హరితహారంపై నీలినీడలు
పర్యావరణ పరిరక్షణ కోసం.. భవిష్యత్ తరాల కోసం పచ్చదనాన్ని పెంచేందుకు కంకణం కట్టుకున్న రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ 2015లో హరితహారం కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టి లక్ష్యాన్ని నిర్దేశించి విడతల వారీగా అమలు చేశారు. ఊరూరా నర్సరీల్లో పండ్లు, పూలు, నీడనిచ్చే మొక్కలను పెంచుతూ..
- నాటిన మొక్కలను గాలికొదిలేసిన కాంగ్రెస్ సర్కార్
- ఏపుగా పెరిగిన మొక్కలకు నీరందక ఎండిపాయె..
- జిల్లావ్యాప్తంగా పచ్చదనాన్ని పెంచిన గత కేసీఆర్ ప్రభుత్వం
- ఐదు నెలలుగా పర్యవేక్షించేవారు లేక మాడిపోతున్న పరిస్థితి
- తొమ్మిదేళ్లలో 13.89 కోట్ల మొక్కలు నాటితే.. ఇప్పుడు 50 శాతం కనుమరుగు
ఖమ్మం, మే 31 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : పర్యావరణ పరిరక్షణ కోసం.. భవిష్యత్ తరాల కోసం పచ్చదనాన్ని పెంచేందుకు కంకణం కట్టుకున్న రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ 2015లో హరితహారం కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టి లక్ష్యాన్ని నిర్దేశించి విడతల వారీగా అమలు చేశారు. ఊరూరా నర్సరీల్లో పండ్లు, పూలు, నీడనిచ్చే మొక్కలను పెంచుతూ.. నిరంతరం వాటికి ట్యాంకర్ల ద్వారా నీరందిస్తూ ప్రతి వర్షాకాలంలో మొక్కలు నాటేందుకు వివిధ శాఖల అధికారులను భాగస్వాములను చేశారు. ఖాళీ ప్రదేశాలు, పొలం గట్లు, రహదారులకు ఇరువైపులా మొక్కలు నాటడాన్ని పండుగలా చేపట్టారు. నాటిన మొక్కలకు నీరందించే బాధ్యతను పంచాయతీలు, మున్సిపాలిటీ సిబ్బంది చేపట్టేలా చేశారు. జిల్లావ్యాప్తంగా తొమ్మిదేళ్ల కాలంలో సుమారు 13.86 కోట్ల మొక్కలు నాటారు. గత కేసీఆర్ ప్రభుత్వం అధికారంలో ఉన్నన్ని రోజులు అధికారులు, సిబ్బంది నాటిన మొక్కలను కంటికి రెప్పలా కాపాడారు. కానీ.. కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన ఐదు నెలల్లోనే మొక్కలకు నీరందించేవారు కరువయ్యారు. మండుతున్న ఎండలతోపాటు నాటిన మొక్కలకు నీరందక మలమలమాడిపోతున్నాయి.
మొక్కల పట్టింపులేని కాంగ్రెస్ సర్కార్
ప్రధానంగా రాష్ట్ర, జాతీయ రహదారుల వెంట ఎవెన్యూ ప్లాంటేషన్లు గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేశారు. పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో గ్రామీణ రహదారుల వెంట మొక్కలను విరివిగా నాటారు. కానీ.. నాటిన మొక్కలను కాపాడే విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దగా దృష్టి సారించడం లేదనే విమర్శలు వస్తున్నాయి. క్షేత్రస్థాయిలో అధికారులు, సిబ్బంది వాటి గురించి పట్టించుకోకపోవడంతో నాటిన మొక్కలన్నీ ఎండిపోతున్నాయి. రహదారుల వెంట మొదటి విడతలో నాటిన మొక్కలు చెట్లుగా మారడంతో వాటిని నరికివేసినా పట్టించుకునేవారు కరువయ్యారు. కొన్నిచోట్ల విద్యుత్ శాఖ అధికారులు చెట్ల కొమ్మలు విద్యుత్ తీగలకు తాకుతున్నాయనే నెపంతో విచక్షణా రహితంగా కొట్టివేస్తున్నారు.
