రుణ ప్రణాళిక జాడేది ?
పంటల సీజన్ ప్రారంభమై రెండు నెలలైనా జిల్లాలో రుణ ప్రణాళిక జాడలేకుండా పోయింది. ఇప్పటికే రావాల్సిన రైతుబంధు పంటల సాయం రాకపోవడం, ఇటు బ్యాంకుల నుంచి పంట రుణాలు అందకపోవడం వంటి కారణాలతో అన్నదాతలు అరిగోస పడుతున్నారు.
- పంటల సీజన్ ప్రారంభమై రెండు నెలలైనా ఊసేలేదు
- అటు రైతుబంధు రాక.. ఇటు పంట రుణాలు లేక ఇక్కట్లు
- చివరికి వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్న జిల్లా రైతులు
ఖమ్మం, జూలై 24 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : పంటల సీజన్ ప్రారంభమై రెండు నెలలైనా జిల్లాలో రుణ ప్రణాళిక జాడలేకుండా పోయింది. ఇప్పటికే రావాల్సిన రైతుబంధు పంటల సాయం రాకపోవడం, ఇటు బ్యాంకుల నుంచి పంట రుణాలు అందకపోవడం వంటి కారణాలతో అన్నదాతలు అరిగోస పడుతున్నారు. చివరికి అధిక వడ్డీ అయినప్పటికీ వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తూ ఇక్కట్లు పడుతున్నారు. సాధారణంగా వ్యవసాయ సీజన్‌కు ముందుగా జిల్లా యంత్రాంగం జిల్లాస్థాయి బ్యాంకర్లతో కలిసి పంట రుణాల ప్రణాళిక తయారు చేస్తుంటుంది.
దానికి అనుగుణంగా బ్యాంకులన్నీ రైతులకు పంట రుణాలు ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఈ సంవత్సరం వానకాలం సీజన్ ప్రారంభమై దాదాపు రెండు నెలలవుతోంది. కానీ.. ఇప్పటివరకూ లీడ్ బ్యాంక్ అధికారులు పంట రుణ ప్రణాళికను ప్రకటించలేదు. దీంతో అదునులో ఉన్న అన్నదాతలకు పంట రుణాలు అందని ద్రాక్షగానే మిగిలిపోతున్నాయి. ఏటా వానకాలం సీజన్‌కు ముందు ఆ సంవత్సరంలోని వానకాలం, యాసంగి పంటలకు ఏయే బ్యాంకులు ఎంతమేర పంట రుణాలు, ఎంతమంది రైతులకు ఇవ్వబోతున్నాయో అనే వివరాలను జిల్లా అధికారులు సేకరిస్తారు. అందుకు అనుగుణంగా లీడ్ బ్యాంకు అధికారులతో కలిసి ప్రణాళికను సిద్ధం చేస్తారు. కానీ.. ఈ ఏడాది ఆ ప్రక్రియ ఇంతవరకూ మొదలుకాలేదు.
3 లక్షల ఎకరాల్లో పంటల సాగు
నిరుటి వానకాలం, యాసంగి సీజన్లలో జిల్లాలో ఆశించిన మేర వర్షపాతం నమోదు కాలేదు. దీంతో ఆశించిన మేర పంటల సాగు జరగలేదు. ఈ సీజన్ ఆరంభంలోనూ ఆశించిన మేర వర్షపాతం నమోదు కాకపోయినప్పటికీ జూలై ఆరంభం నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఈ సీజన్లోనైనా సాగు సమృద్ధిగా జరగాలనే ఉద్దేశంతో రైతులందరూ సాగు పనుల్లో నిమగ్నమై ఉన్నారు. అందుకు అనుగుణంగానే ఇప్పటికే జిల్లాలో రికార్డు స్థాయిలో 3 లక్షల ఎకరాల్లో రైతులు వివిధ పంటలను సాగు చేస్తున్నారు.
ప్రధాన పంటలుగా 1.85 లక్షల ఎకరాల్లో పత్తి, 60 వేల ఎకరాల్లో వరి సాగవుతున్నాయి. ఆ తర్వాతి స్థానాల్లో మిగతా పంటలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం జిల్లాలో సాగర్ ఆయకట్టులోనూ వరిసాగు పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. సాగు పనులు ఇంత జోరుగా ఉన్నప్పటికీ పంటల పెట్టుబడి విషయంలో ప్రభుతం నుంచి స్పందన కరువైంది. ఒకవైపు ఇంత వరకూ రైతుభరోసా సాయాన్ని ఇవ్వకపోవడం, మరోవైపు బ్యాంకుల నుంచి పంటల రుణాలనూ అందించకపోవడం వంటి కారణాలతో అన్నదాతల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.
రైతుబంధు రాక.. పంట రుణాలు లేక
సీజన్‌కు రూ.5 వేల చొప్పున రెండు సీజన్లకు కలిపి ఎకరానికి రూ.10 వేలను గత కేసీఆర్ ప్రభుత్వం గడిచిన 11 దఫాలుగా అందిస్తూ వచ్చింది. సీజన్‌కు ముందుగానే ఆ సీజన్ పంటల పెట్టుబడి సాయాన్ని రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసేది. కానీ.. ఇటీవల అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. సీజన్‌కు రూ.7,500 చొప్పున ఎకరానికి రూ.15 వేలను రైతుభరోసా పేరిట ఇస్తానంటూ హామీ ఇచ్చింది. కానీ.. అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు అవుతున్నా, వానకాలం పంటల సీజన్ మొదలై రెండు నెలలు గడుస్తున్నా రైతు భరోసాను అందించిన పాపాన పోలేదు. మరోవైపు రుణ ప్రణాళిక ప్రకటించి బ్యాంకుల నుంచి రుణాలనూ అందించడం లేదు. దీంతో రైతుబంధు రాక, పంట రుణాలు అందక అన్నదాతల వేదన అరణ్యరోదనగానే మిగిలిపోతోంది. ఇంకోవైపు పంట రుణాల కోసం బ్యాంకుల వద్దకు వెళ్లిన రైతులకు.. బ్యాంకు అధికారులు రుణమాఫీ లింకు పెడుతున్నారు. రుణమాఫీ విషయం తేలాకే చూద్దామంటూ తిప్పి పంపిస్తున్నారు.
వారం రోజుల్లో ప్రకటిస్తాం..
పంటల రుణ ప్రణాళిక వివరాలను వారం రోజుల్లోపు ప్రకటిస్తాం. కొద్దిరోజుల క్రితం డిస్ట్రిక్ట్ క్రెడిట్ ప్లాన్(డీసీపీ) సమావేశం జరగాల్సి ఉంది. కానీ.. అనివార్య కారణాల వల్ల నిర్వహించలేకపోయాం. ఇప్పటికే బ్యాంకుల ద్వారా వివరాలు సేకరించాం. వారం రోజుల్లో పూర్తి నివేదికతో జిల్లా రుణ ప్రణాళికను కలెక్టర్ విడుదల చేస్తారు. తద్వారా రైతులకు త్వరితగతిన రుణాలు అందేలా చర్యలు తీసుకుంటాం.
-శ్రీనివాసరెడ్డి, ఖమ్మం జిల్లా లీడ్ బ్యాంకు మేనేజర్
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

