ప్రస్తుతం చాలామంది ‘గ్లూటెన్-ఫ్రీ డైట్’ను ఫాలోఅవుతున్నారు. సెలెబ్రిటీలు మొదలుకొని ప్రొఫెషనల్ అథ్లెట్ల వరకు.. ఈ రకమైన ఆహారాన్ని తెగ ప్రచారం చేస్తున్నారు. దీనివల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలనూ కొనియాడుతున్నారు. అయితే, ఈ రకమైన ఆహార నియమాలు అందరికీ సరిపడవని నిపుణులు చెబుతున్నారు. ఆహారంలో గ్లూటెన్ తగ్గించడం వల్ల ఆరోగ్యానికి కొంత మేలు జరిగినా.. కొన్ని నష్టాలు కూడా ఉంటాయని అంటున్నారు.
గ్లూటెన్ లభించే గోధుమలు, మరికొన్ని ధాన్యాలను పూర్తిగా పక్కన పెట్టడం; పండ్లు, కూరగాయలు, మాంసం, గుడ్లు లాంటి గ్లూటెన్ లేని సహజ ఆహారాలను తీసుకోవడమే.. గ్లూటెన్ ఫ్రీ డైట్! ఇందులో కొందరు గ్లూటెన్-ఫ్రీ బ్రెడ్, పాస్తా లాంటి ప్రాసెస్ చేసిన ఆహారాలను కూడా కలిపేస్తున్నారు. గ్లూటెన్-ఫ్రీ డైట్లో భాగంగా.. చాలామంది కార్బోహైడ్రేట్లు ఉండే పదార్థాలను పూర్తిగా పక్కన పెట్టేస్తున్నారు.
అయితే, అన్నం, బంగాళాదుంపలు, చిక్కుళ్ల లాంటి కార్బోహైడ్రేట్లు ఉండే అనేక ఆహారాల్లోనూ గ్లూటెన్ ఉండదు. అయినప్పటికీ.. గ్లూటెన్ ఫ్రీ డైట్ పేరుతో వీటిని తినడం మానేస్తున్నారు. ఫైబర్, ముఖ్యమైన పోషకాలు సమృద్ధిగా ఉండే తృణధాన్యాలనూ పక్కన పెట్టేస్తున్నారు. నిజానికి, ఇవి గుండె ఆరోగ్యానికి ఎంతో తోడ్పడతాయి. రక్తంలో చక్కెర స్థాయుల నియంత్రణను మెరుగుపరుస్తాయి. కాబట్టి, వీటిని పూర్తిగా మానేస్తే.. గుండె జబ్బులు, మధుమేహం వచ్చే ప్రమాదం ఉంటుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
గ్లూటెన్‌తో నిండి ఉండే కొన్ని ఆహారాలు.. బి-విటమిన్లు, ఐరన్, మెగ్నీషియం లాంటి ముఖ్యమైన విటమిన్లు, ఖనిజాలకు మంచి వనరులు. గ్లూటెన్ ఫ్రీ డైట్‌తో శరీరానికి ఇవి అందకుండా పోతాయి. మరికొందరు బరువు తగ్గడానికి గ్లూటెన్ ఫ్రీ డైట్ పాటిస్తున్నామని చెబుతుంటారు. నిజానికి తమ డైట్లో కేలరీలు, ప్రాసెస్ చేసిన ఆహారాలను తగ్గించడం, తక్కువ రిఫైన్డ్ కార్బోహైడ్రేట్లు తీసుకోవడం వల్లే బరువు తగ్గుతారు. అంతేకానీ, గ్లూటెన్ మానేయడం వల్ల బరువు తగ్గే అవకాశం ఉండదని నిపుణులు అంటున్నారు. ఇక అత్యధికంగా ప్రాసెస్ చేసిన గ్లూటెన్-ఫ్రీ ఆహార పదార్థాలను తీసుకోవడం కూడా మంచిది కాదు. ప్యాక్ చేసిన గ్లూటెన్-ఫ్రీ ఆహారాల్లో సోడియం, చక్కెర, కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది.
వీటిని అధికంగా తీసుకోవడం వల్ల బరువు పెరగడం, ఇతర ఆరోగ్య సమస్యలు కూడా రావొచ్చు. అయితే, గ్లూటెన్ను పూర్తిగా మినహాయించకుండానే, ఆహారపు అలవాట్లను ఆరోగ్యకరంగా మార్చుకోవడం ద్వారా మెరుగైన ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. కాబట్టి, గ్లూటెన్-ఫ్రీ డైట్‌ను ప్రయత్నించాలనుకుంటే, ముందుగా డైటీషియన్‌ను సంప్రదించాలి. అయితే, కొందరికి మాత్రం గ్లూటెన్ ఫ్రీ డైట్ తప్పనిసరి. సెలియాక్ వ్యాధి అనేది.. గ్లూటెన్పై శరీరం చూపే ఒక ఆటో-ఇమ్యూన్ వ్యాధి. ఈ వ్యాధి ఉన్నవారు గ్లూటెన్ను ఏ రూపంలోనూ తట్టుకోలేరు. వీరితోపాటు గ్లూటెన్ సెన్సిటివిటీ, గోధుమల అలర్జీ ఉన్నవారు కూడా గ్లూటెన్ ఫ్రీ డైట్ పాటించొచ్చు.