ప్రభుత్వ వైద్యుల పరేషాన్
ఏదైనా జబ్బు చేస్తే రోగులు ఆందోళన చెందడం సహజం. వారికి వైద్యులు మనో నిబ్బరాన్ని కలిగించి సేవలందిస్తుంటారు. కానీ, కాంగ్రెస్ సర్కారులో మాత్రంలో ప్రత్యక్ష దైవాలుగా భాసిల్లుతున్న ప్రభుత్వ వైద్యులు కూడా పరేషాన్ అవుతున్నారు.
- బదిలీల్లో ఇష్టారాజ్యంగా ప్రభుత్వ ఉత్తర్వుల జారీ
- తిరుమలాయపాలెం, వైరాల్లో కానరాని స్పెషలిస్ట్ పోస్టులు
- నాడు 100 బెడ్లకు అప్‌గ్రేడ్ చేసిన కేసీఆర్ ప్రభుత్వం
- నేడు దానిని తుంగలో
- తొక్కిన కాంగ్రెస్ సర్కారు
- దిక్కుతోచని స్థితిలో ఖమ్మం జిల్లా స్పెషలిస్ట్ వైద్యులు
- ముగ్గురు మంత్రులూ దృష్టిసారించడం లేదని ఆవేదన
ఖమ్మం సిటీ, జులై 14: ఏదైనా జబ్బు చేస్తే రోగులు ఆందోళన చెందడం సహజం. వారికి వైద్యులు మనో నిబ్బరాన్ని కలిగించి సేవలందిస్తుంటారు. కానీ, కాంగ్రెస్ సర్కారులో మాత్రంలో ప్రత్యక్ష దైవాలుగా భాసిల్లుతున్న ప్రభుత్వ వైద్యులు కూడా పరేషాన్ అవుతున్నారు. స్పష్టత, ముందుచూపు లేకుండా ఇస్తున్న జీవోలను చూసి అవాక్కవుతున్నారు. ఎక్కడి కెళ్లాలో, ఏ పని చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. గత కేసీఆర్ పదేళ్ల ఏనాడూ ఇంతటి దురదృష్టకర పరిణామాలను ఎదుర్కోలేదని వాపోతున్నారు. ఇంతకూ వారికొచ్చిన కష్టమేంటి? ఎందుకింత మదన పడుతున్నారు? హస్తం పార్టీ పాలకులు ప్రకటించుకున్న ప్రజాపాలనలో తీవ్ర గందరగోళంగా మారిన ప్రభుత్వ వైద్యుల బదిలీలపై ‘నమస్తే తెలంగాణ’ అందిస్తున్న ప్రత్యేక కథనం.
జిల్లాలోని ప్రభుత్వ వైద్యులు పరేషాన్ అవుతున్నారు. ప్రధానంగా వైద్య విధాన పరిషత్‌కు చెందిన వారు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. దీనికి ప్రధాన కారణం ఇటీవల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన బదిలీ ఉత్తర్వులే. ఎంతో ఆవశ్యకమైన వైద్యరంగం పట్ల సానుకూల, శాస్త్రీయ పద్ధతుల్లో నిర్ణయాలు తీసుకోవాల్సి ఉన్నప్పటికీ.. పాలకులు అనాలోచితంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పలు ఏరియా ఆసుపత్రుల్లో స్పెషలిస్ట్ వైద్యుల పోస్టులను కానరాకుండా చేసి.. ఆఫ్షన్లు అడగడం వైద్యులను ఆశ్చర్యానికి గురి చేసింది. వీటిల్లో తిరుమలాయపాలెం, వైరా ఆసుపత్రులున్నాయి.
ఈ రెండింటితోపాటు మధిర, సత్తుపల్లి దవాఖానలను నాటి కేసీఆర్ సర్కారు 100 బెడ్ల ఆసుపత్రులుగా అప్‌గ్రేడ్ చేసింది. నేలకొండపల్లి, కల్లూరు, పెనుబల్లి ఆసుపత్రుల్లో 24 గంటలపాటు సేవలను అందుబాటులోకి తెచ్చింది. ఆ క్రమంలోనే తిరుమలాయపాలెం, వైరా దవాఖానలకు స్పెషలిస్ట్ వైద్యులను ప్రకటించింది. నర్సింగ్, ఇతర సిబ్బందిని నియమించింది. రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగి కాంగ్రెస్ సర్కార్ వచ్చిన తర్వాత జిల్లా ఆసుపత్రులు, స్థానిక వైద్యుల మనుగడ ప్రశ్నార్ధకంగా మారింది.
కానరాని స్పెషలిస్ట్ వైద్యుల పోస్టులు..
