మంగళవారం 07 ఏప్రిల్ 2020
Komarambheem - Feb 16, 2020 , 23:21:34

సహకార సంఘాలపై గులాబీ జెండా

సహకార  సంఘాలపై గులాబీ జెండా

ఆసిఫాబాద్‌ టౌన్‌: ఆసిఫాబాద్‌ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పాలక వర్గం కొలువైంది. కార్యాలయంలో ఆదివారం ఉదయం 10.30 నుంచి 11.30 గంటల వరకు నామినేషన్లను పరిశీలించి 12.30కు ఉపసంహరణ ముగిశాకా ఎన్నికలు నిర్వహించారు.  టీఆర్‌ఎస్‌ బలపర్చిన 1వ వార్డు డైరెక్టర్‌ అలిబీన్‌ అహ్మద్‌ చైర్మన్‌గా, 9వ వార్డు డైరెక్టర్‌ రుకం ప్రహ్లాద్‌ వైస్‌చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన్నట్లు ఎన్నికల అధికారి మధులిత ప్రకటించారు. వారికి ధృవ పత్రాలు అందించి శాలువాతో ఎన్నికల అధికారి సన్మానించారు. ఈ సందర్భంగా చైర్మన్‌ అలిబీన్‌ అహ్మద్‌ మాట్లాడుతూ, రైతులకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలు పరిష్కరిస్తూ అభివృద్ధి చేసేందుకు తనవంతు కృషి చేస్తానన్నారు. తనను చైర్మన్‌గా ఎన్నుకున్న నాయకులకు, రైతులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.  


వాంకిడి: వాంకిడి సహకార సంఘ చైర్మన్‌, వైస్‌చైర్మన్‌ ఎన్నిక ఆదివారం ప్రాథమిక వ్యవసాయ సహకర సంఘం కార్యాలయంలో ఎన్నికల అధికారి మిలింద్‌కుమార్‌ అధ్యక్షతన జరిగింది. చైర్మన్‌ కోసం టీఆర్‌ఎస్‌ బలపర్చిన అభ్యర్థి జాబిరి పెంటయ్యను 6వ వార్డు డైరెక్టర్‌ దేవినేని గోల్ల ప్రతిపాదన చేయగా, వైస్‌చైర్మన్‌ కోసం కోట్నాక నేపాజీని 3వ వార్డు డైరెక్టర్‌ దిగంబర్‌ ప్రతిపాదన చేశారు. చైర్మన్‌కు జాబిరి పెంటయ్య, వైస్‌చైర్మన్‌కు కోట్నాక నేపాజీ ఒక్కొక్కరే నామినేషన్‌ వేశారు. దీంతో వీరు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి మిలింద్‌కుమార్‌ ప్రకటించారు. ఎంపీపీ ముండే విమలాబాయి, జడ్పీటీసీ అజయ్‌కుమార్‌, సర్పంచులు సయ్యద్‌ ఆయ్యూబ్‌, దుర్గం కమలాకర్‌, సీడాం అన్నిగాలు చైర్మన్‌, వైస్‌చైర్మన్‌కు శాలువా కప్పి సన్మానించారు. అనంతరం సహకార సంఘం కార్యాలయం నుంచి ప్రధాన రహదారి గుండా విజయోత్సవ ర్యాలీ తీశారు. 


రెబ్బెన: రెబ్బెన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఎన్నికలు ఈ నెల 15న జరుగగా ఆదివారం సంఘం కార్యాలయంలో చైర్మన్‌, వైస్‌చైర్మన్‌కు ఎన్నికలు జరిగాయి. టీఆర్‌ఎస్‌ బలపరుస్తున్న అభ్యర్థిగా అధ్యక్ష స్థానానికి 7వ వార్డు డైరెక్టర్‌ కార్నాథం సంజీవ్‌కుమార్‌, వైస్‌ చైర్మన్‌గా 13వ వార్డు డైరెక్టర్‌ రంగు మహేశ్‌గౌడ్‌ నామినేషన్‌ వేశారు. మిగతా డైరెక్టర్లు ఎవరూ నామినేషన్లు వేయకపోవడంతో ఎన్నికల అధికారి మంజుల ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు. చైర్మన్‌, వైస్‌చైర్మన్‌గా ఎన్నికైన వారిని పలువురు పులమాలలు వేసి శాలువా కప్పి సన్మానించారు. రెబ్బెన సీఐ ఆకుల అశోక్‌ ఆధ్వర్యంలో ఎస్‌ఐ దీకొండ రమేశ్‌ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 


జైనూర్‌: జైనూర్‌ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాన్ని టీఆర్‌ఎస్‌ పార్టీ కైవసం చేసుకుంది. ఆదివారం సంఘం కార్యాలయంలో చైర్మన్‌, వైస్‌చైర్మన్‌కు ఎన్నికలు జరిగాయి. 10వ వార్డు డైరెక్టర్‌ కొడప హన్నుపటేల్‌ చైర్మన్‌గా, 11వ వార్డు డైరెక్టర్‌ షేక్‌ ఉస్మాన్‌ను ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి జాదవ్‌పవన్‌కుమార్‌ ప్రకటించారు. 


