‘నిన్ను నిన్నుగా ప్రేమించుటకు.. నీ కోసమే కన్నీరు నించుటకు.. నేనున్నానని నిజముగ పలికే.. తోడొకరుండిన అదే భాగ్యం’ అంటాడు శ్రీశ్రీ ‘మనసున మనసై..’ పాటలో. ఈ స్మార్ట్ దునియాలో అంతగా తోడు ఎవరుంటున్నారు? చేతిలో ఫోన్, ఒళ్లో ల్యాప్‌టాప్, చెవులకు హెడ్సెట్.. లేచింది మొదలు స్క్రీన్ వెలుగులు ఇంతేగా జిందగీ! ఆఫీస్‌కు వెళ్లేలోపే వందల నోటిఫికేషన్లు! లైకులు కొట్టడం, షేర్ చేయడం.. ఇవన్నీ తెలియకుండానే ఒత్తిడికి గురిచేస్తున్నాయి. ఈ హడావుడిలో మనకు మనమే డిస్ కనెక్ట్ అయిపోతున్నాం. ఈ ఒత్తిడికి ఉపశమనమే టాక్టైల్ (tactile) సెల్ఫ్‌కేర్. అందుకోసం క్లినిక్‌లు ఉన్నాయా అనుకునేరు! అది మనకు మనం తీసుకునే సెల్ఫ్‌కేర్. ఈ నయా కేరింగ్ ట్రెండ్ ఇప్పుడు ఎందరికో ఉపశమనం కలిగిస్తున్నది.
స్ట్రెస్ ఫీల్ అయినప్పుడు వేడి వేడి కాఫీ తాగి రిలాక్స్ అవ్వాలనుకుంటాం. కాఫీ గొంతు దిగకముందే.. ఆ వేడి కప్పును చేతుల్లోకి తీసుకోగానే.. టచ్ రిసెప్టర్లు పని చేస్తాయని ఎంత మందికి తెలుసు? ఆ వెచ్చని కప్పు స్పర్శని ఎంత మంది ఫీలవుతున్నారు? ఎందుకంటే.. ఇదే టాక్టైల్ కేర్. ఈ టచ్‌ని మనం చాలా విషయాల్లో ఫీల్ అవ్వొచ్చు. ఇంటికి వెళ్లగానే పరుగున వచ్చి కౌగిలించుకునే బిడ్డ స్పర్శలో, ప్రేమగా భార్య అందించే చుంబనంలో, ఆప్యాయంగా తల నిమిరే అమ్మ చేతి స్పర్శలో… ఇలా మనసును తాకే టచ్ ఏదైనా మన నెర్వస్ సిస్టమ్‌కి రీసెట్ బటన్‌లా పనిచేస్తుంది.
నేటి బిజీ లైఫ్‌లో ఈ ఫీలింగ్స్‌ని మనమే కట్ చేసేశాం. మన శరీరం ఆందోళనతో ఉందా?
ఒత్తిడిలో ఉందా? అనేది కూడా మనం గమనించడం మానేశాం. టాక్టైల్ మీ శరీరాన్ని ఫీలవ్వమని చెబుతుంది. ప్రతి స్పర్శను మనసుతో అనుభవించమని బోధిస్తుంది. ఎందుకంటే టచ్ రిసెప్టర్లు మెదడులోని ఆక్సిటోన్ హార్మోన్‌ను ప్రేరేపిస్తాయి. దీంతో మన స్ట్రెస్ లెవల్స్ తగ్గుతాయి. మైండ్ వెంటనే రిలాక్స్ అవుతుంది.
టాక్టైల్ సెల్ఫ్ కేర్ కచ్చితమైన ప్రక్రియ కాదు.. క్లినిక్ వెళ్తే దొరికేది కాదు. అది ఒక అవగాహన కూడిన ప్రాక్టీస్. దీనిలో ప్రతీ చిన్న చర్య.. మన శరీరం ఫీలవ్వడం గురించే ఉంటుంది. ఏదైనా పని మొదలుపెట్టే ముందు.. మైండ్‌ఫుల్ బ్రీథింగ్ చేయాలి. మీరు తీసుకునే శ్వాసని మీరు ఫీల్ అవ్వగలగాలి.
బడలిర తీర్చుకోవాలని అలసిన శరీరం కోరుకుంటుంది. కానీ, మనమే దాన్ని వీకెండ్ వరకు హోల్డ్ చేస్తున్నాం. ఆ వీకెండ్లోనూ ఓటీటీలు, సోషల్ మీడియాకు అంకితమవుతున్నాం. వారాంతం సంగతి సరే.. ఏ రోజుకారోజు మీకు మీరే రెమెడీ ప్లాన్ చేసుకోవాలి. వెచ్చని నీటితో చేతులు కడగడం, హ్యాండ్ మసాజ్ చేసుకోవడం.. ఇవి చిన్నవే అయినా మంచి మూడ్‌ను క్రియేట్ చేస్తాయి.