పల్లె ప్రకృతి వనాలు, పార్కుల్లో కనిపించని పచ్చదనం
జిల్లాలో గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో 751 గ్రామాల్లోని పల్లె ప్రకృతి వనాల్లో 12.89 కోట్ల మొక్కలను నాటారు. అర్బన్ పార్కుల్లో సుమారు కోటి మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. ప్రతి మండలంలో 10 ఎకరాల్లో బృహత్ పల్లె ప్రకృతి వనాలు ఉండాలన్న సంకల్పంతో ప్రభుత్వం మొక్కలు విరివిగా నాటితే.. ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో వాటి ఆలనా పాలనా చూసే నాధుడే లేడు. మొక్కలు నాటే కార్యక్రమానికి గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో జిల్లావ్యాప్తంగా రూ.50 కోట్లు కేటాయించి ప్రత్యేక చర్యలు చేపట్టారు. అన్ని పంచాయతీల పరిధిలోని నర్సరీల్లో ప్రస్తుతం 50 లక్షల మొక్కలు పెరుగుతున్నాయి. కానీ.. రాష్ట్ర ప్రభుత్వం హరితహారం పథకం అమలుపై ఎలాంటి మార్గదర్శకాలు అధికారులకు జారీ చేయలేదు. దీంతో పెంచిన మొక్కలు నాటాలా.. వద్దా.. అనే సందేహం అధికారుల్లో తలెత్తుతోంది. ఇప్పటికే డీఆర్డీఏ, మైనింగ్, పరిశ్రమలు, అటవీ, పంచాయతీరాజ్ శాఖలకు నిర్దేశిత లక్ష్యాలను గత కేసీఆర్ ప్రభుత్వం జారీ చేసినప్పటికీ ప్రస్తుత ప్రభుత్వం అది అమలు చేస్తుందా? లేదా? అనేది తెలియాల్సి ఉంది.
ఐదు నెలలాయె.. నీళ్లందవాయె..!
- రోడ్ల వెంట నాటిన మొక్కలకు ఆలనాపాలనా కరువు
- కొన్నిచోట్ల నీరందక ఎండిపోతున్నా పట్టించుకోరు..
- పల్లె ప్రకృతి వనాలు, క్రీడా ప్రాంగణాల్లో నాటిన మొక్కలకు దిక్కేలేదు..
- పలుచోట్ల కరెంటు తీగలకు అడ్డొస్తున్నాయని నరికివేస్తున్న విద్యుత్ సిబ్బంది
భద్రాద్రి కొత్తగూడెం, మే 31 (నమస్తే తెలంగాణ) : ఊళ్లను వనాలు చేయాలనే లక్ష్యంతో గత కేసీఆర్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా హరితహారం కార్యక్రమాన్ని చేపట్టి విడతల వారీగా లక్ష్యాలను నిర్దేశించి మొక్కలు నాటింది. నాటిన మొక్కలు ఏపుగా పెరిగేందుకు పంచాయతీల పరిధిలో నిరంతరం నీరందిస్తూ పచ్చదనంతో కళకళలాడేలా చేసింది. అంతేకాక పల్లె ప్రకృతి వనాలు, క్రీడా ప్రాంగణాల్లో తీరొక్క మొక్కలు నాటి పచ్చదనాన్ని పరిఢవిల్లేలా చేసింది. కానీ.. ఐదు నెలల కాంగ్రెస్ ప్రభుత్వం.. గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో హరితహారం కార్యక్రమంలో నాటిన మొక్కలకు, పల్లె ప్రకృతి వనాలు, క్రీడా ప్రాంగణాల్లో నాటిన మొక్కలకు నీరందించలేని స్థితిలో ఉన్నది. దీంతో మొక్కలన్నీ ఎండిపోయి మోడుగా దర్శనమిస్తున్నాయి. అక్కడక్కడ రోడ్ల వెంట మొక్కలకు నామమాత్రంగా నీళ్లు పోస్తూ చేతులు దులుపుకుంటున్నారు.
ఎండిపోతున్న పల్లె పకృతి వనాలు
గత కేసీఆర్ ప్రభుత్వం జిల్లాలోని 481 గ్రామ పంచాయతీల్లో 1,100కు పైగా పల్లె ప్రకృతి వనాలను అట్టహాసంగా ఏర్పాటు చేసింది. వాటి ఆల నా పాలనా చూసుకోవడంతోపాటు నిరంతరం నీరందించడంతో పచ్చదనాన్ని సంతరించుకున్నా యి. కానీ.. చుంచుపల్లి, సుజాతనగర్, పాల్వంచ, టేకులపల్లి, గుండాల, చర్ల, భద్రాచలం, పినపాక, అశ్వారావుపేట మండలాల్లో వాటి నిర్వహణ కరువైంది. దీంతో మొక్కలన్నీ ఎండిపోయే దశకు చేరాయి. సుజాతనగర్‌లోని ప్రకృతి వనానికి గేట్ ఊడిపోవడంతో పశువులు వెళ్లి మొక్కలను తినేస్తుండడంతో ప్రకృతి వనం కళ తప్పింది.
విద్యుత్ తీగలకు అడ్డొస్తున్నాయని..
విద్యుత్ తీగలకు అడ్డొస్తున్నాయనే సాకుతో ఏపుగా పెరిగిన హరితహారం మొక్కలపై విద్యుత్ శాఖ అధికారులు వేటు వేస్తున్నారు. మూడు నెలల నుంచి విద్యుత్ శాఖ సిబ్బంది రహదారుల వెంట ఉన్న పెద్ద పెద్ద కొమ్మలను నరికి వేస్తున్నారు. దీంతో రోడ్ల వెంట పచ్చదనం కనుమరుగైంది.
బృహత్ పల్లె ప్రకృతి వనాల్లో మొక్కలేవి?
జిల్లావ్యాప్తంగా ఒక్కో మండలంలో 8 నుంచి పది ఎకరాల విస్తీర్ణంలో 110 బృహత్ పల్లె ప్రకృతి వనాలను గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేశారు. వాటిలో పూర్తిస్థాయిలో స్థలం లేకపోవడంతో 105 వరకే అందుబాటులోకి తెచ్చారు. కానీ.. వాటిలో ఏపుగా పెరిగిన మొక్కలకు నీరందక ఎండిపోయాయి. దీంతోపాటు జిల్లాలో 1,280 క్రీడా ప్రాంగణాల ఏర్పాటుకు స్థలం సేకరించగా.. అందులో 686 ప్రాంగణాలకు స్థలం దొరికింది. అయితే నిర్వహణ లేకపోవడంతో ఆయా ప్రాంగణాల్లో నాటిన మొక్కలన్నీ పశువుల పాలయ్యాయి. 90,394 మొక్కలు క్రీడా ప్రాంగణాల్లో ఉండాల్సి ఉండగా.. అందులో అనుకున్న స్థాయిలో మొక్కలు లేకపోవడంపై క్రీడాకారులు పెదవి విరుస్తున్నారు.
ప్రత్యేకంగా నిధులు కేటాయించాలి
గత కేసీఆర్ ప్రభుత్వం హరితహారం కార్యక్రమంపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఏటా గ్రామ పంచాయతీల్లో నర్సరీలు ఏర్పాటు చేసి మొక్కలను పెంచి ఇంటింటికీ ఆరు మొక్కల చొప్పున అందించారు. అలాగే రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటించారు. రోజూ వాటికి నీరు పోయడంతో పచ్చగా ఏపుగా ఎదిగాయి. ప్రస్తుతం వాటికి రక్షణగా చుట్టూ కంచెలు లేకపోవడం, నీరందించకపోవడంతో ఎండిపోతున్నాయి. ఎండిపోయిన మొక్కల ప్రదేశంలో మళ్లీ మొక్కలు నాటడం లేదు. ప్రభుత్వం మొక్కల అభివృద్ధికి ప్రత్యేకంగా నిధులు కేటాయించి వాటిని కాపాడాలి. -జల్లిపల్లి శ్రీరామ్మూర్తి, ఎంపీపీ, అశ్వారావుపేట
నిరంతరం నీళ్లు పోస్తున్నారు
పంచాయతీ సిబ్బంది హరితహారం మొక్కలకు ప్రతి రోజు నీళ్లు పోస్తున్నారు. పల్లె ప్రకృతి వనాల్లో మొక్కల నిర్వహణ గురించి ఎంపీవోలతో మాట్లాడతాను. ఎక్కడ బాగాలేదో చూస్తాను. అన్ని పంచాయతీల్లో పంచాయతీ, ఈజీఎస్ సిబ్బంది వాటి నిర్వహణ చూస్తున్నారు. ఎక్కడైనా మొక్కలకు నీరందకపోతే ఎంపీవోలతో మాట్లాడి చూడమని చెబుతాను.
-చంద్రమౌళి, డీపీవో, భద్రాద్రి కొత్తగూడెం
‘హరిత’ మొక్కలకు దిక్కులేదు
గత కేసీఆర్ పాలనలో పల్లె ప్రకృతి వనాలు, రోడ్ల వెంట, ఖాళీ ప్రదేశాల్లో మొక్కలు నాటడంతోపాటు వాటిని కంటికి రెప్పలా కాపాడుకున్నాం. పచ్చదనంతో కళకళలాడుతుంటే మళ్లీ మళ్లీ చూడాలనిపించేది. కానీ.. ఇప్పటి ప్రభుత్వం రోడ్ల వెంట నాటిన మొక్కలను, ప్రకృతి వనాల్లోని మొక్కలను గాలికి వదిలేసింది. రోడ్ల వెంట నాటిన మొక్కలకు రక్షణ లేక పశువులు మేస్తున్నాయి. ప్రకృతి వనాల్లో మొక్కలకు నీరు లేక ఎండిపోయి దర్శనమిస్తున్నా పట్టించుకునేవారు లేరు.
-తేజావత్ తావునాయక్, మాజీ సర్పంచ్, పెనుబల్లి
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

