తెలుగు సినిమాలో ‘దండోరా’ వేస్తూ వస్తున్నడు మురళీకాంత్ దేవసోత్. తెలంగాణ మట్టిలో పుట్టిన కథని పొడిచెన్పల్లి తండా బిడ్డ తెరకెక్కించిండు. సినిమా అంటే ఎంత ఇష్టమున్నా.. ఉద్యోగం అనివార్యమైన జీవితం తనది. అమెరికా ఉద్యోగం వదులుకొని.. సినిమా బాట పట్టిండు. ఏ దర్శకుడి దగ్గరా అసిస్టెంట్‌గా పని చేయకుండా సినిమాల్లోకి వచ్చిన తెలంగాణ యువ దర్శకుడి గుండె ధైర్యం ఏమిటో మీరే చదవండి.
చిన్నప్పటి నుంచి సినిమాలంటే ఇష్టం. కానీ, సినిమాల్లోకి రావాలని కోరిక బలంగా ఉండేది కాదు. ఇంజినీరింగ్ మూడో సంవత్సరం చదివేప్పుడు మా నాన్న గుండెపోటుతో చనిపోయారు. అప్పటి నుంచి మా ఇంటికి కష్టాలొచ్చాయి. మాకు నాలుగు ఎకరాల పొలం ఉంది. అమ్మ వ్యవసాయం చేస్తూ మమ్మల్ని చదివించింది.
సి నిమాలపై ఎంత ఆసక్తి ఉన్నా.. మా కుటుంబ పరిస్థితుల నేపథ్యంలో అమ్మకు ఆసరాగా నిలవాలనుకున్నా! మా కాలేజ్‌లో కొంతమంది షార్ట్ వీడియోలు తీస్తుంటే నేను మాత్రం సబ్జెక్ట్లన్నీ పూర్తి చేయాలనే ఆలోచనతో ఉండేవాణ్ని. క్యాంపస్ ప్లేస్మెంట్ సాధించాలనే పట్టుదలతో చదివేవాణ్ని. నా సామర్థ్యాన్ని పరీక్షించుకోవడానికి ప్రతి కాంపిటీటివ్ ఎగ్జామ్ రాసేది. ఆర్ఆర్బీ, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, బ్యాంక్ క్లరికల్ పోటీ పరీక్షలు రాశాను. ఎస్బీఐలో క్లర్క్ జాబ్ సంపాదించాను. క్యాంపస్ ప్లేస్మెంట్లో టీసీఎస్‌లో జాబ్ వచ్చింది. ఐటీలో ఎంత నేర్చుకుంటే అంతగా ఎదిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి టీసీఎస్‌లో చేరాను. డబ్బులు సంపాదిస్తూ, అవసరాలు తీర్చుకుంటుంటే నాలో కాన్ఫిడెన్స్ పెరిగింది. కష్టపడితే ఏదైనా సాధించవచ్చు అనిపించింది. మా మేనేజర్ నన్ను అమెరికా పంపారు. అప్పుడు నాలో కాన్ఫిడెన్స్ రెట్టింపైంది.
నా ఊహల్లో సినిమా..
ఎంత అమెరికాలో ఉద్యోగం చేస్తున్నా.. ఐటీ రంగం నా ప్రపంచం కాదనిపించేది. ఇప్పటిదాకా అనుకున్నవన్నీ సాధించినప్పుడు.. నాకిష్టమైన సినిమా ఎందుకు సాధ్యం కాదనిపించింది. అమెరికాలో సినిమా వర్క్‌షాప్‌లకు వెళ్తుండేది. సినిమా స్క్రిప్ట్‌లు డౌన్లోడ్ చేసుకుని చదివేది. ఆ స్క్రిప్ట్ ఆధారంగా సినిమాని ఇలా తీయొచ్చో ఊహించేది. ఆ తర్వాత సినిమా చూసేవాణ్ని. కొన్ని సినిమాలు నేను ఊహించిన దానికంటే బెటర్‌గా ఉండేవి. ఇంకొన్ని సినిమాలు పూర్‌గా ఉండేవి. అలా నా ఆలోచనలన్నీ ఎప్పుడూ సినిమా చుట్టూ తిరిగేవి. కొన్నాళ్ల తర్వాత నేనే సినిమా స్క్రిప్ట్ రాయడం మొదలుపెట్టాను.
అమ్మతో ఓ అబద్ధం
‘సినిమాలు తీద్దామనుకున్నా. అందుకోసం జాబ్ మానేయాలనుకున్నాను. ఉద్యోగం మానేస్తానంటే మా ఇంట్లో కంగారు పడ్డారు. అంత మంచి కంపెనీ, అమెరికాలో జాబ్ వదులుకుంటే ఎలా?’ అన్నారు. ఒకసారి నిర్ణయం తీసుకున్నాక నేనెప్పుడూ వెనుకడుగు వేయలేదు. అమెరికా నుంచి ఇండియా వచ్చేశాను. అమ్మ కంగారు పడుతుందని హైదరాబాద్‌లో జాబ్ చేస్తున్నానని అబద్ధం చెప్పాను. సినిమా అవకాశం రావాలంటే అసిస్టెంట్‌గా పని చేయాలని చాలాకాలం అనుకున్నాను. కొంతమంది డైరెక్టర్ల చుట్టూ తిరిగాను. పదేండ్లకు పైగా అసిస్టెంట్స్‌గా పనిచేస్తున్నవాళ్లు ఎందరో అక్కడ కనిపించారు. ఎన్నాళ్లయినా వాళ్లు అసిస్టెంట్లుగానే మిగిలిపోతారేమో అనిపించింది. ఎవరి దగ్గరా అసిస్టెంట్‌గా పనిచేయకుండానే బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చిన డైరెక్టర్లు ఉన్నారు. నేనూ అదే పంథాను ఎంచుకున్నాను. స్క్రిప్ట్ పని మొదలుపెట్టాను. ఇంతలో కరోనా వచ్చింది. లాక్డౌన్ మొదలైంది. చేసేది లేక మళ్లీ ఉద్యోగంలో చేరాను.

