రఘునాథపాలెం, జనవరి17: ఖమ్మం శివారులోని వైరా ప్రధాన రహదారి పక్కన 22 ఎకరాల సువిశాల ప్రాంగణంలో ఖమ్మం సమీకృత కలెక్టరేట్ అందుబాటులోకి వచ్చింది. బుధవారం కలెక్టరేట్‌ను ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుతో పాటు ఢిల్లీ, పంజాబ్, కేరళ ముఖ్యమంత్రులు అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ మాన్, పినరయి విజయన్, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్‌తో కలిసి ప్రారంభించనున్నారు. సోమవారం కలెక్టర్ వీపీ గౌతమ్, సీపీ విష్ణు ఎస్ వారియర్ మాక్ ప్లాన్‌పై చర్చించారు. రాష్ట్ర భద్రతా అధికారులకు వివరించారు.
ప్రణాళిక ఇలా..
ముందుగా అతిథులు కలెక్టరేట్ ప్రధాన ద్వారం వద్ద రిబ్బన్ కట్ చేసి లోపలికి ప్రవేశిస్తారు. గ్రౌండ్ ఫ్లోర్ ఆగ్నేయంలో ఉన్న కలెక్టర్ చాంబర్‌ను ప్రారంభిస్తారు. కలెక్టర్ వీపీ గౌతమ్‌ను సీఎం కేసీఆర్ స్వయంగా కుర్చీలో కూర్చోబెట్టి పరిపాలనా బాధ్యతలు అప్పగిస్తారు. సీఎం కేసీఆర్‌తో మరో ముగ్గురు ముఖ్యమంత్రులు కేజ్రీవాల్, భగవంత్‌మాన్, విజయన్‌తో కలిసి ‘కంటి వెలుగు’ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. కార్యక్రమ ప్రధాన ఉద్దేశాన్ని సీఎం కేసీఆర్ వారికి వివరిస్తారు. తర్వాత మొదటి అంతస్తులోని స్టేట్ చాంబర్‌లోని మంత్రి కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. అక్కడే ఏర్పాటు చేసిన ప్రత్యేక గదిలో విందులో పాల్గొంటారు.
ఏర్పాట్ల పరిశీలన
సమీకృత కలెక్టరేట్‌ను మంగళవారం రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు, రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, ఎంపీలు నామా నాగేశ్వరరావు, వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ పరిశీలించారు. నలుగురు ముఖ్యమంత్రులు కలెక్టరేట్లో కలియదిరిగే ప్రాంతాలను పరిశీలించారు. కంటి వెలుగుకు సంబంధించిన ఏర్పాట్లపై రాష్ట్ర వైద్యారోగ్యశాఖ కమిషనర్ శ్వేత మహంతితో చర్చించారు. అనంతరం అతిథుల భోజనం చేసేందుకు కేటాయించిన గదులను పరిశీలించారు.
ఏర్పాట్లు పూర్తి..
ప్రారంభోత్సవానికి కలెక్టరేట్ లైటింగ్, పూల డెకరేషన్తో ముస్తాబైంది. హైదరాబాద్ నుంచి వచ్చిన 80 మంది యువకులు కలెక్టరేట్లోని ప్రతిశాఖ కార్యాలయాన్ని డెకరేట్ చేశారు. అధికారులు అతిథులు ల్యాండ్ అయ్యేందుకు వీలుగా రెండు హెలీప్యాడ్స్ ఏర్పాటు చేశారు. వీటిలో ఒకటి శాశ్వతంగా ఉండిపోనుండగా మరో హెలీప్యాడ్ తాత్కాలికమైనది. కలెక్టరేట్ ప్రారంభోత్సవం తర్వాత ముందుగా ఆయాశాఖల జిల్లా అధికారులు ప్రత్యేక పూజలు చేసి తమ శాఖ పరిధిలో విధులను ప్రారంభిస్తారు.
