రఘునాథపాలెం, మే 28: ఖమ్మం జిల్లా వైరా మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి బానోతు మదన్‌లాల్‌కు అశ్రునయనాల మధ్య కన్నీటి వీడ్కోలు పలికారు. హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రిలో అనారోగ్యంతో చికిత్స పొందుతున్న ఆయనకు గుండెపోటు రావడంతో సోమవారం అర్థరాత్రి మృతిచెందిన విషయం విదితమే. ఆయన మృతదేహాన్ని కుటుంబ సభ్యులు మంగళవారం ఖమ్మంలోని స్వగృహానికి తరలించగా పలువురు బీఆర్ఎస్ నేతలు, నాయకులు సందర్శించి నివాళులర్పించారు.
బుధవారం ఉదయం మదన్‌లాల్ పార్థీవదేహాన్ని డప్పుచప్పుళ్ల నడుమ స్వగ్రామమైన రఘునాథపాలెం మండలం ఈర్లపూడి గ్రామానికి తీసుకెళ్లారు. అక్కడ ప్రజల సందర్శనార్థం ఉంచగా.. వైరా నియోజకవర్గానికి చెందిన నాయకులు, అభిమానులు, బంధువులు, చుట్టుపక్కల గ్రామాలు, తండాల ప్రజలు సందర్శించి భౌతికకాయానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. దీంతో ఈర్లపూడి గ్రామం జనసంద్రంగా మారింది.
మధ్యాహ్నం అంత్యక్రియల నిమిత్తం పార్థీవదేహాన్ని తరలిస్తుండగా కుటుంబ సభ్యులు, అభిమానులు తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు. రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌లు మదన్‌లాల్ పాడె మోశారు. ఆ తర్వాత వైకుంఠ రథంపై పార్థీవదేహాన్ని ఉంచి నిర్వహించిన అంతిమయాత్ర గ్రామ శివారు వరకు కొనసాగింది. వైకుంఠ రథం ఎక్కిన వద్దిరాజు, అజయ్ కడవరకూ సాగారు. గ్రామ శివారులోని వైకుంఠధామంలో కుటుంబ సభ్యులు మదన్‌లాల్ అంత్యక్రియలు పూర్తి చేశారు.
కన్నీటి పర్యంతమైన అభిమానులు
మదన్‌లాల్ మరణవార్త తెలుసుకున్న అభిమానులు, బీఆర్ఎస్ శ్రేణులు కడసారి చూపు కోసం వైరా నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఆయన పార్థీవదేహాన్ని చూసి తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు. అందరినీ ప్రేమ, ఆప్యాయతలతో పలకరిస్తూ మాట్లాడే వ్యక్తి, మంచి గుణం ఉన్న ప్రజానేత మృతిచెందడంతో కన్నీరు పెట్టుకున్నారు. వైరా నియోజకవర్గానికి ఆయన చేసిన సేవా, అభివృద్ధి కార్యక్రమాలను గుర్తు చేసుకున్నారు.
ప్రముఖుల నివాళి
మదన్‌లాల్ పార్థీవదేహానికి పలువురు ప్రముఖులు నివాళులర్పించి, కుటుంబ సభ్యులను ఓదార్చారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు, మాజీ ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, తాటి వెంకటేశ్వర్లు, బానోతు హరిప్రియ, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఏనుగుల రాకేశ్‌రెడ్డి, భద్రాద్రి జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ దిండిగల రాజేందర్, ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య, ట్రైకార్ చైర్మన్ బెల్లయ్యనాయక్, డీసీసీబీ మాజీ చైర్మన్ కూరాకుల నాగభూషణం,
బీఆర్ఎస్ ఖమ్మం నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు, సుడా మాజీ చైర్మన్ బచ్చు విజయ్‌కుమార్, బీఆర్ఎస్ నాయకులు అజ్మీరా వీరూనాయక్, మాదంశెట్టి హరిప్రసాద్, గుత్తా రవి, మెంటెం రామారావు, పిన్ని కోటేశ్వరరావు, చెరుకూరి ప్రదీప్, కార్పొరేటర్లు కూరాకుల వలరాజు, నాగండ్ల కోటి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మానుకొండ రాధాకిషోర్, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు గోపాల్‌రెడ్డి, ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మువ్వా విజయ్‌బాబు మదన్‌లాల్ పార్థీవదేహానికి నివాళులర్పించారు.
Khammam1