మధిర రూరల్/ కొత్తగూడెం గణేశ్‌టెంపుల్/ ఖమ్మం అర్బన్/ ఖమ్మం రూరల్, ఆగస్టు 20: జీవో నంబర్ 97ను రద్దు చేయాలని, శక్తి పాలసీని వెనకి తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ నాయకులు, విద్యార్థులు డిమాండ్ చేశారు. ఎస్బీటెట్ స్వయం ప్రతిపత్తి, విద్యార్థుల ప్రయోజనాల పరిరక్షణ కోసం ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన పాలిటెక్నిక్ కళాశాలల బంద్‌లో భాగంగా మధిర, కొత్తగూడెం పాలిటెక్నిక్ కళాశాలల్లో కూడా విద్యార్థులు గురువారం బంద్ పాటించి కళాశాలల ఎదుట నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా నాయకులు, విద్యార్థులు మాట్లాడుతూ.. ప్రభుత్వం ఇప్పటికైనా తన మొండివైఖరి వీడి జీవో 97 రద్దుచేసి, శక్తి పాలసీని ఉపసంహరించుకోకపోతే పోరాటాలను మరింత తీవ్రతరం చేస్తామని స్పష్టం చేశారు. అలాగే, ఖమ్మంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు ఖమ్మం ఆర్అండ్బీ అతిథిగృహం వద్ద ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన తెలిపారు. ఖమ్మం రూరల్ మండలంలోని శ్రీచైతన్య ఇంజినీరింగ్ కాలేజీ ఎదుట ఎస్ఎఫ్ఐ నాయకులు, విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు. నేతలు, విద్యార్థులు పాల్గొన్నారు.