ఖమ్మం, జనవరి 19: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ తిరుగులేని శక్తిగా ఉందని ఎమ్మెల్సీ, పార్టీ జిల్లా అధ్యక్షుడు తాతా మధుసూదన్ పేర్కొన్నారు. బుధవారం నాటి ఖమ్మం సభ ద్వారా ఈ విషయం మరోసారి రుజువైందని స్పష్టం చేశారు. ఖమ్మంలోని పార్టీ జిల్లా కార్యాలయమైన తెలంగాణ భవన్లో గురువారం చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా 50 ఏండ్ల చరిత్రలో ఎన్నడూ ఇలాంటి సభ జరుగలేదని, ఈ సభ ఇక చిరస్థాయిగా నిలిచిపోతుందని అన్నారు.
ఈ సభ ద్వారా ప్రజాతంత్ర, లౌకిక, వామపక్ష శక్తులకు బీఆర్ఎస్ కొత్త ఊపు ఇచ్చినట్టయిందన్నారు. జిల్లాపై నమ్మకంతో సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ తొలి సభను ఇక్కడ ఏర్పాటు చేశారని అన్నారు. అందుకు కృతజ్ఞతగా లక్షలమంది ప్రజలు హాజరై సభను విజయవంతం చేశారని అన్నారు. సభను సక్సెస్ చేసిన వారందరికీ జిల్లా పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నామని అన్నారు. తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, కర్ణాటక, ఒడిశా రాష్ర్టాల నుంచి వేలాది మంది ప్రజలు ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేసుకొని సభకు తరలి వచ్చారని అన్నారు. సభకు 5 లక్షలకు మించి ప్రజలు హాజరయ్యారని, మహాకుంభ మేళాను తరలివచ్చేలా ప్రజలు పయనమై వచ్చారని అన్నారు.ఈ సభ విజయవంతానికి పది రోజులుగా చెమటోడ్చిన శ్రేణులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నామని అన్నారు.
సీఎం కేసీఆర్ పిలుపుమేరకు వారం రోజులపాటు జిల్లాలోనే ఉండి, అందరు ఎమ్మెల్యేలను, నేతలను సమన్వయం చేసుకొని, సభ ఇన్చార్జిగా వ్యవహరించి అన్నీ తానైన రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్యశాఖల మంత్రి హరీశ్‌రావుకు స్పెషల్ థ్యాంక్స్ చెబుతున్నామన్నారు. అలాగే మంత్రి అజయ్‌కుమార్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎంపీలు నామా నాగేశ్వరరావు, బండి పార్థసారథిరెడ్డి, వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్యేలు, జిల్లా నేతలందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. సభకు లక్షలాదిమంది ప్రజలు స్వచ్ఛందంగా తరలిరావడంతో సీఎం కేసీఆర్ చాలా సంతోషం వ్యక్తం చేశారని అన్నారు.
ఇందుకోసం జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులకు సీఎం స్వయంగా ఫోన్ చేసి మరీ అభినందనలు తెలిపారని వివరించారు. ఇదే స్ఫూర్తిని మున్ముందూ కొనసాగించాలని సీఎం చెప్పారని అన్నారు. తదుపరి ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలోని పది స్థానాలనూ గెలుస్తామని స్పష్టం చేశారు. నూతన కలెక్టరేట్ ప్రారంభోత్సవానికి పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేసిన కలెక్టర్ గౌతమ్‌కు, ఇతర అధికారులకు అభినందనలు తెలుపుతున్నామన్నారు.
దురదృష్టవశాత్తూ ముదిగొండ మండలం చిరుమర్రి గ్రామానికి చెందిన గడ్డమీది ఉపేందర్‌రావు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడని, ఆయన మరణం బాధాకరమని అన్నారు. అతడి కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నేతలు పునుకొల్లు నీరజ, బచ్చు విజయ్‌కుమార్, ఆర్జేసీ కృష్ణ, పగడాల నాగరాజు, కూరాకుల నాగభూషణం, కమర్తపు మురళి, లక్ష్మీప్రసన్న, బెల్లం వేణు, ఖమర్, చింతనిప్పు కృష్ణచైతన్య, ఉప్పల వెంకటరమణ, శేషు తదితరులు పాల్గొన్నారు.