జైనూర్‌(సిర్పూర్‌(యు)): సిర్పూర్‌(యు) సహకారం సంఘం చైర్మన్‌ ఎన్నికల్లో అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ జెండా రెపరెపలాడింది. ఆదివారం సంఘం కార్యాలయంలో చైర్మన్‌, వైస్‌చైర్మన్‌కు ఎన్నికలు జరిగాయి. 1వ వార్డు డైరెక్టర్‌ కేంద్రె శివాజి చైర్మన్‌గా, 7వ వార్డు డైరెక్టర్‌ జాదవ్‌ కమలబాయి వైస్‌చైర్మన్‌ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి శ్రీనివాస్‌ తెలిపారు. 


కెరమెరి: కెరమెరి సహకార సంఘం ఎన్నికల నామినేషన్‌ నుంచి చైర్మన్‌ ఎన్నికల వరకు ఏకగ్రీవం కావడంతో అధికార పార్టీ నేతల్లో జోష్‌ పెరిగింది. 13 స్థానాలు ఉండగా 13 మంది అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నిక కావడం ఇదే మొదటి సారి.  ఆదివారం సంఘం కార్యాలయంలో చైర్మన్‌, వైస్‌చైర్మన్‌కు ఎన్నికలు నిర్వహించారు. 6వ వార్డు డైరెక్టర్‌ మోహర్లే శంకర్‌ చైర్మన్‌గా, 2వ వార్డు డైరెక్టర్‌ కంబాల లక్ష్మి వైస్‌చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి గోపికాంత్‌ ప్రకటించారు. సీఈవో శేషరావ్‌, అసిస్టెంట్‌ సీఈవో విజయ్‌, ఎంపీపీ పేందోర్‌ మోతీరాం, వైస్‌ ఎంపీపీ సయ్యద్‌ అబుల్‌ కలాం, మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ ఎండీ మునీర్‌అహ్మద్‌, నాయకులు రాథోడ్‌ ఉత్తం నాయక్‌, షేక్‌ యూనుస్‌లు చైర్మన్‌, వైస్‌చైర్మన్లను శాలువాతో ఘనంగా సన్మానించారు.  కార్యక్రమంలో సర్పంచులు కుమ్రం నానేశ్వర్‌, తులసీరాం, జగనాథ్‌, నారాయణ, టీఆర్‌ఎస్‌ నాయకులు సెండే నారాయణ, సక్కారాం, ఖుత్బోద్దీన్‌, కుమ్రం భీంరావ్‌ పాల్గొన్నారు.  


తిర్యాణి: మండల కేంద్రంలోని మండల పరిషత్‌ కార్యాలయ సమావేశ మందిరంలో ఆదివారం తిర్యాణి సహకార సంఘం చైర్మన్‌,వైస్‌చైర్మన్‌ ఎన్నికలు నిర్వహించారు. చైర్మన్‌ కోసం టీఆర్‌ఎస్‌ బలపర్చిన అభ్యర్థి చుంచు శ్రీనివాస్‌ను 7వ వార్డు డైరెక్టర్‌ కల్వచర్ల బాపు ప్రతిపాదించాడు. వైస్‌చైర్మన్‌ కోసం చుంచు శ్రీనివాస్‌ను 4వ వార్డు డైరెక్టర్‌ అమరిశెట్టి వెంకటేశం ప్రతిపాదించగా ముత్యం బుచ్చన్న బలపర్చారు. వీరికి ఎవరు పోటీ రాకపోవడంతో చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి తిరుమలేశ్వర్‌ ప్రకటించారు.  అనంతరం నూతనంగా ఎన్నికైన చైర్మన్‌, వైస్‌చైర్మన్‌లను ఎంపీపీ మర్సుకోల శ్రీదేవి, టీఆర్‌ఎస్‌ జిల్లా నాయకుడు హన్మండ్ల జగదీశ్‌, జడ్పీటీసీ ఆత్రం చంద్రశేఖర్‌, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షులు బొమ్మగోని శంకర్‌ గౌడ్‌, ఎస్‌ఐ రామారావు వారికి పూలమాల లు వేసి శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు.


logo