Sunday
పుస్తకాల ప్రపంచంలోకి..
మూడేళ్లపాటు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటూ స్క్రిప్ట్‌లు రాసుకున్నాను. ఈ కాలంలో పుస్తకాలు బాగా చదివాను. కేశవరెడ్డి నవలలు స్మశానం దున్నేరు, అతడు అడవిని జయించాడు, యండమూరి నవల వెన్నెల్లో ఆడపిల్ల, గోపిచంద్ రాసిన అసమమర్థుడి జీవయాత్ర, గుర్రం జాషువా కవిత్వం ఇలా ఎన్నో చదివాను. నాన్ ఫిక్షన్ ఎక్కువగా చదివాను. పుస్తకాలు, సమాజాన్ని చదివినవాడే మంచి దర్శకుడు కాగలడని నా నమ్మకం. అరుంధతీ రాయ్ రాసిన వాకింగ్ విత్ కామ్రేడ్స్, ద గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్, నందిని సుందర్ రాసిన బర్నింగ్ ఫారెస్ట్, బాలగోపాల్ రచనలు ఇలా ఎన్నెన్నో చదివాను. సినిమాలు కాకుండా పుస్తకాలు నా ప్రపంచంలో చేరిపోయాయి. నాకు ఈ చైతన్యం, మనోధైర్యం చదువు వల్లే వచ్చింది.
ఒక సీన్ షూట్ చేశాక..
కొన్ని స్క్రిప్ట్‌లు రెడీ చేసుకున్న తర్వాత.. కొంతమంది నిర్మాతలను కలిశాను. ‘ఎవరిదగ్గర పనిచేశావు? ఎంతకాలం పనిచేశావ్?’ అని అడిగారు. ఒకటీ, రెండు నిమిషాల వీడియాలు తీశానని చెప్పాను. అప్పటికి కొన్ని కథలు రాసుకున్నాను. ఆ కథలు చెప్పాను. అనుభవం లేదనుకోవద్దు. డెమో చేసి నిరూపించుకుంటాను. దానికయ్యే ఖర్చు పెట్టుకోండని అడిగాను. కొంతమంది నిర్మాతలు వినలేదు. విన్నవాళ్లకు నమ్మకం కుదరలేదు. చివరికి నిర్మాత రవీంద్ర బెనర్జీ ముప్పనేని గారిని కలిశాను. ‘చెప్పిన కథ బాగుంది’ అన్నాడు. కానీ, పూర్తిగా తనకు నమ్మకం కుదరలేదు. అయితే.. డబ్బులు ఇచ్చి ఒక సీన్‌ని షూట్ చేసుకుని రమ్మన్నారు. ఒకరోజు లోకేషన్ అనుకుని షూట్ చేశాను.
నేను చెప్పింది ఎలా ఉందో, అదే ఫీడ్ వచ్చిందని ఆయన ఫీల్ అయ్యాడు. నేను డైరెక్షన్ చేయగలనని అనుకున్నాడు. నన్ను నమ్మి అవకాశం ఇచ్చాడు. సినిమా ప్రపంచంలో చాలా కష్టాలుంటాయి. వాటన్నిటినీ దాటాలి. అప్పటి దాకా ఆగాలని పెళ్లి చేసుకోలేదు. ఒక సినిమా తీసిన తర్వాత పెళ్లి చేసుకోవాలనుకున్నాను. ఇన్నాళ్లకు సినిమా కల నెరవేరింది. ఊళ్లల్లో ప్రకటన చెప్పడానికి దండోరా వేస్తారు. నేను సినిమాలో ఒక దండోరా వేస్తున్నాను. నర్మగర్భంగా చెప్పాలనుకున్న దానికి రసవత్తరమైన స్క్రీన్‌ప్లే జోడించి దండోరా వేస్తున్నాను. ఈ సినిమా నా దండోరా!
నాన్న చూపిన దారి
మాది మెదక్ పట్టణానికి పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న పొడిచెన్పల్లి తాండ. మా నాన్న ఊరికి సర్పంచ్‌గా పని చేశారు. వెటర్నరీ డిపార్ట్మెంట్లో లైవ్ స్టాక్ అసిస్టెంట్‌గా పని చేశారు. ‘మన బతుకులు మారాలంటే మనకు కావాల్సింది చదువే’ అని చెప్పేవారు. చాలీచాలని జీతం అయినా పట్టుదలతో మమ్మల్ని చదివించారు. తనకున్న ఆర్థిక సమస్యలను మాకేనాడు తెలియనివ్వలేదు. నాన్న పోయాక ఆయన బాధలన్నీ మాకు తెలిశాయి. ఆయన ఆశించినట్టే అందరం బాగా చదువుకుని మంచి ఉద్యోగాల్లో ఉన్నాం.
…? నాగవర్ధన్ రాయల