ఓ మూలకు పెట్టడం అన్నమాట ఇప్పుడేం తప్పు కాదు. ఎందుకంటే అది కూడా అందంగా మారిపోతోంది కాబట్టి. ఇంటీరియర్ డిజైనింగ్‌లో కార్నర్ డెకరేషన్ అన్నది ఇప్పుడొక ట్రెండ్. ఇంట్లో గదుల్నీ, అల్మారాల్నీ ఎలా అందంగా తీర్చిదిద్దుకుంటామో కావాలనుకున్న ఓ మూలకు కూడా అదే తరహాలో ప్రత్యేక ముస్తాబు చేస్తున్నారిపుడు.
ఇంట్లోకి అడుగు పెట్టగానే ఏదో ఒకటి కొత్తగా కనిపించాలి. చూసిన వాళ్లకు వావ్ అనిపించాలి. ఇంటి డిజైనింగ్‌లోనే కాదు, ఇంటీరియర్ డిజైనింగ్‌లో కూడా ఆ మార్పు ఉండాలి. ఇదే కొత్త తరం ఇళ్ల యజమానుల అభిరుచి. అంతేకాదు, స్థలాన్ని ఎంత బాగా ఉపయోగించుకున్నాం అన్నది కూడా ఇప్పుడు ముఖ్యమే. హాల్లాంటి ఒక పెద్ద గదిలో ఓ మూలను చక్కగా ఉపయోగించుకునేలా ఇప్పుడు కార్నర్ డెకరేషన్ చేస్తున్నారు. చిన్నపాటి మొక్కలు, పుస్తకాలను అమర్చుకునేలా షెల్ఫ్‌ల తరహాలో తీర్చిదిద్దుతున్నారు.
అభిరుచికి తగ్గట్టు…
కార్నర్ షెల్ఫ్ డెకరేషన్ అనేది కూడా ఇంటీరియర్ డిజైన్లాగే విభిన్నంగా ఉంటున్నది. దీన్ని మన అభిరుచికి తగ్గట్టు రకరకాల ఆకృతులు, రంగులు, డిజైన్లలో ఇంటి డెకరేషన్‌కి నప్పేలా ఎంచుకోవచ్చు. పెద్ద హాల్లో మూలన ఓ అందమైన పొదరిల్లులా కనిపించేలా దీన్ని అమర్చుకోవచ్చు. లేదా చెక్కలు రంగులతో అందమైన షోకేస్లాగా ఏర్పాటు చేసుకోవచ్చు. వరుసక్రమంలో ఉండే గూళ్లలాగా, అరల్లాగా మనకు నచ్చిన మాడల్ని ఎంపిక చేసుకోవచ్చు. సీతాకోక చిలుక, హృదయాకారాల్లోనూ వీటిని చేయించుకోవచ్చు. చిన్న పూల మొక్కలు, షో మొక్కలు, తీగలతో పాటు, బొమ్మలు, పుస్తకాలు పెట్టుకోవడానికి ఈ కార్నర్ షెల్ఫ్‌లు ఉపయోగపడతాయి.
సింపుల్‌గా ఉండే గది మూలను ఫోకల్ పాయింట్‌గా మార్చేందుకు ఇవి ఉపయోగపడతాయి. ఒక పక్క స్థలం వృథా కాకుండా చూసుకుంటూనే వీటితో గదికి అందాన్ని తీసుకురావచ్చు. ఈ అరల పక్కన ఆకులతో ఉండే తీగలు వేలాడదీయడం, అందమైన లైట్లు ఉంచడం వల్ల మరింత లుక్ వస్తుంది. షెల్ఫ్‌లకు లోపలి భాగంలో లైట్లు అమర్చినా భలే అందంగా కనిపిస్తాయి. అలాగే ఇదే కార్నర్లో ఒక చిన్న సోఫాసెట్ లాంటిది ఉంచితే కూర్చుని పనిచేసుకొనేందుకు, చదివేందుకు పనికొస్తుంది. మరింకేం ఆలస్యం మీ ఇంట్లోనూ ఓ మూలను ముస్తాబు చేసి కొత్త ట్రెండ్‌ను ఫాలో అయిపోండి.