హ్యాండ్ బ్యాగ్.. అంటే తోలుతో చేసినవే మనకు తెలుసు. అయితే పండ్ల తొక్కల్ని ఉపయోగించి అందమైన, విలాసవంతమైన బ్యాగుల్ని రూపొందిస్తున్నది ‘సర్జా’ సంస్థ. పండ్ల రసాల తయారీ కంపెనీలు చెత్తలో పడేసే తొక్కల్ని సేకరించి పునర్వినియోగిస్తుంది. ముఖ్యంగా పైనాపిల్, ఆపిల్, కాక్టస్ (ఎడారి మొక్కలు)లాంటి వాటి తొక్కల్ని గుజ్జుగా మార్చి.. హ్యాండ్ బ్యాగులు తయారు చేస్తున్నది. వీటి తయారీలో వాడే గొలుసులు, జిప్‌లను కూడా రీసైకిల్డ్ లోహాలతో తీర్చిదిద్దుతున్నారు. రంగుల్నీ ప్రకృతి సిద్ధంగా తయారు చేస్తున్నారు.
ఈ బ్యాగుల మన్నికా బావుంటుంది. కనీసం పది సంవత్సరాలు చక్కగా వాడుకోవచ్చు. అంతేకాదు.. నీళ్లు, నూనెలాంటివి పడినా ఏ ఇబ్బందీ లేకుండా వాటర్ రెసిస్టెంట్, ఆయిల్ రెసిస్టెంట్‌గా తీర్చిదిద్దుతున్నారు. బ్యాగు లోపల వేసే లైనింగ్ కోసం ఆర్గానిక్ కాటన్, ప్యూర్ పట్టు ఎంచుకుంటున్నారు. వాతావరణంపై అత్యంత దుష్ప్రభావం చూపే పరిశ్రమల్లో ఫ్యాషన్ ఇండస్ట్రీ ఒకటనీ, ఆ ప్రభావాన్ని తగ్గించేందుకే తాను ఈ బ్రాండ్‌ను స్థాపించాననీ చెబుతారు సృష్టికర్త అంజనా సర్జా డాటర్ ఆఫ్ ఫిల్మ్‌స్టార్ అర్జున్. న్యూయార్క్‌లో ఫ్యాషన్ కోర్సులు చదివింది అంజన. కర్ణాటకలోని హుబ్లీలో కార్ఖానా ఉంది. ఇక్కడ 20 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. పార్టీ, ఆఫీస్ బ్యాగులతో పాటు ల్యాప్‌టాప్ బ్యాగుల్నీ తయారు చేస్తున్నారు.