గ్రౌండ్ ఫ్లోర్లో
గ్రౌండ్ ఫ్లోర్లో కలెక్టర్ కం జిల్లా మేజిస్ట్రేట్, అడ్మినిస్టేషన్ స్టాఫ్ గదులు, మినీ కాన్ఫరెన్స్ హాల్, రెండు వెయిటింగ్ హాళ్లు, 250 మంది కెపాసిటీతో సమావేశ మందిరం, సహాయ కార్మికశాఖ కమిషనర్, వీడియో కాన్ఫరెన్స్ హాల్, సమాచార సాంకేతిక విభాగం, జిల్లా ఖజానా కార్యాలయం, కలెక్టరేట్ రికార్డ్ రూం, జిల్లా తపాలాశాఖ కార్యాలయం, కంట్రోల్ రూం, సహాయ కమిషనర్, దేవాదాయ శాఖ, ట్రెజరీ గార్డ్ రూం, జిల్లా రెవెన్యూ అధికారి, కలెక్టర్ కార్యాలయ సిబ్బంది-1, కలెక్టరేట్ పరిపాలన అధికారి, అదనపు కలెక్టర్, అదనపు కలెక్టర్ పేషీ, జిల్లా పౌర సంబంధాల అధికారి, సహాయ కల్టెకర్ (శిక్షణ), అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు), కాన్ఫరెన్స్ హాల్, కలెక్టర్ పేషీ గదులు ఉంటాయి.
మంత్రులు, ఎమ్మెల్యేలు వచ్చినప్పుడు కార్యాలయంలో ఉండేందుకు వీలుగా ప్రత్యేక గదులు, చాంబర్లు ఉంటాయి. ప్రతి ఫ్లోర్లో 32 మంది కూర్చునేలా కాన్ఫరెన్స్ హాల్, సిబ్బంది భోజనం చేసేందుకు డైనింగ్ హాల్, స్టోర్, ఎలక్ట్రిక్ రూంలు ఉంటాయి. ముఖ్యమంత్రులు, ఉన్నతాధికారులు ఎమర్జెన్సీ ల్యాండ్ అయ్యేందుకు హెలీప్యాడ్ కూడా ఏర్పాటైంది. కలెక్టర్ ఆవరణలో 16,500 ఫీట్ల సెంట్రల్ గార్డెనింగ్, ప్రతి ఫ్లోర్లో లిఫ్ట్‌లు, నాలుగు మెట్ల ద్వారాలు అందుబాటులోకి వచ్చాయి. ప్రభుత్వ పరంగా సభలు, సమావేశాలు నిర్వహించేందుకు రెండున్నర ఎకరాల స్థలం, కనీసం 200 కార్లు పార్క్ చేసేందుకు వీలుగా విశాలమైన స్థలం అందుబాటులో ఉన్నది.
మొదటి అంతస్తులో..
జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి, జిల్లా ఆసుపత్రుల సమన్వయ అధికారి, ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్, జిల్లా రిజిస్ట్రార్, ఔషధ నియంత్రణ సహాయ సంచాలకుడు, గెజిటెడ్ ఆహార తనిఖీ అధికారి, స్వాన్ వీడియో కాన్ఫరెన్స్ హాల్, జిల్లా వ్యవసాయశాఖ అధికారి, కలెక్టరేట్ కార్యాలయ సిబ్బంది-2, జిల్లా పర్యాటక అభివృద్ధి అధికారి, జిల్లా పట్టణ, గ్రామీణ ప్రణాళిక అధికారి, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి, ముఖ్య ప్రణాళిక అధికారి, స్టేట్ చాంబర్ కార్యాలయాలు ఉంటాయి.
2వ అంతస్తులో..
జిల్లా విద్యాశాఖ అధికారి, జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి, సర్వే, భూమి రికార్డుల సహాయ సంచాలకుడు, జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమలశాఖ అధికారి, గనులు, భూగర్భశాఖ సహాయ సంచాలకుడు, కాన్ఫరెన్స్ హాల్, జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి, జిల్లా షెడ్యూల్డ్ కులాలు, సేవా సహకార అభివృద్ధి సంఘ లిమిటెడ్, జిల్లా తూనికలు, కొలతలశాఖ అధికారి, పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్, జిల్లా మత్స్యశాఖ అధికారి, లీడ్ బ్యాంక్ జిల్లా మేనేజర్, జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి, జిల్లా సంక్షేమశాఖల అధికారి, జిల్లా పంచాయతీ అధికారి, సాంఘిక సంక్షేమ గరుకుల విద్యాలయాలశాఖ అధికారి, షెడ్యూల్డ్ కులాల అభివృద్ధిశాఖ ఉప సంచాలకుడి కార్యాలయాలు ఉంటాయి.