదించడంతో నా జీవితం కొత్త మలుపు తీసుకుంది. నాకొక మెంటర్‌ను ఇచ్చారు. మార్కెటింగ్ మెలకువలు నేర్పించారు. కొవిడ్ దెబ్బకు బిజినెస్ వదిలేద్దామనుకున్న సమయంలోనూ వీహబ్ మెంటర్స్ తోడుగా నిలిచారు. బెంగళూరు వెళ్లి 45 రోజుల పాటు ఎంబ్రాయిడరీ డిజైనింగ్ సాఫ్ట్‌వేర్‌లో శిక్షణ తీసుకుని వచ్చాను. ఆ నైపుణ్యంతో ఎంబ్రాయిడరీతో ఫొటో ఫ్రేములు పరిచయం చేశాను. బ్లౌజులు, చీరలు, లెహంగాలు, కుర్తాలు, క్లాత్ బ్యాగ్‌లు, చివరికి చెప్పులపైనా అద్భుతమైన డిజైన్లు చేస్తున్నాను. కాన్సెప్ట్ బేస్డ్ వర్క్ కూడా తీసుకుంటున్నా. లవ్ మ్యారేజ్ చేసుకున్న ఓ జంటకు తమ తొలిప్రేమ నుంచి పెండ్లి వరకూ.. అనేకానేక జ్ఞాపకాలతో ఓ డ్రెస్ డిజైన్ చేసి ఇచ్చాను. ఇలా మార్కెట్‌కు అనుగుణంగా వ్యాపారాన్ని మలుచుకోవడం వీహబ్లోనే నేర్చుకున్నా.
వ్యాపారవేత్తలను తయారు చేస్తున్నా..
మా సంస్థ ద్వారా మహిళా ఆంత్ర ప్రెన్యూర్స్‌ను తయారు చేస్తున్నాం. ఇప్పటి వరకూ 45 మందికి ఎంబ్రాయిడరీలో శిక్షణ ఇప్పించాను. యువతులు, గృహిణులకు ప్రత్యేకంగా వర్క్‌షాపులు నిర్వహిస్తున్నా. రెండువేల మంది మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నా. భవిష్యత్‌లో హైదరాబాద్‌లో ఓ పెద్ద షోరూమ్ ఏర్పాటు చేయాలని ఉంది. ఎంబ్రాయిడరీ యంత్రాల విక్రయం, శిక్షణ, సర్వీసింగ్.. అన్నీ అక్కడే ఉండాలని నా ఆలోచన. మా కస్ట
మర్లంతా మహిళలే కాబట్టి వందశాతం మంచి సర్వీస్ ఇవ్వడానికే కృషి చేస్తున్నా(www.mtc-india.in).
– భవ్య గుమ్మడి, సీఈఓ ఎంటీసీ స్టూడియో
…? రవికుమార్ తోటపల్లి
శ్రీనివాస్ గడసంతల