మీరు యూట్యూబ్ షార్ట్స్ చేస్తుంటారా? అయితే, ఈ కొత్త అప్డేట్ గురించి తెలుసుకోవాలి. కంటెంట్ క్రియేటర్ల కోసం యూట్యూబ్ కొన్ని సూపర్ జనరేటివ్ ఏఐ (Generative AI) టూల్స్‌ను తీసుకొచ్చింది. వీటితో వీడియోలు తయారు చేయడం, వాటిని మరింత ఆకర్షణీయంగా మార్చడం చాలా తేలికవుతుంది. సింపుల్‌గా చెప్పాలంటే.. మీ ఫొటోలే వీడియోలుగా మారుతాయన్నమాట! అందుకు ‘Image-to-Video’ టూల్ ఉంది. దీంతో ఫోన్లోని ఏ ఫొటోనైనా ఆరు సెకన్ల యానిమేటెడ్ వీడియోగా మార్చేయొచ్చు. అందుకు ఏం చేయాలంటే.. ఫొటోని సెలెక్ట్ చేసుకుని.. యూట్యూబ్ ఇచ్చే కొన్ని క్రియేటివ్ ఐడియాల నుంచి మీకు నచ్చిన దాన్ని ఎంచుకోవాలి. అంతే.. మీ ఫొటోలు ప్రాణం పోసుకున్నట్టు సజీవంగా మారిపోతాయి.
గూగుల్ అత్యాధునిక ‘Veo 2’ వీడియో జనరేషన్ మోడల్ ఈ ఫీచర్ కోసం పని చేస్తుంది. ప్రకృతి దృశ్యాలు, గ్రూప్ ఫొటోలు, రోజువారీ ఫొటోలను సులువుగా వీడియోలుగా మార్చడానికి ఇది ఉపయోగపడుతుంది. షార్ట్స్ కెమెరాలో ఇప్పుడు కొత్తగా ‘Effects’ ఐకాన్‌లో ‘AI’ అనే కొత్త ట్యాబ్ కనిపిస్తుంది. దీని ద్వారా క్రియేటర్లు ఈ సరికొత్త ఏఐ ఎఫెక్ట్‌లను ఉపయోగించవచ్చు. గీసిన బొమ్మలను కూడా అద్భుతమైన కళాత్మక దృశ్యాలుగా మార్చేయొచ్చు.
మీలాగే కనిపించే డూప్లికేట్ పాత్రలతో ‘twinning’ వీడియోలు కూడా సృష్టించొచ్చు. ఇలా ఏఐ ద్వారా తయారైన కంటెంట్‌పై వాటర్ మార్క్‌లు జతవుతాయి. అంటే ఒరిజినల్ కాదని.. ఇది ఏఐతో తయారైందని చెప్పడానికే ఈ ఏర్పాటన్నమాట! అలాగే, ఏఐ ప్లే గ్రౌండ్ ఆప్షన్ని కూడా వాడుకోవచ్చు. ఈ కొత్త ఏఐ టూల్స్‌తో… యూట్యూబ్ షార్ట్స్ క్రియేటర్లు తమ వీడియోలను మరింత ఆకర్షణీయంగా మార్చేయొచ్చు. ఎందుకు ఆలస్యం మీరూ ట్రై చేసేయండి.