– రూ.3.15 లక్షల ఆస్తి నష్టం
ఎర్రుపాలెం, జూన్ 03 : ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం వెంకటాపురం ఎస్సీ కాలనీలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఇంట్లో అగ్నిప్రమాదం సంభవించి భారీ ఆస్తి నష్టం సంభవించింది. గ్రామానికి చెందిన కోట యేసు కుటుంబ సభ్యులతో కలిసి వేసవి కాలం కావడంతో మంగళవారం రాత్రి ఇంటి బయట నిద్రిస్తుండగా అర్ధరాత్రి సమయంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఇంట్లో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఇంట్లో ఉంచిన రూ.1.15 లక్షల నగదు పూర్తిగా దగ్ధమైంది. అదేవిధంగా సుమారు రూ.2 లక్షల విలువైన గృహోపకరణాలు, బట్టలు తదితర వస్తువులు మంటల్లో కాలిపోయాయి.
మొత్తంగా రూ.3.15 లక్షల మేర ఆస్తి నష్టం జరిగినట్లు బాధితుడు తెలిపాడు. విషయం తెలుసుకున్న గ్రామ సర్పంచ్ బొగ్గుల గోవర్ధన్ రెడ్డి సంబంధిత అధికారులకు సమాచారం అందించారు. అనంతరం బుధవారం రెవెన్యూ అధికారులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి పంచనామా నిర్వహించి ఉన్నతాధికారులకు నివేదిక పంపినట్లు తెలిపారు. తమకు జరిగిన నష్టాన్ని పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం, అధికారులు తగిన సహాయం అందించాలని బాధిత కుటుంబం కోరింది.