ప్రస్తుతం ఎన్నోరకాల వాకింగ్ వర్కౌట్లు ట్రెండింగ్లో ఉన్నాయి. ఆ జాబితాలోకి మరొక వ్యాయామం వచ్చి చేరింది. ముఖ్యంగా, కడుపు ఉబ్బరం (బ్లోటింగ్)ను తగ్గించడంలో ‘లింఫాటిక్ వాకింగ్’ అద్భుతంగా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. లింఫాటిక్ వాకింగ్ అనేది.. ఒక సున్నితమైన, లయబద్ధమైన నడక. సాధారణ వాకింగ్ కన్నా భిన్నంగా.. శరీరంలో శోషరసం (లింఫ్), అదనపు ద్రవాల కదలికకు తోడ్పడుతుంది. శరీరం నుంచి విష పదార్థాలు, అదనపు నీరు బయటికి పోవడానికి సహాయపడుతుంది.
ఈ రకమైన వ్యాయామంలో నడక లయబద్ధంగా సాగాలి. ఒకేరకమైన వేగంతో అడుగులు వేయాలి. నడుస్తున్నప్పుడు రిలాక్స్డ్గా ఉండి, దీర్ఘశ్వాస తీసుకోవాలి. నడకలో స్థిరమైన, తక్కువ ప్రభావం చూపే కదలికపై దృష్టి పెట్టాలి. దీనివల్ల ప్రతి అడుగుతో పాదాలు, పిక్కలలోని కండరాలు సహజ పంపులా పనిచేస్తాయి. అంటే, రక్తం శరీర దిగువ భాగంలోనే పేరుకుపోకుండా.. పైకి పంప్ చేయడానికి పిక్కలు సాయపడతాయి. ఫలితంగా, రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. ఇక మధ్యాహ్న భోజనం లేదా రాత్రి భోజనం తర్వాత 10-15 నిమిషాలు నడిస్తే.. మంచి ఫలితాలు కనిపిస్తాయి.
లింఫాటింక్ వ్యాయామం పేగుల కదలికలను మెరుగుపరుస్తుంది. ఫలితంగా, కడుపు ఉబ్బరం తగ్గుతుంది. భోజనం తర్వాత శరీరంలో చేరే గ్యాస్, భారమైన అనుభూతిని నివారిస్తుంది. ఎక్కువసేపు కూర్చోవడం వల్ల కాళ్లలో ద్రవాలు పేరుకుపోకుండా.. వాటిని పైకి పంప్ చేస్తుంది. ఈ వ్యాయామం వల్ల పిక్కలు సహజ పంపులా పనిచేసి.. రక్తం, శోషరస ప్రవాహాన్ని వేగవంతం చేస్తాయి.