వృత్తి వేరు, ప్రవృత్తి వేరు. కొందరు తమ ప్రవృత్తినే వృత్తిగా మలుచుకుంటారు. కానీ, మరికొందరు వృత్తిపరంగా ఉన్నత స్థానాల్లో ఉన్నప్పటికీ తమ ప్రవృత్తిలోనూ రాణిస్తుంటారు. హైదరాబాద్‌కు చెందిన అలగాని అన్విక ఈ కోవకే చెందుతుంది. ఒకవైపు మెడిసిన్ చదువుతూనే తనకెంతో ఇష్టమైన కేకులు, కుకీస్ చేస్తూ బేకర్గానూ రాణిస్తున్నది.
హైదరాబాద్‌లో బీహెచ్ఎంసీ మొదటి సంవత్సరం చదువుతున్న అన్వికకు చిన్నప్పటి నుంచీ వెరైటీ వంటకాలు చేయడం అంటే ఇష్టం. స్కూల్ డేస్ నుంచే తన స్నేహితులకు, కుటుంబ సభ్యులకు రకరకాల కేకులు, కుకీలు, పేస్ట్రీలు, స్వీట్స్ చేసి రుచి చూపిస్తూ ఉండేది. తిన్నవాళ్లంతా మెచ్చుకునేవాళ్లు. వారందరి ప్రోత్సాహంతో మెడిసిన్ చదువుతూనే.. ‘బేకింగ్ ఎంటర్ప్రైజ్ ఆన్ బేక్స్’ను స్థాపించింది.
సోషల్ మీడియా ద్వారా తన స్టార్టప్‌ని విజయవంతంగా నడిపిస్తున్నది. కేకుల రుచి, నాణ్యత గురించి సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం కావడంతో.. క్రమంగా ఆర్డర్లు పెరుగుతూ వచ్చాయి. ‘మెడిసిన్ చదవడం సవాళ్లతో కూడింది. ఆ ఒత్తిడి నుంచి రిలాక్స్ కావడానికి ఆటవిడుపుగా బేకరీ ఫుడ్ తయారు చేస్తుంటా. బేకింగ్ నా క్రియేటివిటీ అవుట్లెట్. ఇది ఇంత సక్సెస్ అవుతుందని ముందు అనుకోలేదు. ఇప్పుడు నా కల నిజమైంది’ అంటున్నది అన్విక.