కారేపల్లి, జూలై 02 : ఖమ్మం జిల్లా సింగరేణి మండల కేంద్రంలో గల కారేపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలను బుధవారం జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థల) శ్రీజ సందర్శించారు. స్థానిక ఎమ్మెల్యే సింగరేణి కాంగ్రెస్ సంస్థ నుండి మంజూరు చేపించిన రూ.30 లక్షలతో చేపడుతున్న కళాశాల భవన మరమ్మతు పనులను ఆమె పరిశీలించారు. ఇంటర్మీడియట్ బోర్డు నుండి మంజూరు చేసిన రూ.20.50 లక్షలతో చేపట్టబోయే పనులకు ప్రణాళికల రూపొందించాలని పంచాయతీరాజ్ అధికారులను ఆదేశించారు.
అనంతరం విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అధ్యాపకుల బోధన తీరుపై విద్యార్థులను ఆరా తీశారు. ప్రభుత్వ కళాశాలలో ప్రవేశాల సంఖ్యను పెంచాలని సిబ్బందికి సూచించారు. ఆమె వెంట డీఐఈఓ రవిబాబు, ఎంపీడీఓ సురేందర్, ఎంపీఓ రవీంద్ర ప్రసాద్, ఎంఈఓ జయరాజు, కళాశాల ప్రిన్సిపాల్ విజయ ఉన్నారు.