దమ్మపేటరూరల్, ఫిబ్రవరి 14: పామాయిల్ నర్సరీ నిర్వహణకు ఇండియన్ ఇనిస్ట్యూట్ ఆఫ్ ఆయిల్ ఫామ్ రిసెర్చ్(ఐఐఓపీఆర్) కొత్త మార్గదర్శకాలను సూచించింది. ఐఐఓపీఆర్ శాస్త్రవేత్తల ఈ ముందడగుతో హాఫ్ టైప్ మొక్కలు, నాసిరకం మొక్కలు ఇక రైతుల దరచేరవు. తెలంగాణ ఆయిల్‌ఫెడ్ పరిధిలోని రైతులకు ఆయిల్‌ఫెడ్ నర్సరీల నుంచి వందల ఎకరాలకు హాఫ్టైప్ మొక్కలు చేరడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.
ఈ విషయమై ప్రభుత్వరంగ సంస్థ ఆయిల్‌ఫెడ్ యాజమాన్యం, తెలంగాణ ఉద్యానశాఖలకు రైతులు మొరపెట్టినా పట్టించుకోవడం లేదు. హాఫ్టైప్ మొక్కల సమస్యతో ఖమ్మంజిల్లాకు చెందిన ఓ రైతు న్యాయ పోరాటం ప్రారంభించాడు. నాసిరకం మొక్కలతో రైతులు ఆర్థికంగా నష్టపోవడంతోపాటు సదరు పామాయిల్ కంపెనీకి సుమారు 30ఏళ్లపాటు పామాయిల్ గెలలు రాకుండా నష్టం కలుగుతున్నదని వ్యవసాయశాఖ ముఖ్యనేతకు నిపుణులు చెప్పినా వినడం లేదని తెలుస్తోంది. హాఫ్టైప్ మొక్కలను చూసి కొత్త రైతులు పామాయిల్ సాగుకు ముందుకురారని నేతలు, అధికారుల ఎదుట మొత్తుకున్నా ఫలితం ఉండటం లేదని వాపోతున్నారు.