జిల్లా సార్వజనీన ఆసుపత్రిని నాడు కేసీఆర్ ప్రభుత్వం ఖమ్మంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలకు అనుసంధానం చేసింది. ఆ క్రమంలో పెద్దాసుపత్రి డీఎంఈ పరిధిలోకి వెళ్లింది. దీంతో ఇక్కడ పనిచేస్తున్న వైద్య విధాన పరిషత్‌కు చెందిన వైద్యులు, నర్సింగ్, ఇతర సిబ్బంది అంతా ఏరియా ఆసుపత్రులుగా అప్‌గ్రేడ్ అయిన మధిర, సత్తుపల్లి, తిరుమలాయపాలెం, వైరా, నేలకొండపల్లి, పెనుబల్లి, కల్లూరులకు వెళ్లారు. వారిలో స్పెషలిస్ట్ వైద్యుల్లో సీనియర్లంతా ఖమ్మానికి దగ్గరలోని తిరుమలాయపాలెం, వైరా, నేలకొండపల్లి దవాఖానలను ఎంచుకున్నారు.
కాంగ్రెస్ సర్కార్ తీసుకున్న బదిలీల ప్రక్రియ ఆప్షన్లలో తిరుమలాయపాలెం, వైరా ఏరియా ఆసుపత్రుల్లో 100 బెడ్ల అప్‌గ్రేడ్‌తోపాటు స్పెషలిస్ట్ (ఈఎన్టీ, ఆర్ధోపెడిక్, ఆప్తమాలజీ, సివిల్ సర్జన్) పోస్టులు కానరావడం లేదు. ‘నాటి కేసీఆర్ సర్కార్ హయాంలో ఉన్న పోస్టులు ఇప్పుడెక్కడికి పోయాయి?’ అనే సందేహాన్ని పలువురు వైద్యులు వ్యక్తం చేశారు.
భద్రాచలం ఆసుపత్రిలోనూ అదే తంతు..
దీర్ఘకాలికంగా పనిచేస్తున్నారనే కారణంతో భద్రాచలం ఏరియా దవాఖానలో విధులు నిర్వర్తిస్తున్న తొమ్మిది మంది వైద్యులను ప్రభుత్వం బలవంతంగా బదిలీ చేసింది. ఇక్కడికి ఎవరైనా ఆఫ్షన్ ఇచ్చినా, ఇవ్వకపోయినా వెళ్లిపోవాల్సిందేనంటూ ఆదేశాలిచ్చింది. కొత్తగూడెంలోని సర్కారు దవాఖాన కూడా డీఎంఈ పరిధిలోకి వెళ్లడంతో స్పెషలిస్ట్ వైద్యులు మణుగూరు లేదా అశ్వారావుపేట ఏరియా దవాఖానల బాట పట్టాల్సిందే. పూర్తిగా ఏజెన్సీ ప్రాంతానికి చెందిన భద్రాచలం వెళ్లాలంటే ఏ ఒక్కరూ ముందుకు అడుగేయరు. ప్రమోషన్ ఇచ్చి పంపినా ప్రభుత్వ విభాగాలకు చెందిన వారు పనిష్మెంట్గానే భావిస్తారు.
అలాంటిది బదిలీల ప్రక్రియలో ఆప్షన్లు కోరితే ఎవరు వస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది. ఈ విధమైన జీవోలు జారీ చేయడం వల్ల తిరిగి యథాస్థానంలో కొనసాగించేందుకు వైద్యులు తమ వద్దకు వస్తే గట్టిగా చేతివాటం ప్రదర్శించవచ్చని రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులు భావిస్తున్నారేమోననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా, జిల్లా నుంచి ముగ్గురు మంత్రులు ప్రాతినిథ్యం వహిస్తున్నప్పటికీ కీలకమైన వైద్యరంగం పట్ల దృష్టిసారించడం లేదని వైద్యులు వాపోతున్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ganja Seized | వాహనాల తనిఖీలో ఐదు కిలోల గంజాయి స్వాధీనం..భార్యభర్తల అరెస్ట్
KCR | తెలంగాణ ప్రజలకు కేసీఆర్ దసరా పండుగ శుభాకాంక్షలు
Road accident | భవానీ భక్తులతో వెళ్తున్న బొలెరో బోల్తా.. ఇద్దరు దుర్మరణం
No Relief For CJP | అశుతోష్ రాంకా, సౌరవ్ దాస్‌లకు.. కస్టడీని పొడిగించిన కోర్టు
Mahabubnagar | ప్రైవేట్ భూముల్లో వీడియోలు.. రేవంత్ రెడ్డి అనుచరుడికి దేహశుద్ది
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

