– బాలిక తిరిగి రాకపోవడంతో ఆందోళన
– విచారణలో సంబంధితుల జాడ వెలుగులోకి
– బాద్యులపై కారేపల్లి పీఎస్‌లో కేసు నమోదు
కారేపల్లి, జూలై 04 : కారేపల్లిలోని మైనార్టీ గురుకులంలో.శుక్రవారం సాయంత్రం విద్యార్థిని (మైనర్ బాలిక) హాస్టల్ నుండి బయటకు వెళ్లి తిరిగి రాకపోవడంపై శనివారం సంబంధిత అధికారులు పాఠశాలకు చేరుకుని విస్తృత స్థాయిలో విచారణ చేపట్టారు. ఎట్టకేలకు ఆ బాలిక జాడ తెలుసుకుని కారేపల్లి పోలీస్ స్టేషన్లో సంబంధితులను అప్పగించడంతో పోలీసులు భరోసా కేంద్రానికి తరలించారు. దీనికి బాధ్యులైన వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. గురుకుల పాఠశాలలో తల్లిదండ్రులు లేక అధికారికంగా గుర్తింపు పొందిన సంరక్షకులు స్వయంగా వస్తేనే విద్యార్థులను పాఠశాల నుండి పంపించాలన్న నిబంధనలను పక్కనబెట్టి, సరైన ధృవీకరణ లేకుండానే ఓ విద్యార్థినిని బయటి వ్యక్తులతో పంపించిన ఘటనపై మైనార్టీ గురుకుల పాఠశాలను సందర్శించిన విజిలెన్స్ అధికారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
విజిలెన్స్ అధికారుల సమాచారం ప్రకారం ఫోన్లో మాట్లాడిన వ్యక్తి వివరాలను నిర్ధారించకుండా, అతడి గుర్తింపును పరిశీలించకుండా, ఎలాంటి ధృవీకరణ ప్రక్రియ పాటించకుండా విద్యార్థినిని బయటకు పంపడం తీవ్రమైన నిర్లక్ష్యమన్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరించి ఉన్నతాధికారులకు నివేదిక సమర్పిస్తామని వెల్లడించారు. ఈ వ్యవహారంపై ప్రిన్సిపాల్‌ను వివరణ కోరగా తాను పాఠశాలలోనే ఉన్న సమయంలో ఓ మహిళ విద్యార్థినికి పిన్ని అని, “మా అక్క కూతురు” అంటూ లేఖ రాసి క్లాస్ టీచర్‌ను నమ్మబలికి తీసుకెళ్లినట్లు తెలిపారు. ఇదంతా ముందస్తు ప్రణాళిక ప్రకారమే జరిగినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని చెప్పారు. ఉపాధ్యాయులు ఈ ఘటనపై ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ప్రిన్సిపాల్ వెల్లడించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగుతోందని పేర్కొన్నారు.
మరోవైపు తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా విద్యార్థినిని ఎలా పంపించారని బాలిక తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు తెలిసింది. విద్యార్థినికి ఏదైనా జరిగి ఉంటే అందుకు పాఠశాల యాజమాన్యం, ముఖ్యంగా ప్రిన్సిపాల్ బాధ్యత వహించాల్సి ఉంటుందంటున్నారు. ఇదిలా ఉండగా రాత్రి వేళల్లో ప్రిన్సిపాల్ విద్యార్థులకు అందుబాటులో ఉండడం లేదని, బాధ్యతలను కాంట్రాక్ట్ బేసిక్ టీచర్లకు అప్పగించి సాయంత్రం ఐదు గంటలకే నివాసానికి వెళ్లిపోతున్నారని కొందరు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. విద్యార్థుల భద్రత వంటి అత్యంత కీలక అంశాల్లో యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇలాంటి ఘటనలు మరోసారి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.