కొత్తగూడెం సింగరేణి, జూలై 17 : తమ హక్కులను అమలు చేయడంతోపాటు సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ సింగరేణి సులభ్ వర్కర్స్ యూనియన్(ఇఫ్టూ) ఆధ్వర్యంలో కార్మికులు కొత్తగూడెం సింగరేణి హెడ్డాఫీసు ఎదుట శుక్రవారం ధర్నా చేపట్టారు. సులభ్ కాంప్లెక్స్‌లలో వినియోగించే టాయిలెట్ బ్రెష్‌లు, బకెట్లు, చీపుర్లతో వినూత్న నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఇఫ్టూ కొత్తగూడెం రీజియన్ కార్యదర్శి సంజీవ్ అధ్యక్షతన జరిగిన ధర్నానుద్దేశించి ఇఫ్టూ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, సులభ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకన్నలు మాట్లాడుతూ యాజమాన్యం అనేక ఏళ్లుగా తమను తీవ్ర అన్యాయానికి గురిచేస్తోందని ఆరోపించారు.
కర్మచారి కాంట్రాక్టు కార్మికులకు ఉజ్వల్ శానిటైజేషన్ సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ సంస్థ ఈఎస్ఐ, పీఎఫ్, బోనస్ అమలు చేస్తామని ముందుకొస్తే ఆ సంస్థకు యాజమాన్యం టెండర్ ఇవ్వడం లేదన్నారు. సింగరేణి సంస్థ ఒక్కో సులభ్ కాంప్లెక్స్‌కు రూ.25 వేలు చెల్లిస్తుంటే.. సులభ్ సంస్థ మాత్రం రూ.16 వేలు ఖర్చు పెట్టి.. రూ.9 వేలు మిగుల్చుకుంటోందని, దీంతో ఆ సంస్థకు కోట్లు మిగులుతున్నాయని ఆరోపించారు. అలాగే కార్మికులు వృత్తి సంబంధమైన వ్యాధులు, సహజ మరణం చెందితే రూ.20 లక్షలు ఎక్స్‌గ్రేషియా అమలు చేయాలని, ప్రమాద బీమా వర్తింపజేయాలని కోరారు. అనంతరం జీఎం పర్సనల్(ఐఆర్) అజయ్‌కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో నాయకులు సీతారామయ్య, బ్రహ్మానందం, గౌని నాగేశ్వరరావు, కాపు కృష్ణ, ఎండీ జాఫర్, తాళ్లపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు.